Begin typing your search above and press return to search.

కృష్ణా నదిలోని లంకల పరిస్థితి ఏమిటి!?

By:  Tupaki Desk   |   8 July 2015 5:30 PM GMT
కృష్ణా నదిలోని లంకల పరిస్థితి ఏమిటి!?
X
రాజధాని ప్రాంతంలోని భూములను సేకరిస్తున్న ప్రభుత్వం వాటికి ఆనుకుని ఉన్న కృష్ణా నదిలోని లంక భూములను సేకరిస్తుందా? వాటిని సేకరించకుండా వదిలేస్తుందా? ఇప్పుడు ఈ ప్రశ్న కీలకంగా మారింది. లంకల్లోని తమ భూములను ఇచ్చేందుకు అక్కడి రైతులు సిద్ధంగానే ఉన్నారు. కానీ, వాటిని సేకరించడానికి మాత్రం ప్రభుత్వం ముందుకు రావడం లేదు.

కృష్ణా నది మధ్యలో తుళ్లూరు మండలంలో మొత్తం ఐదు లంక గ్రామాలు ఉన్నాయి. రాయపూడిలో పెదలంక, వెంకటపాలెంలో పందుల లంక, మందడంలో మునసుబు లంక, ఉద్ధండరాయుని పాలెంలో లంక, లింగాయపాలెంలో గద్దె వారి లంకలు ఉన్నాయి. వీటిలో వందలాది కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వీటి పరిధిలో 500 ఎకరాలు కూడా ఉన్నాయి. ఇక్కడ అరటి, కేబేజీ, బీర వంగ వంటి కూరగాయల పంటలు పండిస్తున్నారు.

వాస్తవానికి, ప్రభుత్వం కృష్ణా నదిలోని దీవులను కూడా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రచిస్తున్న విషయం తెలిసిందే. ఐలాండ్లు నవ్యాంధ్రకే సొంతమని, సింగపూర్‌ వంటి దేశాల్లో వాటిని కృత్రిమంగా ఏర్పాటు చేసుకుంటున్నారని సీఎం చంద్రబాబు ఇటీవల పలుసార్లు ప్రస్తావించారు. దీవులను అద్భుతంగా అభివృద్ధి చేసే అవకాశం ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో వీటిని కూడా భూ సమీకరణ కింద తీసుకుంటారా లేదా అనే సందిగ్ధం నెలకొంది. భూ సమీకరణ పూర్తయిందని, ఇక భూ సేకరణే అని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో దీవుల అభివృద్ధి సంగతేమిటనే ప్రశ్న ఉదయిస్తోంది.