Begin typing your search above and press return to search.

మోహ‌న్ బాబుపై అనురాధ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

By:  Tupaki Desk   |   2 April 2019 7:27 AM GMT
మోహ‌న్ బాబుపై అనురాధ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!
X
టాలీవుడ్ లో కొంత‌మందిని వేలెత్తి చూపించే సాహ‌సం ఎవ‌రూ చేయ‌లేరు. అలాంటి వారిలో మోహ‌న్ బాబు పేరు మొద‌టి వ‌రుస‌లో ఉంటుంద‌న్న మాట త‌ర‌చూ వినిపిస్తూ ఉంటుంది. ఆయ‌న‌ ఏమైనా మాట్లాడొచ్చు కానీ ఆయ‌న్ను మాత్రం ప‌ల్లెత్తు మాట అన‌కూడ‌ద‌న్న‌ట్లుగా సినీ వ‌ర్గాలు చెబుతూ ఉంటాయి. సినిమా రంగంలో ఉన్నంత వ‌ర‌కూ ఇలాంటి రిజ‌ర్వేష‌న్లు ఉంటాయేమో కానీ.. ఒక‌సారి రాజ‌కీయాల్లోకి అడుగుపెడితే క‌డిగిపారేస్తుంటారు.

ఇటీవ‌ల ఏపీ ప్ర‌భుత్వం తీరును తప్పు ప‌డుతూ విద్యార్థుల‌తో ధ‌ర్నా నిర్వ‌హించిన ఆయ‌న‌.. అంద‌రూ ఊహించిన‌ట్లే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

పార్టీలో చేరిన ఆయ‌న త‌న ప‌ని తాను చేసుకుంటూ వెళ్లినా ఓకే. కానీ.. తెలుగుదేశం పార్టీ మీదా.. చంద్ర‌బాబు మీద ఆయ‌న చేసిన విమ‌ర్శ‌ల‌కు తాజాగా టీడీపీ అధికార ప్ర‌తినిధి పంచుమ‌ర్తి అనురాధ మోహ‌న్ బాబు చిట్టా విప్పారు. పంచ్ డైలాగుల‌తో మోహ‌న్ బాబును మాట‌ల‌తో క‌డిగిపారేసిన తీరు సంచ‌ల‌నంగా మారింది. మోహ‌న్ బాబును ఒక మాట అనాలంటేనే ముందు వెనుకా ఆలోచించే తీరుకు భిన్నంగా మొహ‌మాటం లేకుండా విమ‌ర్శ‌ల‌తో చీల్చి చెండాడిన వైనం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

ఎక్కడైనా త‌ప్పుడు ప‌ని చేసేటోళ్ల‌ను.. నువ్వు మ‌నిషివా.. మోహ‌న్ బాబువా? అంటార‌ని.. అలా ఎందుకు అంటారో.. ఆ సామెత ఎందుకు పుట్టిందో మోహ‌న్ బాబు గుర్తెర‌గాలి. వెన్నుపోటు గురించి మాట్లాడుతున్న మోహ‌న్ బాబు సంగ‌తి అడిగితే ల‌క్ష్మీపార్వ‌తే చెబుతార‌న్నారు. పాతికేళ్ల కింద‌ట నిమ్స్ లో సిబ్బంది ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తే చీపుళ్ల‌తో త‌రిమి కొట్టిన విష‌యాన్ని మోహ‌న్ బాబు మ‌ర్చిపోయారా? అంటూ ప్ర‌శ్నించారు.

ఒక‌ట్రెండు విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌ల‌తో స‌రిపెడితే ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేదు. మోహ‌న్ బాబు చిట్టాను భారీగా విప్పిన అనురాధ మ‌రిన్ని విమ‌ర్శ‌లు చేశారు. ఎయిర్ హోస్టెస్ తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన చ‌రిత్ర మోహ‌న్ బాబుద‌ని.. సీనియ‌ర్ న‌టి జ‌యంతి చేతిలో చెప్పుదెబ్బ‌లు తిన్న ఘ‌న‌త‌.. సాక్షి శివానంద్ పై దాడి చేసిన హిస్ట‌రీ మోహ‌న్ బాబు సొంతంగా చెప్పుకొచ్చారు.

కొడుకు ప్రేమ వ్య‌వ‌హారం ఒక టీవీ చాన‌ల్ లో చూపిస్తే.. తుపాకీ తీసుకొని వెళ్లి మీడియా సిబ్బందిని బెదిరించ‌లేదా? అని ప్ర‌శ్నించిన అనురాధ‌.. మోహ‌న్ బాబుపై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. మ‌రో టీడీపీ నేత క‌మ్ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న మాట్లాడుతూ.. మోహ‌న్ బాబు ఊస‌ర‌వెల్లితో స‌మాన‌మ‌న్న ఆయ‌న‌.. మేజ‌ర్ చంద్ర‌కాంత్ సినిమాలో యాక్ట్ చేసినందుకు ఎన్టీఆర్ కు ఇవ్వాల్సిన పారితోష‌కాన్ని ఎగ్గొట్టార‌న్నారు. చివ‌ర‌గా.. ఆయ‌న నోటి నుంచి మ‌రో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య వినిపించింది. మోహ‌న్ బాబు కానీ ఉత్త‌ముడ‌ని ల‌క్ష్మీపార్వ‌తి స్టేట్ మెంట్ ఇస్తే తాను రాజ‌కీయాల నుంచి త‌ప్పు కుంటాన‌ని స‌వాలు విసిరారు. మోహ‌న్ బాబు.. తెలుగుదేశం పార్టీ నేత‌లు త‌న్నుకుంటూ మ‌ధ్య‌లో ల‌క్ష్మీపార్వ‌తిని ఇబ్బంది పెట్ట‌టం ఏమిటి త‌మ్ముడు?