Begin typing your search above and press return to search.

జగన్‌ ను పరామర్శించిన టీడీపీ నేత!

By:  Tupaki Desk   |   1 Nov 2018 10:27 AM IST
జగన్‌ ను పరామర్శించిన టీడీపీ నేత!
X
జగన్‌ పై జరిగిన హత్యాన్ని ఖండించకపోగా.. ఖండించినవారీని ఎందుకు ఖండించారని నిలదీస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు - ఆ పార్టీ మంత్రులు - ఇతర నేతలకు భిన్నంగా ఓ టీడీపీ నేత జగన్‌ ను పరామర్శించడానికి వెళ్లారు. పార్టీలకతీతంగా ఎందరో నేతలు జగన్ మోహన రెడ్డిని పరామర్శిస్తున్నప్పటికీ టీడీపీ నేతలు మాత్రం కనీసం సానుభూతి చూపకపోగా ఎదురుదాడి చేస్తున్నారు. ఇలాంటి సమయంలో టీడీపీకే చెందిన మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి మాత్రం చంద్రబాబు వైఖరితో సంబంధం లేకుండా స్పందించారు. స్వయంగా ఆయన జగన్‌ ను పరామర్శించారు.

అనంతపురం మాజీ ఎమ్మెల్యే అయిన గుర్నాథరెడ్డి కొన్నాళ్ల కిందట వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. జగన్ తో విభేదించి వెళ్లిపోయారు. రాజకీయంగా విభేధించినా జగన్ ప్యామిలీతో గుర్నాథరెడ్డి ఫ్యామిలీకి మంచి సంబంధాలున్న నేపథ్యంలో జగన్‌ పై దాడి జరిగాక పరామర్శించకుండా ఉండలేకపోయారాయన. వైఎస్ హయాంలో రాజకీయంగా ఎదిగిన గుర్నాథరెడ్డి వైసీపీలో జగన్ వెంటే ఉన్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో టికెట్ రాకపోవచ్చన్న అంచనాతో టీడీపీలోకి వెళ్లారు. అయితే, ఇప్పుడు ఆయన పార్టీల మధ్య విభేదాలను పక్కనపెట్టి జగన్ మోహనరెడ్డిని పరామర్శించారు.

కాగా గుర్నాథరెడ్డి చర్యను టీడీపీ నేతలు తప్పు పడుతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు ఈ వ్యవహారంపై ఒక స్టాండ్‌ తో ఉండి.. దిల్లీలో సైతం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడగా.. గుర్నాథరెడ్డి ఇలా చేయడం కరెక్టు కాదని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. అయితే.. గుర్నాథరెడ్డి మాత్రం దీనికి రాజకీయ రంగు అద్దాల్సిన అవసరం లేదని.. జగన్‌ తో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో ఆయన్ను పరామర్శించానని.. అందులో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు.