Begin typing your search above and press return to search.

వైసీపీ నేత హ‌త్య‌కు స్కెచ్ వేసిన టీడీపీ

By:  Tupaki Desk   |   29 Jun 2017 3:41 PM GMT
వైసీపీ నేత హ‌త్య‌కు స్కెచ్ వేసిన టీడీపీ
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో హ‌త్యా రాజ‌కీయాలు పెరిగిపోతున్నాయ‌ని ప‌లువురు ఆందోళ‌న‌లు వ్యక్తం చేస్తున్న నేప‌థ్యంలో తాజాగా అలాంటి వార్త ఒక‌టి తెర‌మీద‌కు వచ్చింది. ప్ర‌తిప‌క్ష వైసీపీ నేత‌ను హ‌త్య చేసేందుకు అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ప్ర‌జాప్ర‌తినిధి ఒక‌రు స్కెచ్ వేసిన వార్త క‌ల‌క‌లం సృష్టిస్తోంది. అది కూడా ఇటీవ‌ల ప‌లు సంద‌ర్భాల్లో తెర‌మీద‌కు వ‌స్తున్న దెంద‌లూరు నియోజ‌క‌వ‌ర్గంలో కావ‌డం విశేషం. ఏకంగా సుపారీ మాట్లాడుకొని అడ్వాన్స్ కూడా తీసుకున్న స‌మ‌యంలో ఇది బ‌య‌ట‌కు రావ‌డం గ‌మ‌నార్హం.

ప‌లు ప్ర‌సార మాధ్య‌మాల్లో వ‌స్తున్న వార్త‌ల ప్ర‌కారం దెందులూరు మండలం శ్రీరామవరానికి చెందిన వైసీపీ కార్యకర్త కొత్తపల్లి రమేశ్ ను హత్య చేసేందుకు స్థానిక టీడీపీ ఎంపీటీసీ శోభన్ బాబు సిద్ధ‌ప‌డ్డారు. ఈ క్ర‌మంలో హ‌త్య చేసేందుకు స్థానికంగా ఉండే రౌడీ షీట‌ర్ బ్రహ్మానందంతో బేరం కుదుర్చుకున్నారు. ఈ క్ర‌మంలో రూ.25 వేలు అడ్వాన్స్ సైతం ముట్ట‌జెప్పిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఇలా హ‌త్య చేసేందుకు ఒప్పుకొన్న బ్రహ్మానందం కార‌ణంగానే ఈ విష‌యం తెర‌మీద‌కు వ‌చ్చింది. ముందుగా హ‌త్య చేసేందుకు అంగీక‌రించిన బ్ర‌హ్మనందం ఆ త‌ర్వాత ప‌లు కార‌ణాల వ‌ల్ల ఆ ఆలోచ‌న‌ను విర‌మించుకున్నాడు.

త‌న హ‌త్య‌కు కుట్ర‌ప‌న్న‌డం - రౌడీ షీట‌ర్ బ్ర‌హ్మానందం ఆ హ‌త్య నుంచి వెన‌క్కు త‌గ్గిన ఉదంతం వైసీపీ నేత ర‌మేశ్ చెవిన ప‌డింది. దీంతో ర‌మేశ్ పోలీసుల‌ను ఆశ్ర‌యించి త‌న హ‌త్య‌కు జ‌రిగిన స్కెచ్ గురించి వివ‌రించాడు. ర‌మేశ్ ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు. మ‌రోవైపు ఇటీవ‌లే సాక్షాత్తు దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌ పై హ‌త్యాయ‌త్నం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/