Begin typing your search above and press return to search.

కాషాయంతో పచ్చ బంధం సగం తెగినట్టే!

By:  Tupaki Desk   |   1 March 2018 2:03 PM IST
కాషాయంతో పచ్చ బంధం సగం తెగినట్టే!
X
అధికారిక ప్రకటన కూడా త్వరలోనే ఏకంగా ఢిల్లీనుంచి రాబోతున్నది. ఆ ప్రకటన కూడా పూర్తయితే.. భారతీయజనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ సార్వత్రిక ఎన్నికలకు ముందు పెట్టుకున్న పొత్తు ఒక పూర్తి ప్రభుత్వ పదవీకాలం అయినా గడవక ముందే అంతరించినట్లు అవుతుంది. కాకపోతే.. ప్రస్తుతానికి ఈ బంధం తెగిపోతుండడం.. కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం కాబోతోంది. ఆంద్రప్రదేశ్ లో బంధానికి కూడా ఇది ప్రమాద సంకేతమే అనే హెచ్చరికలు రాజకీయ వర్గాల్లో వినవస్తున్నాయి.

తెలుగుదేశం పార్టీ - భాజపా ల బంధమే అనైతికమైన పునాదుల మీద ఏర్పడిందని చాలా మంది విమర్శిస్తూ ఉంటారు. అందులో ఎంతమాత్రమూ అనుమానం లేదు. ఎందుకంటే.. అప్పటికి గుజరాత్ ముఖ్యమంత్రి అయిన నరేంద్రమోడీ గురించి అదివరలో చంద్రబాబునాయుడుకు ఎలాంటి సానుకూల పాజిటివ్ అభిప్రాయం లేనే లేదు. నిజానికి దేశంలో చాలా మంది నాయకులకు - ప్రాంతీయ పార్టీల అధినేతలకు మోడీ మీద విశ్వాసం లేదు.

కాకపోతే.. వారంతా మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే అందుకు నిరసనగా ఎన్డీయే నుంచి పక్కకు తప్పుకున్నారు. కానీ.. అప్పటిదాకా మోడీని తాను స్వయంగా ఎన్ని రకాలుగా విమర్శించి ఉన్నప్పటికీ.. తన పార్టీ మనుగడకు ఎంతో కీలకం అయిన 2014 ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా చేజార్చుకోవడం ఇష్టంలేని చంద్రబాబు అవసరం కోసం పొత్తు పెట్టుకున్నారు.

ఆనాటినుంచి తెలంగాణలో వారి మధ్య సఖ్యత లేదు. సీట్ల పంపంకంలోనే విపరీతమైన భేదాభిప్రాయాలు. ఎట్టకేలకు ఎన్నికల్లో పరాజయం దక్కిన వెంటనే.. ఇక తెదేపాతో మాకు సంబంధం లేదు అని రాష్ట్ర భాజపా చెప్పసాగింది. కాకపోతే.. పొత్తు కుదిరిన తర్వాత.. అధికారిక తెగతెంపులు ... పార్టీ అధిష్టానం పెద్దలు ప్రకటించాలి. ఆ పర్వం ఇన్నాళ్లు జరగలేదు. ఇప్పుడు త్వరలోనే తెలంగాణకు సంబంధించి ఢిల్లీనుంచి ఈ తెగతెంపుల ప్రకటన వెలువడుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

చంద్రబాబు ఒకవైపు ఏపీలో దూరం అవుతాం అని డాంబికంగా ప్రకటనలు గుప్పిస్తోంటే.. మేం అంతకంటె ముందే సిద్ధంగా ఉన్నాం... అని హెచ్చరిక సంకేతం ఇవ్వడానికే భాజపా తెలంగాణలో తొలి తెగతెంపులు చేసుకుంటోందని పలువురు అంటున్నారు. మరి ఏపీలో సంగతేంటే.. అవసరాలకోసం ఎప్పటిదాకా కలిసి ఉంటారో చూడాలి.