Begin typing your search above and press return to search.

అచ్చెన్న కామెంట్... నిజమా? అబద్ధమా?

By:  Tupaki Desk   |   21 Oct 2020 10:45 AM IST
అచ్చెన్న కామెంట్... నిజమా? అబద్ధమా?
X
కొత్తగా అధ్యక్షునిగా నియమితుడైన కింజరాపు అచ్చెన్నాయుడు ఇచ్చిన ఇంటర్వ్యూలోని కొన్ని అంశాలు మరీ విచిత్రంగా ఉన్నాయి. అధ్యక్షుడు కాగానే అబద్ధాలు చెప్పటం మొదలుపెట్టారే అన్నట్లుగా ఉంది ఆయన చెప్పిన మాటలు. ఇంతకీ విషయం ఏమిటంటే పోయిన ఎన్నికల్లో అమరావతే ప్రధాన అంశంగా తెలుగుదేశంపార్టీ ఎన్నికలకు వెళ్ళిందట. ఇదే అంశంపైన వైసీపీ కూడా ఎన్నికల్లో ప్రస్తావించిందట. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పింది కాబట్టి వైసీపీ ఎంఎల్ఏలు వెంటనే రాజీనామాలు చేయాలట. ఇది అచ్చెన్న చేసిన తాజా డిమాండ్.



ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పోయిన ఎన్నికల్లో అమరావతి అంశంగా రెండు పార్టీలూ ఎన్నికలకు వెళ్ళలేదు. ఎందుకంటే 2014లో గెలవగానే చంద్రబాబునాయుడు ఏకపక్షంగా అమరావతిని రాజధానిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ అందరికీ తెలిసిందే. రాజధానిని బ్రహ్మాండంగా కట్టేసినట్లు బిల్డప్ ఇచ్చుకున్న టీడీపీ మళ్ళీ ఇదే అంశంగా ఎన్నికలకు ఎక్కడ వెళ్ళింది ?

ఇదే సమయంలో అమరావతి ఎన్నికల అంశంగా వైసీపీ ప్రకటించే లేదు. పైగా ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై తాము అధికారంలోకి వస్తే విచారణ జరిపిస్తామన్న విషయాన్ని ఎన్నికల సభల్లో జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా ప్రకటించారు. కొన్ని సందర్భాల్లో సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాత్రం అమరావతిని మార్చేది లేదని మీడియా ప్రశ్నలకు సమాధానలు చెప్పింది మాత్రం వాస్తవం. వాస్తవం ఇలాగుంటే రెండు పార్టీల అమరావతి అంశమే ఎన్నికలను ఎదుర్కొంటున్నట్లు అచ్చెన్నకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏమోచ్చింది ?

అమరావతే ఎన్నికల అంశం అయ్యుంటే మరి రాజదాని నియోజకవర్గమైన తాడికొండలో టీడీపీ ఓటమికి అచ్చెన్న ఏమని సమాధానం చెబుతారు ? తాడికొండతో పాటు మంగళగిరిలో కూడా టీడీపీ ఓడిపోయింది కదా. ఈ విషయాన్ని పక్కనపెట్టేసినా రాజధాని జిల్లాలైన గుంటూరు, కృష్ణాలో కూడా అత్యధిక సీట్లలో టీడీపీ ఓడిపోయింది కాబట్టి జనాలు అమరావతి కాన్సెప్టును తిరస్కరించినట్లు అచ్చెన్న అంగీకరిస్తారా ?

ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే మొత్తం 34 సీట్లో టీడీపీ గెలిచింది కేవలం ఆరుసీట్లే. అంటే జనాలు తమ పాలనను తిరస్కరించినట్లే కదా. ఇంతోటి దానికి అమరావతి అంశంపై ఉత్తరాంధ్రలోని ఎంఎల్ఏలు రాజీనామా చేద్దామని అచ్చెన్న చేసిన సవాలు విచిత్రంగా ఉంది. టీడీపీ తరపున గెలిచిన ఆరుమంది ఎంఎల్ఏల కోసం వైసీపీ తరపున గెలిచిన 28 మంది ఎంఎల్ఏలు రాజీనామాలు చేస్తారా ? మరి ఇదే సందర్భంలో విశాఖనగరంలో గెలిచిన నలుగురు టీడీపీ ఎంఎల్ఏలను రాజీనామాలు చేయిస్తే ఉపఎన్నికలకు వెళదామని వైసీపీ నేతలు చేస్తున్న సవాలుకు చంద్రబాబు కానీ అచ్చెన్న కానీ ఎందుకు స్పందించటం లేదు ?