Begin typing your search above and press return to search.

టీడీపీకి షాక్‌: వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   8 Dec 2018 12:18 PM IST
టీడీపీకి షాక్‌: వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే
X
ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో రాజ‌కీయాలు మ‌రింత వేడెక్కుతున్నాయి. టికెట్ల వేట‌లో నేత‌లు పార్టీలు మారుతున్నారు. సొంత పార్టీల‌కు షాకిస్తున్నారు. తాజాగా అనంత‌పురంలో టీడీపీకి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ఓ కీల‌క నేత పార్టీని వీడారు.

ప్ర‌స్తుతం బాల‌కృష్ణ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న హిందూపురం నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘ‌నీ టీడీపీకి రాజీనామా చేశారు. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తోనే తాను పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్లు చంద్ర‌బాబుకు రాసిన లేఖ‌లో ఆయ‌న పేర్కొన్నారు. అయితే - చంద్ర‌బాబుకు రాజీనామా లేఖ పంపిన వెంట‌నే ఘ‌నీ వైసీపీలో చేర‌డం గ‌మ‌నార్హం. శ్రీ‌కాకుళంలో జ‌గ‌న్‌ ను క‌లిసిన ఆయ‌న వైసీపీ కండువా క‌ప్పుకున్నారు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుంచి ఘ‌నీ ఆ పార్టీలోనే ఉన్నారు. సీనియ‌ర్ ఎన్టీఆర్ అండ‌దండ‌ల‌తో ఎమ్మెల్యే అయ్యారు. బాల‌కృష్ణ రాక‌తో హిందూపురం స్థానాన్ని ఆయ‌న‌కు ఘ‌నీ అప్ప‌గించారు. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ఘ‌నీకి మంచి ప‌ట్టు ఉంది. దీంతో ఆయ‌న్ను బాల‌కృష్ణ‌కు పోటీగా త‌మ పార్టీ నుంచి బ‌రిలో దించాల‌ని వైసీపీ భావించింది. త‌ద‌నుగుణంగా సంప్ర‌దింపులు జ‌రిపింది.

ఎట్ట‌కేల‌కు టీడీపీని వీడిన ఘ‌నీ వైసీపీలో చేరారు. దీంతో ఈ ద‌ఫా వైసీపీ త‌ర‌ఫున హిందూపురం నుంచి ఆయ‌నే బ‌రిలో దిగ‌డం ఖాయ‌మైపోయింది. అయితే - వ‌చ్చే ఎన్నిక‌ల్లో హిందూపురంలో బాల‌య్య పోటీ చేసే విష‌యంపై కొన్ని అనుమానాలున్న సంగ‌తి తెలిసిందే. చంద్ర‌బాబు త‌న కుప్పం నియోజ‌క‌వ‌ర్గాన్ని కుమారుడు లోకేష్‌ కు అప్ప‌గించి అనంత‌పురంలోని క‌ళ్యాణ‌దుర్గం నుంచి పోటీ చేయాల‌ని యోచిస్తున్న‌ట్లు ఇటీవ‌ల వార్త‌లొచ్చాయి. అదే జ‌రిగితే అనంత‌పురం జిల్లాలో మ‌రో కీల‌క నేత బాల‌య్య పోటీ చేయ‌డం పెద్ద‌గా ప్ర‌యోజ‌న‌క‌రం కాద‌ని టీడీపీ వ‌ర్గాలు భావిస్తున్నాయి. అందుకే చంద్ర‌బాబు కళ్యాణ‌దుర్గం వెళ్తే.. బాల‌య్య హిందూపురంను వీడి కృష్ణా - గుంటూరు జిల్లాల్లో ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తార‌ని వార్త‌లొస్తున్నాయి. మ‌రి వైసీపీ త‌ర‌ఫున బ‌ల‌మైన నేత‌ ఘ‌నీ పోటీ ఇప్ప‌టికే ఖాయ‌మైన నేప‌థ్యంలో టీడీపీ ఎవ‌రిని బ‌రిలో దించుతుందో వేచి చూడాల్సిందే!