Begin typing your search above and press return to search.

ఆ ఒక్క మాట : టీడీపీ రాజకీయ తీర్మానం ఇంటెరెస్టింగ్?

By:  Tupaki Desk   |   28 May 2022 2:30 AM GMT
ఆ ఒక్క మాట : టీడీపీ రాజకీయ తీర్మానం ఇంటెరెస్టింగ్?
X
తెలుగుదేశం పార్టీ రాజకీయ అనుభవం అపారం. ఆ పార్టీ మహానాడు వంటి కార్యక్రమాలను ఎపుడూ ఆషామాషీగా జరపదు. పార్టీ ఆలోచనలకు అద్దం పట్టేలాగానే అనేక తీర్మానాలు కూడా అక్కడ ఆమోదిస్తారు. టీడీపీ వైఖరి ఆలోచనలు, వేసే అడుగులు ఎలా ఉంటాయి అన్నది పలు తీర్మానాల ద్వారా వెల్లడి అవుతాయి.

ఇదిలా ఉండగా టీడీపీ మహానాడు అనగానే అంతా ఆసక్తిగా ఎదురుచూసేది రాజకీయ తీర్మానం గురించే. ఎందుకంటే చాలా కాలంగా ఏపీలో పొత్తుల మీద టీడీపీ పరోక్షంగా మాట్లాడుతూ వస్తోంది. అలాగే టీడీపీ అధినాయకుడు చంద్రబాబు అయితే అందరూ కలసి వచ్చి వైసీపీ సర్కార్ ని ఇంటికి పంపాలని చాలా సార్లు పిలుపు ఇచ్చారు.

ఈ నేపధ్యంలో టీడీపీ రాజకీయ తీర్మానంలో ఆ ఒక్క మాట ఉంటుందా అన్నదే అందరూ ఆసక్తిగా చూస్తారు. అయితే చాలా విషయాలు రాజకీయ తీర్మానంలో ప్రస్థావించారు కానీ పొత్తుల విషయం మాత్రం ఎక్కడా లేదు. అంటే ఇప్పటికి ఇంతే అని సరిపెట్టుకోవాలా లేక ఇదే టీడీపీ ఆలోచనగా భావించాలా అన్నదే చూడాల్సి ఉంది.

దీనికి ముందు గత ఏడాది జూమ్ మీటింగ్ ద్వారా జరిగిన మహానాడులో కూడా కేంద్రంలోని బీజేపీ సర్కార్ కి అంశాలవారీగా మద్దతు ఇస్తామని టీడీపీ రాజకీయ తీర్మానంలో పేర్కొనడం ద్వారా సంచలనం రేకెత్తించింది. దాని మీద రాజకీయ రచ్చ చాలానే జరిగింది. కామ్రేడ్స్ అయితే బీజేపీ వైపు మళ్ళీ టీడీపీ చూస్తోందని కూడా అన్నారు.

ఇపుడు చూస్తే అలాంటి విషయాలు అయితే ఎక్కడా లేవు. అంటే బీజేపీ విషయంలో టీడీపీ పొలిటికల్ స్టాండ్ ఏమైనా మారిందా అన్న చర్చ కూడా సాగుతోంది. అదే విధంగా పదే పదే వన్ సైడ్ లవ్ అంటూ మాట్లాడిన టీడీపీ ఇపుడు అన్ని పార్టీలు కలవాలంటూ ఏపీ రాజకీయాల మీద తీర్మానంలో పేర్కోనకపోవడం పైనా చర్చ సాగుతోంది.

మరి దీన్ని ఎలా చూడాలీ అన్న విశ్లేషణ వచ్చినపుడు పొత్తుల మీద మాట అన్నది చాలా తొందరపాటు అవుతుంది అనే టీడీపీ లౌక్యంగా తీర్మానం చేసి ఉంటుందని అంటున్నారు. పొత్తులు అన్నవి ఎన్నికలకు కొద్ది నెలల ముందు కుదురుతాయి. దాని గురించి ఇప్పటి నుంచే చెప్పుకుని రచ్చ చేసుకోవడం ఎందుకు అన్న తెలివిడితోనే సస్పెన్స్ లో ఉంచారు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే టీడీపీ పొత్తుల మాట ఎత్తినపుడల్లా వీక్ గా ఆ పార్టీ ఉందని వైసీపీ లాంటివి ప్రచారం చేస్తున్నాయి. ఇక విపక్షాలు కూడా టీడీపీ బలహీనం అయింది కాబట్టే తమ వైపు చూస్తోంది అని అడ్వాంటేజి గా దాన్ని తీసుకుంటున్నాయి. దాంతో తాము పెదవి విప్పి ముందే బయటపడిపోవడం ఎందుకు అన్న దూర దృష్టితోనే టీడీపీ ఇలా వ్యవహరించింది అంటున్నారు. మొత్తానికి టీడీపీ రాజకీయ తీర్మానం ఇంటెరెస్టింగ్ గానే ఉంది. అదే సమయనంలో రాజకీయ తెలివిడితో ఉంది. అలాగే సాటి విపక్షాలకు కూడా కాస్తా ఝలక్ ఇచ్చినట్లుగా ఉంది అని అంటున్నారు.