Begin typing your search above and press return to search.

అటు అయ్యన్న కొడుకు... గంటా కొడుకు ఇటు...?

By:  Tupaki Desk   |   30 April 2022 2:30 AM GMT
అటు అయ్యన్న కొడుకు... గంటా కొడుకు ఇటు...?
X
తెలుగుదేశంలో ఇపుడు వారసులు వస్తున్నారు. ఆ ముచ్చట 2024 ఎన్నికల్లో చూడబోతున్నారు. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. తమ పలుకుబడి ఉండగానే కొడుకులు పొలిటికల్ గా సెట్ కావాలి. ఇదే తండ్రుల ఆకాంక్ష. ఉమ్మడి విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీలో జమా జెట్టీల లాంటి ఇద్దరు మాజీ మంత్రులు ఉన్నారు. వారే చింతకాయల అయ్యనపాత్రుడు, గంటా శ్రీనివాసరావు.

ఈ ఇద్దరి మధ్య రాజకీయంగా పోరు ఉంది. సొంత పార్టీలోనే వైరి వర్గాలుగా ఉంటారు. ఇక చూడబోతే రానున్న ఎన్నికల్లో తమ వారసులను బరిలోకి దించడానికి ఈ ఇద్దరు నేతలూ చూస్తున్నారు. అయ్యన్నపాత్రుడు అయితే ఈ పనిలో చాలా ముందునే ఉన్నారు. పెద్ద కొడుకు విజయ్ పాత్రుడు టీడీపీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిలో కుదురుకున్నారు. లోకేష్ యంగ్ టీమ్ లో మెంబర్ గా కూడా ఉన్నారు.

వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీకి కూడా తయారుగా ఉన్నారు. అన్నీ అనుకూలిస్తే అనకాపల్లి నుంచి లోక్ సభకు విజయ్ పాత్రుడు పోటీ చేస్తారు అని అంటున్నారు. ఇప్పటి నుంచే అనకాపల్లి జిల్లాలో తన బలాన్ని పెంచుకునే పనిలో విజయ్ ఉన్నారు. ఆయనకు తండ్రి అయ్యన్న సహకారం పూర్తిగా లభిస్తోంది. అదే టైమ్ లో నర్శీపట్నం నుంచి మరోమారు అయ్యన్న రేసులో ఉంటారని కూడా అంటున్నారు. అంటే చింతకాయల వారి ఫ్యామిలీకి ఈసారి రెండు టికెట్లు ఇవ్వాలన్న మాట.

మరో వైపు చూస్తే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా పొలిటికల్ గా బాగా యాక్టివ్ అయ్యారు. తనతో పాటు తన కొడుకుకు కొడా టికెట్ కోసం ఆయన గట్టిగానే ట్రై చేస్తున్నారు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను భీమిలీ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. ఇక కుమారుడు గంటా రవితేజాను చోడవరం నుంచి పోటీలో దించుతారు అని చెబుతున్నారు.

చోడవరంలో గంటాకు మంచి అనుచర గణం ఉంది. అంతే కాదు, ఆయన 2004 ఎన్నికల్లో ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. దాంతో కుమారుడికి చోడవరం సేఫేస్ట్ ప్లేస్ గా ఎంచి మరి బరిలోకి దించనున్నారు అని టాక్ నడుస్తోంది. ఇక ఈ మధ్యనే రవితేజా కూడా లోకేష్ యంగ్ టీమ్ లో చేరిపోయారు. ఆయన ప్రత్యేకంగా లోకేష్ ని కలసి మరీ వచ్చారు. ఇదంతా గంటా డైరెక్షన్ లోనే సాగుతోంది అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు.

అంటే తండ్రులు అయ్యన్న, గంటా టీడీపీ భావి వారసుడు లోకేష్ కనుసన్నలలో తమ కుమారులను జాగ్రత్తగా ఉంచుతున్నారు అనుకోవాలి. రేపటి రోజున లోకేష్ తో కలసి అడుగులు వేసేలా తమ రాజకీయ వారసులుగా వారిని తీర్చిదిద్దుతున్నారు అనుకోవాలి. అయితే ఈ మధ్యనే చంద్రబాబు ఒక మాట చెప్పారు. యువతకు నలభై శాతం సీట్లు ఇస్తామని, ఆ లెక్కన చూసుకుంటే తండ్రులు తప్పుకుని కొడుకులకు టికెట్లు ఇప్పించుకుంటారా. లేక తమతో పాటు వారికి కూడా టికెట్లు అడుగుతారా అన్నది చూడాలి. అసలు వారసులకు బాబు ఈసారి టికెట్లు ఇస్తారా. అదే అసలైన పాయింట్ మరి.