Begin typing your search above and press return to search.

గంటా ఇలాకాలో నేతలకు కొత్త కష్టం..

By:  Tupaki Desk   |   28 April 2016 7:34 AM GMT
గంటా ఇలాకాలో నేతలకు కొత్త కష్టం..
X
ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఇటీవల కొద్దికాలంగా సీఎం చంద్రబాబు వద్ద సీను కాలిపోయిన సంగతి తెలిసిందే. గంటా వ్యవహారాల గురించి తెలుసుకున్న చంద్రబాబు ఆయన విషయంలో కఠినంగా ఉంటున్నారు. గంటా వద్ద నుంచి వచ్చే ఫైళ్లను తనకు చెప్పకుండా ఓకే చేయొద్దని కూడా అధికారులకు చంద్రబాబు సూచించినట్లు చెబుతున్నారు. ఇంతకుముందు చంద్రబాబు వద్ద మంచి పట్టున్న గంటా సీను ఒక్కసారిగా రివర్సవడంతో ఆయన అనుచరగణం జాగ్రత్త పడుతున్నారు.

ఈ దెబ్బతో గంటా పని అయిపోయిందని ఆయన్ను విడిచిపెట్టేయకుండా ఆయన వెంట ఉంటూనే చంద్రబాబు - లోకేశ్ పట్ల విధేయతను చాటుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా గంటాకు సన్నిహిత నేతగా పేరున్న అనకాపల్లి ఎంపీ అవంతి శ్రినివాస్ - అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ లు తమ తాజా ప్రకటనలతో లోకేశ్ బాబు దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. లోకేశ్ కోసం తాము రాజీనామా చేస్తామంటూ వారు పోటాపోటీగా ప్రకటనలు చేస్తున్నారు.

లోకేశ్ బాబును కేంద్ర కేబినెట్లోకి తీసుకోవాలని అందుకోసం ఆయన్ను బంపర్ మెజారిటీతో అనకాపల్లి నుంచి గెలిపించుకుంటామని... ఆయన కోసం తాను రాజీనామా చేస్తానని అవంతి శ్రీనివాస్ ఊగిపోతున్నారు. మరోవైపు అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ కూడా అవంతి శ్రీనివాస్ కు పోటీగా ప్రకటన చేశారు. లోకేశ్ ను రాష్ట్ర కేబినెట్ లోకి తీసుకోవాలని తన సీటును ఆయనకిచ్చేస్తానని.. లక్ష మెజారిటీతో చినబాబును గెలిపిస్తానని ప్రకటించారు. లోకేశ్ బుధవారం విశాఖలో పర్యటించినప్పుడు అనకాపల్లి ఎంపీ - ఎమ్మెల్యేలు ఇద్దరూ ఆయన ముందు తమ విశ్వాసాన్ని ప్రకటించుకున్నారు.

గంటా ఎఫెక్టు తమపై పడకుండా ఉండేందుకే ఈ నేతలిద్దరూ లోకేశ్ సమక్షంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారని... లోకేశ్ ను ప్రస్తుతానికి కేబినెట్ లోకి తీసుకునే అవకాశాలు లేవని చంద్రబాబు ఇప్పటికే చెప్పినప్పటికీ వీరు ఇలా ప్రకటించడం వెనుక కారణం అదేనని తెలుస్తోంది.