Begin typing your search above and press return to search.

రాజ్యసభ తెరపైకి కొత్త మొఖాలు

By:  Tupaki Desk   |   23 May 2016 6:09 AM GMT
రాజ్యసభ తెరపైకి కొత్త మొఖాలు
X
ఏపీలో రాజ్యసభ సీట్ల రేసు మొదలైంది. రాష్ట్రం నుంచి నాలుగు రాజ్యసభ స్ధానాలకు ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల నాలుగో వారంలో నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ నెల 31వ తేదీ వరకూ నామినేషన్లకు గడువు ఉంది. పోటీ తప్పని సరైతే జూన్ 11న పోలింగ్ నిర్వహిస్తారు. ప్రస్తుతం శాసనసభలో ఉన్న బలాబలాలను బట్టి మూడు సీట్లు టీడీపీ - ఒకటి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడానికి స్పష్టమైన అవకాశాలు ఉన్నాయి. కానీ ఇటీవల వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు టీడీపీలోకి వలసలు పెరుగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ తన సీటు గెలుచుకోగలుగుతుందా అని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి 67 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. వారిలో 17 మంది టీడీపీలో చేరారు. ఇంకొందరు ఇదే బాటలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరో 30 మంది ఎమ్మెల్యేలు బయటకువెళితే ఆ పార్టీ రాజ్యసభ సీటును గెలుచుకోవడం కష్టమని రాజకీయ వర్గాలు అంటున్నాయి. గతంలో వైసీపీలో పనిచేసి తర్వాత బయటకు వచ్చిన కొందరు నేతలు నాలుగో సీటుకు పోటీ చేసే అవకాశం తమకు ఇవ్వాలని టీడీపీ అధినాయకత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలతో తమకున్న సంబంధాలతో వారిలో కొందరి ఓట్లను తాము తెచ్చుకోగలమని, అవకాశం కల్పిస్తే ఖాయంగా గెలుస్తామని వారు చెబుతున్నారు. ఇద్దరు ముగ్గురు నేతలు ఇదే అభిప్రాయంతో టీడీపీ అధిష్ఠానాన్ని తరచూ కలుస్తున్నారు.

ఇలా ప్రయత్నిస్తున్న వీరిలో నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి ముందంజలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీ ఆవిర్భావం నుంచి ఇటీవలి వరకూ ఆ పార్టీలో వేమిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. కొంత కాలంగా ఆయన వైసీపీ అధినేత జగన్‌ కు దూరమై టీడీపీకి సన్నిహితంగా మారారు. రెండు మూడుసార్లు ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడును కూడా కలిశారు. జగన్ సొంత సామాజిక వర్గం నుంచి కొందరు బలమైన నేతలను చేర్చుకోవడం ద్వారా తమ బలాన్ని విస్తరింపచేసుకోవాలన్న వ్యూహంలో టీడీపీ ఉంది. ఆ కోణంలో వేమిరెడ్డికి ప్రాధాన్యం లభిస్తోందని అంటున్నారు.

ఇక పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పారి శ్రామికవేత్త రఘురామకృష్ణంరాజు కూడా నాలుగో సీటుకు పోటీపై ఆసక్తిగా ఉన్నారు. నాలుగో సీటుకు పోటీపై పార్టీ అధిష్ఠానం ఇంతవరకూ తన మనో గతం బహిర్గతం చేయలేదు. బలాబలాలపై అంచనాకు వచ్చాకే దీనిపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు నామినేషన్ల దాఖలుకు చివరి రెండు మూడు రోజుల్లో నిర్ణయం జరిగే అవకాశం ఉందని, అప్పటిదాక ఉత్కంఠ తప్పదని విశ్లేషకులు - పార్టీనాయకులు అంటున్నారు.

మరోవైపు టీడీపీ ఖాయంగా గెలుచుకునే అవకాశమున్న మూడు సీట్లకు కూడా పోటీ పెరుగుతోంది. కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి టీజీ వెంకటేష్ ఇటీవల తన సన్నిహితులతో ఢిల్లీ వెళ్లి అక్కడ చంద్రబాబును కలిశారు. ప్రధానితో భేటీలో పాల్గొనడానికి సీఎం ఢిల్లీ వెళ్లినప్పుడు ఈ బృందం ఆయనను కలిసి టీజీకి అవకాశమివ్వాలని కోరింది. దీనికోసం ఢిల్లీ రావడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారని, ఏదైనా ఉంటే రాష్ట్రంలో తనను కలవాలి తప్ప ఢిల్లీ వరకూ రావద్దని వారికి గట్టిగా చెప్పారని సమాచారం. గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ కూడా ఎన్టీఆర్ ట్రస్టుభవన్‌ లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ ను కలిసి రాజ్యసభకు తన పేరు పరిశీలించాల్సిందిగా కోరారు. నర్సరావుపేట టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుతో కలిసి ఆయన లోకేష్ వద్దకు వెళ్లారు. మంత్రి రావెల కిశోర్ బాబు కూడా వారితో కలిసి లోకేష్ వద్దకు వెళ్లారు.

గుంటూరు జిల్లాకే చెందిన మరో మాజీ మంత్రి జేఆర్ పుష్పరాజ్ ముఖ్యమంత్రిని కలిసి పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న తనకు అవకాశమివ్వాలని విజ్ఞప్తి చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే హేమలత లోకేష్‌ ను కలిసి దళిత మహిళగా తన పేరు పరిశీలించాలని కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో తన నియోజక వర్గంలో మొత్తం పార్టీ ఖర్చు అంతా తానే భరించానని, పార్టీకి ఆర్ధికంగా తాను ఏ సమయంలోనూ భారం కాలేదని ఆమె వివరించారు. కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఎన్ ఎండి ఫరూక్ కూడా రాజ్యసభ రేసులోకి వచ్చారు. రాయలసీమలో పెద్ద సంఖ్యలో ఉన్న మైనారిటీలను దృష్టిలో ఉంచుకొని తనకు అవకాశమివ్వాలని కోరుతున్నారు.

కాగా ప్రస్తుతం పదవీ కాలం ముగుస్తున్నవారు మరోసారి కొనసాగించాలని ఆశిస్తున్న తరుణంలో కొత్తగా పదుల సంఖ్యలో వీటిపై ఆశలు పెంచుకోవడంతో రాజ్యసభ సీట్ల ఎంపిక చంద్రబాబుకు తలనొప్పేనని తెలుస్తోంది.