Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్ ..టాప్ కంపెనీగా అవతరించిన టీసీఎస్

By:  Tupaki Desk   |   10 March 2020 6:35 AM GMT
కరోనా ఎఫెక్ట్ ..టాప్ కంపెనీగా అవతరించిన టీసీఎస్
X
కరోనా వైరస్ ..ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పై భారీగా ప్రభావం చూపుతోంది. చైనాలో పుట్టిన ఈ కరోనా క్రమేపి చైనాలో తగ్గుముఖం పట్టినప్పటికీ ..ప్రపంచ వ్యాప్తంగా 100 దేశాలకి పైగా విస్తరించి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ కరోనా వైరస్ ప్రభావం గత కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్ల పై కూడా పడుతుంది. దీనితో ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా ..స్టాక్ మర్కెట్స్ భారీ పతనం దిశగా సాగుతున్నాయి.

సోమవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. దీనితో దేశంలోని అత్యంత విలువైన కంపెనీల జాబితా కూడా మారిపోయింది. తాజాగా టాటా గ్రూప్‌నకు చెందిన సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం టీసీఎస్‌ దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. చమురు ధరలు పడిపోవడం రిలయన్స్‌ షేర్‌ కు శరాఘాతంగా మారింది. దీంతో గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా రిలయన్స్‌ షేరు 13శాతానికి పైగా పడిపోయింది. ఈ కారణంగా రూ.10లక్షల కోట్లుగా ఉన్న ఈ రిలయన్స్‌ కంపెనీ మార్కెట్‌ విలువ ఒక్కసారిగా రూ. 7.05 లక్షల కోట్లకు చేరింది.

అయితే , ఈ కరోనా ప్రభావం టీసీఎస్ పైనా కనిపించినా కూడా అది తక్కువగా ఉంది. సోమవారం ట్రేడింగ్ లో ట్రేడింగ్‌లో టీసీఎస్‌ షేరు ధర 6శాతానికి పైగా పతనమైంది. అయితే మార్కెట్‌ లో ఆ కంపెనీ విలువ రూ. 7.40 లక్షల కోట్లుగా ఉండటంతో దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా టీసీఎస్‌ తొలిస్థానంలో నిలిచింది. ఇంటర్నేషనల్‌ బెంచ్‌ మార్క్‌ క్రూడ్‌ ఫ్యూచర్లు 30శాతం పతనం కావడం రిలయన్స్‌ పై తీవ్రమైన ప్రభావం చూపింది. 1991 తర్వాత మార్కెట్లలో ఒక్క రోజులో పడిపోయిన అత్యధిక విలువ ఇదే. రిలయన్స్‌ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాన్ని జామ్‌నగర్‌ లో నడుపుతోంది.