Begin typing your search above and press return to search.

టీడీపీ బీజేపీ ఎంపీకి వైసీపీ ప్ర‌భుత్వంలో వెయ్యి కోట్ల ప‌నులా?

By:  Tupaki Desk   |   14 April 2021 11:30 AM GMT
టీడీపీ బీజేపీ ఎంపీకి వైసీపీ ప్ర‌భుత్వంలో వెయ్యి కోట్ల ప‌నులా?
X
వైసీపీ ప్ర‌భుత్వంలో చిత్ర‌మైన ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయి. పార్టీలో ఉన్న‌వారికి, పార్టీ కోసం ప‌నిచేసిన వారి కి ద‌క్కుతున్న ప్రాధాన్యం కంటే.. గ‌తంలో పార్టీని, పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ను తిట్టిపోసిన నాయ‌కుల‌కు ప్రాధాన్యం ఎక్కువ‌గా ఉంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ప్ర‌స్తుతం పార్టీ నేత‌ల‌కు చేతిలో ప‌నులు లేక‌.. రూపాయి ఆడ‌క అల్లాడుతున్నారు. పార్టీ అదికారంలోకి వ‌చ్చి రెండేళ్లు అయినా.. ఎక్క‌డా రూపాయి క‌నిపించడం లేద‌ని కీల‌క నేత‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. అయితే.. దీనికి విరుద్ధంగా.. పార్టీని గ‌తంలో తిట్టిపోసిన‌.. నాయ‌కుల‌కు ప‌నులు ద‌క్కుతున్నాయి.

తాజాగా క‌ర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ మాజీ నేత‌, ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్న రాజ్య‌స‌భ స‌భ్యుడికి కీల‌క‌మైన కుందూ న‌ది ప‌నుల్లో 50శాతం ప‌నులు ద‌క్కిన‌ట్టు తెలిసింది. అది కూడా వైసీపీ ఎమ్మెల్యేనే స్వ‌యంగా ఆయా ప‌నుల్లో వాటాను పార్టీ అధిష్టానం సూచ‌న‌ల మేర‌కు స‌ద‌రు నేత‌కు అప్ప‌గించార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. గ‌తంలో ఆ ఎంపీ.. టీడీపీ ఉన్న‌ప్పుడు జ‌గ‌న్‌ను, వైసీపీని భారీ ఎత్తున విమ‌ర్శించారు. అయినా కూడా ఇప్ప‌డు వైసీపీ ప్ర‌భుత్వంలో మాత్రం ఆయ‌న‌కు ఎన‌లేని ప్రాధాన్యం ద‌క్కుతుండ‌డం గ‌మ‌నార్హం.

అంతేకాదు.. టీడీపీ హ‌యాంలో ప‌నులు చేసిన చాలా మంది కాంట్రాక్టుల‌కు చెల్లించాల్సిన పెండింగు బిల్లుల‌ను ఆపినా.. ఈ ఎంపీగారికి మాత్రం పువ్వుల్లో పెట్టి మ‌రీ పెండింగ్ బిల్లులు చెల్లించార‌ట‌. ఇక‌, ఇప్పుడు కుందూ ప్రాజెక్టులోనూ వెయ్యి కోట్లలో పార్ట‌న‌ర్ షిప్ ఇచ్చి ఆదుకున్నార‌ట‌. వాస్త‌వానికి ఈ కాంట్రాక్టు.. వైసీపీ ఎమ్మెల్యే ద‌క్కించుకున్నారు. కానీ, దీనిలో స‌గం వాటాను అధిష్టానం సూచ‌న‌ల మేర‌కు స‌ద‌రు ఎంపీకి ఇచ్చార‌ట‌.

క‌ర్నూలు జిల్లాలో గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున వైసీపీని గెలిపించారు. అయిన‌ప్ప‌టికీ.. వారిని ప‌ట్టించుకోవ‌డం లేద‌నే టాక్ వినిపిస్తోంది. అదేస‌మ‌యంలో వైసీపీ నేత‌ల‌కు స‌బ్ కాంట్రాక్టులు కూడా ఇవ్వ‌డం లేదని స‌ద‌రు వైసీపీ ఎమ్మెల్యేలు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. జిల్లాలో ఏ ఒక్క ఎమ్మెల్యేను క‌దిలించినా.. ఇదే టాక్ వినిపిస్తోంది. ``మా ముందు టీడీపీ, బీజేపీ నేత‌లు కాంట్రాక్టులు తెచ్చుకుని మీసం మెలేస్తున్నారు. మేం మాత్రం ఎదురు చూపుల‌తోనే కాలం వెళ్ల‌దీస్తున్నాం. ఇదేం అన్యాయం`` అని వారు ప్ర‌శ్నిస్తున్నారు.

ఎమ్మెల్యేలుగా ఉన్న‌ప్ప‌టికీ.. క‌నీసం 20-30 ల‌క్ష‌ల విలువైన స‌బ్ కాంట్రాక్టులు కూడా రావ‌డం లేదు. అని అంటున్నారు. అదే టీడీపీని తిడ‌తారు.. బీజేపీతో వైరం అంటారు.. కానీ, వారికి మాత్రం స‌బ్ కాంట్రాక్టులు ఇస్తూ.. ప్ర‌జాధ‌నాన్ని దోచిపెడుతున్నారు. ఇదేం ప‌ద్ధ‌తి? అని నిలదీస్తున్నారు. ఇలా అయితే.. మాద‌గ్గ‌ర డ‌బ్బులు ఎలా ఉంటాయి? వ‌చ్చె ఎన్నిక‌ల్లో ఏం ఖ‌ర్చు చేస్తాం..? అని ప్ర‌శ్నిస్తున్నాం. ఇది వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఇబ్బంది కాదా? ఎలా గెలుస్తాం? అని కూడా నిల‌దీస్తున్నారు. మ‌రి దీనికి స‌మాధానం ఎవ‌రు చెబుతారో చూడాలి.