జేసీకి షాకులిస్తున్న తెలుగు తమ్ముళ్లు.. మూకుమ్మడి విమర్శలతో ఒంటరి

Mon Sep 13 2021 14:06:40 GMT+0530 (IST)

tdp leaders giving shock to jc prabhakar reddy

పార్టీ ఏదైనా వారి తీరు మాత్రం భిన్నంగా ఉంటుంది. అధినేతకు.. అధికారంలో ఉన్న వారికి సలాం కొట్టే కన్నా.. తాము అనుకున్నది అనుకున్నట్లుగా మాట్లాడే అతికొద్ది మంది నేతల్లో జేసీ బ్రదర్స్ తీరు భిన్నంగా ఉంటుంది. సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే జేసీ దివాకర్ రెడ్డి గడిచిన కొద్దిరోజులుగా మీడియాకు దూరంగా ఉంటున్నారు. అదే సమయంలో తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి ఏదో ఒక విషయంపై మాట్లాడి వార్తల్లోదర్శనమిస్తున్నారు. అయితే.. ఆయన చేసిన వ్యాఖ్యలకు తెలుగుతమ్ముళ్లు తీవ్ర ఆగ్రహంతో వ్యక్తం చేస్తున్నారు.ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు వస్తే టీడీపీ గెలిచే పరిస్థితి లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు టీడీపీ నేతలకు బాగా కోపాన్ని తెప్పించింది. ఇప్పటికే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దెబ్బకు కకావికలమైన పార్టీకి.. జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి నేతల మాటలు మరింత నష్టాన్ని కలిగించేలా చేస్తాయన్న వాదన వినిపిస్తోంది. నిజానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ.. టీడీపీ నేతలందరి తీరు ఒకలా ఉంటే జేసీ బ్రదర్స్ తీరు మరోలా ఉండేది. ఎప్పటికప్పుడు సంచలన వ్యాఖ్యలతో వారు మీడియాలో కనిపించేవారు.

అధికారంలో ఉండటం.. జేసీ బ్రదర్స్ నోట్లో నోరు పెట్టటం ఎందుకన్న ఉద్దేశంలో కొందరు నేతలు కామ్ గా ఉంటే.. ప్రభాకర్ చౌదరి.. జితేందర్ గౌడ్ లాంటి వారు అప్పట్లోనే తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇందుకు భిన్నంగా సీనియర్ నేతలు పల్లె రఘునాథరెడ్డి .. పరిటాల వర్గం సైతం జేసీ సోదరుల తీరును తప్పు పట్టే ప్రయత్నం చేయలేదు. దీనికికారణం జిల్లాలో వారికున్న ఇమేజ్. జేసీ సోదరులు ఏ పార్టీలో ఉన్నా.. తమకంటూ ఇమేజ్ కలిగి ఉందన్న మాటకు తగ్గట్లే.. జగన్ గాలిలో అందరూ కొట్టుకుపోతున్నా.. జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించటం తెలిసిందే.

పార్టీ సహాయ సహకారాల మీద ఆధారపడకుండా.. మొత్తంగా సొంత బలాన్ని.. శక్తిని సమీకరించుకొని తలపడి.. తన సత్తా ఏమిటో చాటారు. తాను గెలవటం ద్వారా.. కొడిగడుతున్న టీడీపీ ఆశలకు కొత్త శక్తిని ఇచ్చారని చెప్పాలి. పార్టీ క్యాడర్ లోనూ కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. ఇలాంటి నేత నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం వల్ల పార్టీకి నష్టం వాటిల్లుతుందన్న భావన వ్యక్తమవుతోంది. గతంలో మాదిరి.. ఆయన ఏమన్నా అంటే.. సర్లే అన్నట్లు వదిలేయకుండా తాజాగా మాత్రం ఆయన వ్యాఖ్యలకు కౌంటర్లు ఇస్తున్నారు. నీ వల్లే పార్టీకి నష్టం.. పార్టీలో గ్రూపులుకట్టింది నువ్వే.. పార్టీని సర్వనాశనం చేస్తున్నావంటూ తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. తాజా పరిణామాల్ని చూస్తే.. అనంత జిల్లాలో టీడీపీ తమ్ముళ్లు అందరూ ఒకవైపు.. జేసీ సోదరులు మరోవైపు నిలిచిన వైనం కనిపిస్తోంది. మరీ..తన నోటిని కంట్రోల్ లో ఉంచుకోవటం ద్వారా.. ఒంటరిగా ఉన్న జేసీ.. మిగిలిన వారిని కలుపుకుపోతారా? లేదంటే.. తన తీరే అంతన్నట్లు నిలుస్తారా? అన్నది కాలమే తేల్చాలి.