Begin typing your search above and press return to search.

విజనరీ...పొలిటికల్ డిక్షనరీ

By:  Tupaki Desk   |   20 April 2022 4:48 AM GMT
విజనరీ...పొలిటికల్ డిక్షనరీ
X
చంద్రబాబుకు ఎన్నో బిరుదులు ఉన్నాయి. అయితే విజనరీ అని ఆయన్ని అంతా అభిమానంగా పిలుచుకుంటారు. చంద్రబాబు భవిష్యత్తునుముందుగా ఊహిస్తారు. దాని వల్ల మంచి పాలకుడిగా చర్యలు ముందే తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలా ఆరు నెలల ముందుగానే రానున్న ఇబ్బందులను గుర్తించి దానికి ధీటుగా ప్రభుత్వాన్ని సిద్ధం చేయడం ద్వారా చంద్రబాబు ఉత్తమ పాలకుడు అనిపించుకున్నారు.

అదే విధానాన్ని పార్టీలోనూ ఆయన అమలు చేస్తూ ప్రత్యర్ధులను ఎప్పటికపుడు ముప్పతిప్పలు పెడుతూ వచ్చారు. చంద్రబాబుది ఒకటే నినాదం, సంక్షోభాల నుంచి సవాళ్ళ నుంచి భవిష్యత్తుని చూడడం. ఆ విధంగా ఆయన చాలా సార్లు సక్సెస్ అయ్యారు. ఎన్టీయార్ లాంటి గ్లామరస్ ఫిగర్, లెజెండరీ పర్సనాలిటీ స్థాపించిన టీడీపీని ఆయన పోయిన పాతికేళ్ల తరువాత కూడా కంటిన్యూ చేయడం, ఎన్నో ఎన్నికల్లో విజయం సాధించడం అంటే అది కచ్చితంగా బాబు దార్శనికతకు ప్రతీకగానే చూడాలి.

ఇక చంద్రబాబు తాజా పుట్టిన రోజుతో 73వ ఏట అడుగుపెడుతున్నారు. అయితే ఆయన ఈ రోజుకూ ఉత్సాహంగా ఉన్నారు. ఆరోగ్యంగా ఉన్నారు. మరిన్ని ఎన్నికల యుద్ధాలను సునాయాసంగా ఎదుర్కొంటాను అన్న సందేశాన్ని ఇటు క్యాడర్ కి అటు ప్రత్యర్ధులకు పంపిస్తూ నాటౌట్ అంటున్నారు. టీడీపీ 2019 లో దారుణమైన ఫలితాలను చవి చూసింది.

అదే టైమ్ లో యువకుడు అయిన జగన్ ఏపీకి సీఎం అయ్యారు. 151 సీట్లు ఆయనకు దక్కాయి. ఆ ఊపు చూసిన వారు అంతా టీడీపీ పని అయిపోయింది అనుకున్నారు. అంతవరకూ ఎందుకు టీడీపీలోనే నిండా నైరాశ్యం కనిపించింది. అలాంటి చోట కూడా మళ్ళీ కొత్త ఉత్సాహాన్ని నమ్మకాన్ని కలిగించడం అంటే అది కచ్చితంగా బాబు రాజకీయ పటిమకు నిదర్శంగానే చూడాలి. ఈ రోజు టీడీపీలో పరిస్థితి ఎలా ఉంది అంటే ఎపుడు ఎన్నికలు జరిగినా మేమే గెలుస్తామన్న ధీమా.

జయాపజయాలు దైవాధీనాలు. కానీ ఆ రకమైన ఆత్మవిశ్వాసాన్ని పాదుకొల్పడంలో మాత్రం చంద్రబాబు పూర్తిగా సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఇక మరో రెండేళ్లలో ఎన్నికలు ఉన్నాయి. దాంతో ఈ పుట్టిన రోజు చంద్రబాబుకు చాలా ప్రత్యేకం అని కూడా భావించాలి. ఈ పుట్టిన రోజు నుంచి ఆయన మరింత జోష్ తో పార్టీని ముందుకు తీసుకెళ్ళేలా కార్యాచరణను రూపొందిస్తున్నారు. వచ్చే రెండేళ్ళూ ప్రజలతోనే ఉండాలని బాబు భావిస్తున్నారు.

ఈసారి ఎన్నికలు టీడీపీకి చాలా కీలకం. అధికారంలోకి రావడం అవశ్యం. అది వ్యక్తిగతంగా చంద్రబాబుకే కాదు, పార్టీ పరంగా టీడీపీకి కూడా ఈసారి ఎన్నికలు అగ్ని పరీక్ష లాంటివి. టీడీపీ కొత్త చరిత్ర సృష్టిస్తుందా లేదా అన్నది కూడా తేల్చే ఎన్నికలు ఇవి. అదే టైమ్ లో ఈసారి గెలుపు పిలుపు కచ్చితంగా టీడీపీకి వినిపించాల్సిందే. దాని కోసమే చంద్రబాబు పదునైన వ్యూహాలను రూపొందిస్తూ జనాల్లోకి రావాలనుకుంటున్నారు.

విద్యార్ధి దశ నుంచి రాజకీయాల పట్ల మక్కువ పెంచుకున్న చంద్రబాబు ఒక లీడర్ గా ఎపుడూ ఫెయిల్ కాలేదు అన్నది ఆయన రాజకీయ చరిత్ర చెప్పిన సత్యం. తొలిసారి ఎమ్మెల్యే, ఆ వెంటనే పదవి, ఆ తరువాత టీడీపీలో కీలక స్థానం. ఆ మీదట టీడీపీకి అంతా తానై ముఖ్యమంత్రిగా అత్యున్నతమైన స్థానాన్ని అందుకోవడం. జాతీయ స్థాయిలోనూ రాణించడం ఇవన్నీ చంద్రబాబు పాలిటిక్స్ లో మేలి మలుపులు. ఒక విధంగా నాలుగున్నర దశాబ్దాల చంద్రబాబును పొలిటికల్ డిక్షనరీగా అభివర్ణించాలి.

ఆయన సమకాలీనులు ఎవరూ ఈ రోజు యాక్టివ్ గా లేరు. కానీ చంద్రబాబు నాటి నుంచి నేటి వరకూ అన్ని తరాలను చూసుకుంటూ వస్తున్నారు. రానున్న కాలంలో ఏపీలో అతి పెద్ద రాజకీయ యుద్ధానికి సిద్ధమవుతున్న చంద్రబాబుకు ఈ పుట్టిన రోజు మరింత జోష్ ని ఇస్తుందని క్యాడర్ తో సహా ఆయన శ్రేయోభిలాషులు అంతా ఆశిస్తున్నారు.