Begin typing your search above and press return to search.

జగన్ ఇమేజ్ డ్యామేజ్ చేసేలా.. ‘హోల్ సేల్ రెడ్డి’ వ్యాఖ్యలు చేసిందెవరు?

By:  Tupaki Desk   |   22 March 2021 3:16 AM GMT
జగన్ ఇమేజ్ డ్యామేజ్ చేసేలా.. ‘హోల్ సేల్ రెడ్డి’ వ్యాఖ్యలు చేసిందెవరు?
X
ఏపీలో అధికార.. విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం అంతకంతకూ ముదురుతోంది. తాజాగా టీడీపీకి చెందిన కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. అంతేకాదు.. ఇప్పటివరకు వినిపించని కొత్త మాట ఆయన నోట్లో నుంచి వచ్చింది. దేశంలోని వ్యాపారులంతా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని హోల్ సేల్ రెడ్డిగా పిలుస్తారన్నారు. దీనికి కారణం.. ఆయన ఏదైనా సరే హోల్ సేల్ గా దోచుకోవటమే ఇష్టమని.. అందుకే అలా పిలుస్తారంటూ ఘాటు ఆరోపణలు చేశారు.

ఏడాదికి రూ.3500 కోట్ల నష్టాల్ని చూస్తున్న జేపీ పవర్ వెంచర్స్ కంపెనీకి ఇసుక రీచ్ లను అప్పగించటం మతలబు ఏమిటో చెప్పాలన్నారు. రాష్ట్ర మంతా ఇసుక వ్యాపారాన్ని కట్టబెట్టిన జేపీ పవర్ వెంచర్స్ దివాలా కంపెనీ అని.. సీఎం గతంలో కొనుగోలు చేయాలనుకున్న కంపెనీలోని డైరెక్టరే ఇందులోనూ ఉన్నట్లుగా వ్యాఖ్యానించారు. ఆ సందర్భంగా పట్టాభిరామ్ చేసిన ఆరోపణల పరంపర చూస్తే..

- జగన్ రెడ్డికి సన్నిహితుడైన వైసీపీ ఎంపీ రాంకీ అయోధ్య రామిరెడ్డికి చెందిన రాంకీ కంపెనీలో.. గతంలో జగన్ కొనాలనుకున్న ఎథెనా పవర్ లిమిటెడ్ కంపెనీలో డైరెక్టర్ గా పెద్దిబొట్ల గంగాధరశాస్త్రి పని చేశారు. ఆయనే.. జేపీ పవర్ వెంచర్స్ లో డైరెక్టర్ గా పని చేశారు. గంగాధర శాస్త్రిని అడ్డు పెట్టుకొని.. జగన్ రెడ్డి జేపీ వెంచర్స్ తో క్విడ్ ప్రో కో ఒప్పందం చేసుకున్నారు.

- జేపీ పవర్ వెంచర్స్ గడిచిన నాలుగైదేళ్లుగా నష్టాల్లో ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.3,500 కోట్ల నష్టాన్ని ప్రకటించిన సంస్థకు ఏ రకంగా 13 జిల్లాల్లోని ఇసుక రీచ్ లను ఎలా నిర్వహించగలరు?

- ఆ సంస్థకు కనీసం రూ.2వేల కోట్ల ఆదాయం లేకుంటే ప్రభుత్వానికి రూ.765 కోట్లు కట్టగలదా? జేపీ వెంచర్స్ ముసుగులో వేల కోట్లు దిగమింగేందుకు సిద్ధమయ్యారు. జగన్ సీఎం అయ్యాక చిల్లరమల్లర వ్యాపారాల్ని పక్కన పెట్టేశారన్నారు. అంతా టోకు వ్యాపారమే చేస్తున్నారు. మద్యం వ్యాపారాన్నే తీసుకుంటే.. రాష్ట్రంలో 3500 మద్యం దుకాణాలకు హోల్ సేల్ యజమాని ఆయనే.

- సొంత బెవరేజెస్.. డిస్టలరీలతో సొంత బ్రాండ్లనే అమ్ముతున్నారు. తర్వాత సిమెంటు వ్యాపారాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని.. సిండికేట్ ఏర్పాటు చేసి సిమెంట్ ధరల్ని అమాంతం పెంచేశారు. ఇలా సిమెంటు.. మద్యం వ్యాపారాల్ని తన గుప్పిట్లో పెట్టుకున్న జగన్ ఇప్పుడు జేపీ పవర్ వెంచర్స్ కు ఇసుక రీచ్ లను కట్టబెట్టారన్నారు. మరి.. ఈ ఘాటు ఆరోపణలపై వైసీపీ ఎలా రియాక్టు అవుతుందో చూడాలి.