Begin typing your search above and press return to search.

ముందే సర్దుకున్న బాబు...పవన్ తో ఖుషీ ఖుషీగా...

By:  Tupaki Desk   |   22 Oct 2022 11:30 PM GMT
ముందే సర్దుకున్న బాబు...పవన్ తో ఖుషీ ఖుషీగా...
X
చంద్రబాబుని అందుకే రాజకీయ గండర గండడు అని పిలిచేది. ఆయన వర్తమానంలో ఉంటారు, భవిష్యత్తుని చూస్తారు. కేవలం తన వైపు నుంచే కాకుండా అవతల వైపు నుంచి కూడా బాబు చూస్తారు. పరిస్థితులు అన్నీ తమకు అనుకూలం చేసుకునేందుకు ఆయన రాజకీయ చాణక్యాన్ని బయటకు తీస్తారు. ఏపీలో ఇపుడు పొత్తుల వ్యవహారం మీద చర్చ సాగుతోంది. జనసేన టీడీపీ పొత్తు పెట్టుకుంటే రెండు పార్టీలకు ఇబ్బంది కలుగుతుందని తమ్ముళ్ళ నుంచి తిరుగుబాటు వస్తుందని రకరకాలైన వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. కానీ నిజానికి అంత సీన్ లేకుండా చంద్రబాబు చాలా ముందు జాగ్రత్తగా అనేక చర్యలు తీసుకున్నారు.

జనసేన ఒకవేళ పొత్తుకు సిద్ధపడితే ఏ ఏ సీట్లను కోరుకుంటుంది అన్న దాని మీద బాబుకు కచ్చితమైన అవగాహన ఉందిట.అందుకే ఆయన జనసేనకు ఫలానా సీట్లు ఇవ్వాల్సి ఉంటుందని భావించి గట్టి ప్రిపరేషన్ తెర వెనక చేసుకుంటూ వచ్చారని టాక్.

అందుకే ఆయన కొన్ని సీట్లలో టీడీపీ నుంచి నామమత్రం నాయకత్వాన్ని ఉంచి కధ నడిపించారని అంటున్నారు. ఆ విధంగా చూస్తే తిరుపతి, తెనాలి, ప్రత్తిపాడు, విజయవాడ పశ్చిమ, భీమవరం, నరసాపురం, తాడేపల్లి గూడెం, నిడదవోలు తదితర నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ తమ ఇంచార్జిలను పెద్దగా ప్రభావం చూపించే వారిని నియమించలేదు అని అంటున్నారు.

రేపటి రోజున ఈ సీట్లను జనసేనకు ఇవ్వాలనుకున్నపుడు కచ్చితంగా ఇక్కడ తమ్ముళ్ల నుంచి పెద్దగా రియాక్షన్ రాదు అని అంటున్నారు. ఎందుకంటే పనితీరు బాలేదని ఇప్పటికే బాబు సమీక్షా సమావేశాలలో హెచ్చరికలు పంపుతున్నారు. తిరుపతి లాంటి చోట అయితే మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ లాంటి వారు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇక విజయవాడ పశ్చిమలో టీడీపీ నుంచి పెద్దగా ఆశలు అయితే పెట్టుకోవడంలేదు అంటున్నరు. భీమవరం నర్సాపురంలలో కూడా ఒక మాదిరి నాయకత్వంతోనే టీడీపీ కధ నడిపిస్తోంది.

దీంతో పొత్తుల ఎత్తుల విషయంలో చాలా ముందు నుంచే ఒక ప్రణాళిక ప్రకారం పనిచేస్తున్నారు అని అంటున్నారు. ఇక అనధికార వర్గాల ప్రకారం చూస్తే జనసేనకు పాతిక ఎమ్మెల్యే సీట్లను టీడీపీ నుంచి ఇవ్వాలనుకుంటున్నట్లుగా చెబుతున్నారు.

అలాగే వామపక్షాలు కానీ బీజేపీ కానీ పొత్తులకు వస్తే ఆ స్నఖ్య మరో పదికి పెరుగుతుంది తప్ప అంతకు మించి పెరగదు అని అంటున్నారు. రేపటి రోజున పొత్తులు ఉన్నా తాను సొంతంగా అధికారంలోకి రావడానికి వీలుగానే చంద్రబాబు 140 సీట్లకు తక్కువ కాకుండా పోటీ చేయాలనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి బాబు తెలివికి మరో మారు జోహార్ అనాల్సిందే అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.