Begin typing your search above and press return to search.

ఆంధ్రాలో గుబులు రేపుతున్న వ‌ల‌స‌లు

By:  Tupaki Desk   |   26 May 2018 8:39 AM GMT
ఆంధ్రాలో గుబులు రేపుతున్న వ‌ల‌స‌లు
X
అధికారం చేతిలో ఉంద‌న్న ధీమాతో అడ్డ‌గోలుగా ఎమ్మెల్యేల‌ను కొనుక్కుని ప్ర‌తిప‌క్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బ‌కొట్టాల‌ని ప్ర‌య‌త్నించిన చంద్ర‌బాబు నాయుడుకు గ‌త కొన్నాళ్లుగా ఆంధ్రాలో జ‌రుగుతున్న ప‌రిణామాలు తీవ్ర ఆందోళ‌న రేపుతున్నాయి. అధికారం అప్ప‌గిస్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను అగ్ర‌స్థానంలో నిల‌బెడ‌తా అని అధికారం ద‌క్కించుకున్న చంద్ర‌బాబు నాయుడు నాలుగేళ్లుగా అన్ని విధాలుగా మోసం చేయ‌డంతో ప్ర‌జ‌లు అస‌హ్యించుకుంటున్నారు. దీనికి సాక్ష్య‌మే గ‌త కొన్నాళ్లుగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున పెరిగిన వ‌ల‌స‌లు.

ప్ర‌తిప‌క్ష పార్టీలో చేరేందుకు ఎక్క‌డ‌యినా ఎన్నిక‌ల స‌మ‌యంలో అధికార పార్టీ నుండి టికెట్ రాక‌ - లేక అధికార పార్టీతో ఎందుకు అని ఆల‌స్యంగా చేర‌డం జ‌రుగుతుంది. కానీ ఎన్నిక‌లు ఇంకా ఏడాది దూరం ఉండ‌గానే వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వ‌ల‌స‌లు పెరిగాయి. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర సంధ‌ర్భంగా అనేక మంది పార్టీలోకి వ‌స్తున్నారు. అదీ తెలుగుదేశం పార్టీని వీడి వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.

విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుండి య‌ల‌మంచిలి ర‌వి జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఆ వెన‌కే మైల‌వ‌రం నుండి వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ వ‌చ్చిచేరారు. తూర్పు గోదావ‌రి జిల్లా నుండి జ్యోతుల చంటిబాబు - న‌ర‌సారావు పేట నుండి నాగేశ్వ‌ర్ రావులు సైకిల్ దిగి జ‌గ‌న్ పంచ‌న చేరారు. విశాఖ నుండి ప్ర‌ముఖ బిల్డ‌ర్ ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ పార్టీలో చేరి విశాఖ లోక్ స‌భ‌కు పోటీ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది.

ఆంధ్రాలో చంద్ర‌బాబు నాయుడు గ‌త నాలుగేళ్లుగా పాల‌న‌ప‌రంగా అన్నింటా విఫ‌ల‌మ‌య్యాడు. ప్ర‌జ‌ల నుండి తీవ్ర వ్య‌తిరేక‌త క‌నిపిస్తుంది. అయినా ఏ మాత్రం ఉదాసీన‌త లేకుండా వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ప‌క‌డ్భంధీగా ఎమ్మెల్యే - ఎంపీ అభ్య‌ర్థుల‌ను వైఎస్ జ‌గ‌న్ ఎంపిక చేసుకుంటున్న‌ట్లు తెలుస్తుంది. ప్ర‌జాబ‌లంతో పాటు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ధ‌న‌బ‌లం కూడా ముఖ్యం కాబ‌ట్టి ఆర్థికంగా ఉన్న వార‌యితే టీడీపీని గ‌ట్టిగా ఎదుర్కోగ‌లుగుతార‌ని భావించి పార్టీలోకి ఆహ్వానిస్తున్న‌ట్లు తెలుస్తుంది. ఒక‌వైపు ప్ర‌తిప‌క్ష పార్టీలో చేరేందుకు నేత‌లు బారులు తీరుతుంటే అధికార పక్షం వైపు అలాంటి స‌న్నివేశాలు క‌నిపించ‌డం లేద‌న్న బాధ‌ అధికార పార్టీని వేధిస్తుంది.