Begin typing your search above and press return to search.

ఏపీలో రాజకీయం ఎలా ఉందనటానికి తాజా ఉదంతం!

By:  Tupaki Desk   |   7 Oct 2021 3:48 AM GMT
ఏపీలో రాజకీయం ఎలా ఉందనటానికి తాజా ఉదంతం!
X
ఏపీలో రాజకీయం ఎలా ఉందనటానికి తాజా ఉదంతం ఒక ఉదాహరణగా చెబుతున్నారు. ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికల్లో అధికారపార్టీ విపక్ష అభ్యర్థుల్ని పెద్ద ఎత్తున బెదిరింపులకు పాల్పడినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కారణంతోనే పలువురు తమ పార్టీ నేతలు అధికార పార్టీలోకి వలస వెళుతున్నట్లుగా టీడీపీ చెప్పటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. గుంటూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన ఒక మహిళా నేత తాజాగా ప్రెస్ మీట్ పెట్టి మరీ వైసీపీ హెచ్చరికలు.. బెదిరింపులు ఏ రీతిలో ఉంటాయో తెలుసా? అంటూ చెప్పిన వైనం సంచలనంగా మారింది.

గతంలో టీడీపీలో ఉన్న ఆమె.. ఈ మధ్యన వైసీపీలో చేరారు. తాజాగా ప్రెస్ మీట్ పెట్టిన అనంతరం టీడీపీలోకి మళ్లీ వెళ్లాలని తాను నిర్ణయించుకున్నట్లుగా చెప్పిన ఆమె.. తనకు ఎదురైన బెదిరింపులు ఏ స్థాయిలో ఉంటాయో తెలుసా? అంటూ నోరు విప్పారు. ఈ మొత్తం సంచలనానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు దుగ్గిరాల 1 టీడీపీ ఎంపీటీసీగా పోటీ చేసిన బాణావత్ ఉమాదేవి.

తాను టీడీపీ తరఫున నామినేషన్ వేస్తే.. తనకు పెద్ద ఎత్తున బెదిరింపులు.. హెచ్చరికలు వచ్చాయని చెప్పారు. రాత్రివేళ వచ్చి బాగా ఒత్తిడి చేశారని.. ఒక దశలో చంపుతామని చెప్పటంతో తాము ఆ ఒత్తిళ్లు తట్టుకోలేక పార్టీ మారి వైసీపీలో చేరామన్నారు.

తాజాగా తాము తమ తప్పు తెలుసుకున్నామని.. తాము టీడీపీలోకి తిరిగి వచ్చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. తమను క్షమించాలని బాణావత్ ఉమాదేవి.. ఆమె భర్త వేడుకుంటున్నారు. తనకు ఇళ్ల ప్లాటు.. తన భర్తకు ఉద్యోగం.. డబ్బులు ఇస్తామని చెప్పారని.. అవేమీ ఇవ్వలేదన్నారు.

తాము వైసీపీ నుంచి తిరిగి టీడీపీలోకి వచ్చేశామని.. తాము తెలుగుదేశంలో కొనసాగుతున్నట్లుగా చెప్పారు. మొత్తం 14 స్థానాల్లో పోటీ చేసి తాము తొమ్మిది స్థానాలు గెలిచామని.. దీంతో తమకు ప్రజల మద్దతు ఎంత ఉందన్న విషయం ఇట్టే అర్థమవుతుందన్నారు. మొత్తంగా టీడీపీ నుంచివైసీపీలోకి వెళ్లి మళ్లీ టీడీపీలోకి వస్తున్న వైనం ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది.