Begin typing your search above and press return to search.

ప్రత్యర్థి టీడీపీ అని ఒప్పుకున్నట్లేగా

By:  Tupaki Desk   |   2 Jan 2016 10:30 PM GMT
ప్రత్యర్థి టీడీపీ అని ఒప్పుకున్నట్లేగా
X
గ్రేటర్ ఎన్నికల్లో తమ ప్రత్యర్థి అయితే గియితే బీజేపీ అవుతుందని, కాంగ్రెస్ కు సింగిల్ డిజిట్ కూడా దక్కదని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. టీడీపీకి తెలంగాణలో భవిష్యత్తు లేదని కూడా అన్నారు. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలపై చర్చోపచర్చలు సాగుతున్నాయి.

గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ - బీజేపీ కలిసి పని చేస్తున్నాయి. జీహెచ్ ఎంసీ పరిధిలోని సీమాంధ్రులకు టీడీపీనే పెద్ద దిక్కుగా ఉంది. ఇక విద్యావంతుల్లో కొంతమందిని బీజేపీ ఆకర్షించగలదు. కానీ, హైదరాబాద్ మొత్తానికి ప్రాతినిధ్యం వహించలేదు. గత ఎన్నికల్లో కూడా బీజేపీకి వచ్చిన సీట్లు నామమాత్రమే.

గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం నామమాత్రంగా ఉండనుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ పార్టీ తనకు అనుకూలంగా ఉన్న వాటిని కూడా సానుకూలంగా ప్రచారం చేసుకోలేకపోతోంది. ఏవో కొన్ని బస్తీల్లో మినహా మిగిలిన ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రభావం నామమాత్రమే. ఇక ఎంఐఎం అయితే పూర్తిగా ముస్లిం సామాజిక వర్గానికి పరిమితం. ఇక మిగిలింది టీడీపీ - బీజేపీ పార్టీలు. వీటిలోనూ టీడీపీకి జీహెచ్ ఎంసీ పరిధిలో గట్టి పట్టు ఉంది. కానీ, దానితో పోలిస్తే బీజేపీకి పట్టు కాస్త తక్కువే. మొత్తంమీద రెండు పార్టీలూ కలిస్తే ఇతర పార్టీల కంటే బలంగా ఉంటాయనడంలో ఏమాత్రం సందేహం అక్కర్లేదు. ఈ నేపథ్యంలోనే అయితే గియితే తమకు బీజేపీ ప్రత్యర్థి అవుతుందని కేటీఆర్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. రెండు పార్టీలూ పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్నాయని, ఈ నేపథ్యంలో బీజేపీని ప్రత్యర్థి అంటే టీడీపీని కూడా ప్రత్యర్థి అనే అంగీకరించాల్సి వస్తుందని విశ్లేసకులు వివరిస్తున్నారు. నిజానికి గ్రేటర్ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులు టీఆర్ ఎస్ - టీడీపీ - బీజేపీ కూటమి మాత్రమే. ఈ నేపథ్యంలోనే పరోక్షంగా అయినా హైదరాబాద్ లో తమ ప్రధాన ప్రత్యర్థి తెలుగుదేశమని కేటీఆర్ అంగీకరించినట్లు అయిందని చెబుతున్నారు.