Begin typing your search above and press return to search.

'ట్రెండింగ్'లో టీడీపీ పతనం!

By:  Tupaki Desk   |   3 April 2021 9:50 PM IST
ట్రెండింగ్లో టీడీపీ పతనం!
X
సరిగ్గా సరిపోయే రాజకీయ సందర్భం కాబట్టి.. గతంలో జరిగిన ఓ విషయం గుర్తు చేసుకోవాలి. ఇందిరాగాంధీ హ‌యాంలో పార్ల‌మెంట్ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ప్ర‌ధాన పోటీ కాంగ్రెస్‌, క‌మ్యూనిస్టుల మ‌ధ్య‌నే. అప్పుడు క‌మ్యూనిస్టు లీడ‌ర్ మాకినేని బ‌స‌వ‌పున్న‌య్య కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో మాట్లాడుతూ.. 'రాబోయే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ చిత్తు చిత్తుగా ఓడిపోతోంది. కమ్యూనిస్టు పార్టీ అఖండ మెజారిటీతో విజ‌యం సాధించ‌బోతోంది. అద్వితీయ‌మైన ఆ ఘ‌ట్టాన సంబ‌రాలు చేసుకునేందుకు సిద్ధంగా ఉండ‌ండి' అని చెప్పార‌ట‌.

ఎన్నిక‌లు ముగిశాయి. క‌మ్యూనిస్టు పార్టీ దారుణంగా ఓట‌మి పాలైంది. అప్పుడు పాత్రికేయులు అడిగార‌ట‌.. 'బ‌స‌వ‌పున్న‌య్య గారూ మీరు అఖండ విజ‌యం సాధించ‌బోతున్నార‌ని కార్య‌క‌ర్త‌ల‌తో చెప్పారు. కానీ.. ఒక్క సీటు కూడా గెల‌వలేదేంటీ' అని అడిగార‌ట‌. దానికి ఆయ‌న చెప్పార‌ట‌.. ''నేను నాయ‌కుడిగా వాళ్ల‌ను స‌మ‌రానికి సిద్ధం చేయాలంటే.. వాళ్ల‌ను ఉత్సాహ ప‌ర‌చాలి. ఉత్తేజ ప‌ర‌చాలి. యుద్ధానికి సిద్ధం చేయాలి. అది జ‌ర‌గాలంటే.. గెలుపున‌కు ఒక్క అడుగే దూరం ఉన్నామ‌ని చెప్పాలి. లేక‌పోతే.. వాళ్లు డీలా ప‌డిపోతారు. ఓటమి ముందే ఖాయమైపోతుంది.'' అని సమాధానం ఇచ్చారట.

అచ్చం అలనాటి పరిస్థితులే ఉన్న ఇప్పుడు.. ఇప్పుడు చంద్ర‌బాబు నాయుడు తీసుకున్న నిర్ణ‌యంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. సొంత పార్టీవారు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. కేవ‌లం ఓట‌మి భ‌యంతోనే ఏవేవో సాకులు చెప్పి, ప‌రిష‌త్ ఎన్నిక‌ల నుంచి త‌ప్పించుకున్నార‌ని అధికార‌, ఇత‌ర విప‌క్షాలు కూడా ఎద్దేవా చేస్తున్నాయి. ఇటు టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు అధినేత తీరుపై గుర్రుగా ఉన్నారు. ఈ నిర్ణ‌యానికి ముందు జ‌రిగిన పొలిట్ బ్యూరో స‌మావేశం సంద‌ర్భంగా అశోక గ‌జ‌ప‌తి నిర‌స‌న వ్య‌క్తం చేసిన‌ట్టు తెలిసింది. ఆ త‌ర్వాత జ్యోతుల నెహ్రూ పార్టీ ప‌ద‌వికి రాజీనామా చేశారు. కొంద‌రు పార్టీ నేత‌లు.. అధినేత చెప్పిన‌ప్ప‌టికీ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌టిస్తున్నార‌ట‌. ఇవ‌న్నీ వెర‌సి.. చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యంపై విమ‌ర్శ‌ల జ‌డి కురుస్తోంది.

ఎన్నిక‌లు అన్న త‌ర్వాత గెలుపు, ఓట‌ములు స‌హ‌జం. ఓట‌మి నేర్పిన పాఠాలు తీసుకొని.. గెలుపుకు కొత్త బాట‌లు వేసుకోవాలి. కార్య‌క‌ర్త‌ల‌కు ధైర్యం చెబుతూ.. నూత‌నోత్తేజంతో ముందుకు సాగాలి. పార్టీని న‌డిపించాలి. అధినేత‌లు చేయాల్సిన ప‌ని ఇదే క‌దా. 40 సంవ‌త్సరాల రాజ‌కీయ జీవితం అని చెప్పుకునే చంద్ర‌బాబుకు ఈ విష‌యం కూడా తెలియదా? అని ప్ర‌శ్నిస్తున్నారు ప్ర‌త్య‌ర్థులు.

అంతేకాదు.. పంచాయతీ, మునిసిప‌ల్ పోరులో జ‌రిగి‌న ప‌రాభ‌వం కొన‌సాగుతుంద‌నే భ‌యంతోనే ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించారంటూ సోష‌ల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. #Endoftdp అనే హ్యాష్ ట్యాగ్ ను విప‌రీతంగా ట్రెండింగ్ లో ఉంచుతున్నారు. చంద్ర‌బాబు నిర్ణ‌యం టీడీపీ ప‌త‌నాన్ని సూచిస్తోందంటూ విమ‌ర్శ‌నాత్మ‌కంగా ట్వీట్లు చేస్తున్నారు. దీనికి కౌంట‌ర్ గా టీడీపీ అభిమానులు, కార్య‌క‌ర్త‌లు ఏమీ చేయ‌లేని నిస్స‌హాయ స్థితిలో పడిపోయారు.

రాజ‌కీయాల్లో హ‌త్య‌లు ఉండ‌వు.. ఆత్మ‌హ‌త్య‌లే ఉంటాయ‌నేది నానుడి. చంద్ర‌బాబు నాయుడు ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌పై తీసుకున్న నిర్ణ‌యం ఆత్మ‌హ‌త్యా స‌దృశ్య‌మేన‌ని అంటున్నారు విశ్లేష‌కులు. గ‌త రెండు ఎన్నిక‌ల్లో త్వ‌ర‌గా జ‌ర‌గాల‌న్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించి, వాటి దారుణ ఫ‌లితాల త‌ర్వాత.. మూడో ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించ‌డం ఖ‌చ్చితంగా ప‌లాయ‌న వాదంగానే అభివ‌ర్ణిస్తున్నారు. కార‌ణాలు ఎన్ని చెప్పిన‌ప్ప‌టికీ.. అవి స‌మ‌ర్దింపులే త‌ప్ప‌, ప‌రీక్ష‌కు నిల‌బ‌డ‌వ‌ని అంటున్నారు. మ‌రి, దీనిపై చంద్ర‌బాబు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారు? భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లు ఎలా ర‌చిస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రం. టీడీపీ ప‌త‌నం వైపు ప‌య‌నిస్తోందంటూ గ‌ట్టి వాయిస్ జ‌నాల్లోకి వెళ్తున్న వేళ‌.. ఆయ‌న ఎలా స్పందిస్తార‌న్న‌దే అత్యంత‌ కీల‌కం.