Begin typing your search above and press return to search.

టీడీపీ స్క్రిప్ట్ నే సుజనా చౌదరి చదువుతాడా?

By:  Tupaki Desk   |   29 Aug 2019 11:07 AM IST
టీడీపీ స్క్రిప్ట్ నే సుజనా చౌదరి చదువుతాడా?
X
గతంలో టీడీపీ నేతలు ఎవరు ఏం మాట్లాడాలన్నా దానికి ఎన్టీఆర్ భవన్ నుంచి స్క్రిప్ట్ వస్తుందనే మాట వినిపించేది. తెలుగుదేశం నేతలందరికీ అక్కడ నుంచినే ప్రసంగ పాఠాలు తయారు చేయించి ఇచ్చే వారంటారు. బహుశా సుజనా చౌదరికి ఇప్పుడు కూడా టీడీపీ ఆఫీసు నుంచే స్క్రిప్ట్ వస్తోందా..అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పరిశీలకులు. సుజనా చౌదరి ఇటీవలే పార్టీ మారిన సంగతి తెలిసిందే.

ఆయన తెలుగుదేశం పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలోకి చేరారు. అయినా మార్పు మాత్రం ఏమీ లేదు. అచ్చం తెలుగుదేశం పార్టీ నేతలానే ఆయన ప్రసంగాలు కొనసాగుతూ ఉన్నాయి. దీంతో ఇప్పుడు కూడా ఆయనకు టీడీపీ ఆఫీసు నుంచినే ప్రసంగాలు వస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి.

అమరావతి వ్యవహారంలో సుజనా చౌదరి స్పందిస్తున్న తీరు తెలుగుదేశం పార్టీ అజెండా ప్రకారమే ఉంది. భారతీయ జనతా పార్టీ ముసుగులో సుజనా చౌదరి తెలుగుదేశం పార్టీ అజెండానే అమలు పెడుతూ ఉండటమే ఇక్కడ గమనార్హం. రాజధాని ప్రాంతంలో సుజనా చౌదరి పర్యటనలో కూడా అంతా తెలుగుదేశం పార్టీ వాళ్లే కనిపించారని స్థానికులు చెబుతున్నారు. పచ్చుకండువాలు తీసి వాళ్లంతా కాషాయ కండువాలు వేసుకుని వచ్చారని - అలా తెలుగుదేశం పార్టీ గుంపు సుజనా వెంట నడిచి.. ఆ కాసేపూ డ్రామాను రక్తి కట్టించిందని తెలుస్తోంది.

ఇక రాజధాని ప్రాంతంలో తనకు భూములు లేవంటూ సుజనా చౌదరి చేసిన ప్రకటన కూడా విమర్శల పాలైంది. ఆరు వందల ఇరవై మూడు ఎకరాల భూమి చౌదరి బినామీల పేరు మీద - ఆయన కుటుంబీకుల పేర్ల మీదుందని ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ బీజేపీ ఎంపీ తెలుగుదేశం అజెండా ప్రకారమే నడుచుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.