Begin typing your search above and press return to search.

పెట్రోల్ ను వంద చేసిన మోడీ సర్కారు కార్పొరేట్లకు ఇచ్చిందెంతో తెలుసా?

By:  Tupaki Desk   |   10 March 2021 12:30 PM GMT
పెట్రోల్ ను వంద చేసిన మోడీ సర్కారు కార్పొరేట్లకు ఇచ్చిందెంతో తెలుసా?
X
అవును.. ఇది నిజం. పెట్రోల్.. డీజిల్ ధరల్ని అమాంతం పెంచేయటమే కాదు..తొలిసారి లీటరు పెట్రోల్ వందకు జేర్చిన ఘనత మోడీ సర్కారుదే. దేశం కోసం.. దేశ భక్తి ఉన్న వారెవరైనా సరే.. పెట్రోల్.. డీజిల్ కోసం అదనంగా పడే భారాన్ని ఆ మాత్రం భరించలేరా? అంటూ సన్నాయి నొక్కులు నొక్కే కమలనాథుల మాటలకు.. చేతలకు ఏ మాత్రం సంబంధం ఉండదని తేల్చే గణాంకాలు తాజాగా అధికారికంగా బయటకు వచ్చాయి. లీటరు పెట్రోల్ వందకు ఎందుకు చేరుకుంది? అలా పెంచేస్తే వచ్చే ఆదాయంతో కేంద్రం ఏం చేస్తోంది? అన్న ప్రశ్నకు సూటి సమాధానం లభించదు.

కానీ.. మోడీ వర్గీయులు.. బీజేపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ మాత్రం.. పెట్రోల్.. డీజిల్ ధరలు పెరగటం ద్వారా వచ్చే బోలెడంత ఆదాయాన్ని సరిహద్దుల్ని మరింత బలంగా చేయటంతో పాటు.. యుద్ధ సామాగ్రి కొనుగోలుకోసం వెచ్చించినట్లుగా ప్రచారం చేయటం తెలిసిందే. అయితే.. ఆ ప్రచారంలో పస లేదన్న విషయం తాజా లెక్కలు చెప్పేస్తున్నాయని చెప్పాలి.

మోడీ ప్రధానిగా కుర్చీలో కూర్చున్నఆరేళ్ల కాలంలో కార్పొరేట్లకు పన్నుల మినహాయింపు.. ప్రోత్సాహకాలు.. వివిధ తగ్గింపుల రూపంలో ఇచ్చిన మొత్తం ఎంతో తెలుసా? అక్షరాల రూ.6.07లక్షల కోట్లు కావటం గమనార్హం. ఇదే విషయాన్ని తాజాగా కేంద్రం వెల్లడించింది. రాజ్యసభలో సీపీఐ(ఎం) ఎంపీ కేకే రాగేష్ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. 2015లో రూ.1.15లక్షల కోట్లు.. 2016లో రూ.1.30లక్షల కోట్లు.. 2017లో 1.20లక్షల కోట్లు.. 2018లో రూ.1.25లక్షల కోట్లు.. 2019లో రూ.1.16 లక్షల కోట్ల మొత్తాన్ని దేశంలోని పెట్టుబడిదారులకు పన్ను మినహాయింపు ఇచ్చినట్లుగా ఆయన పేర్కొన్నారు.

కార్పొరేట్లకు ఇచ్చిన పన్నుల మినహాయింపు మొత్తం ఆదాయ చట్టం 1961 అనుగుణంగానే ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కంపెనీలకు ఊతం ఇచ్చేందుకు ఈ చర్యలు ఉపకరిస్తాయని చెబుతున్నారు. దేశంలో ప్రాంతీయ అసమానతలు తొలగించే చర్యల్లో భాగంగానే ఇంత భారీగా కార్పొరేట్లకు పన్ను మినహాయింపులు.. ప్రోత్సాహకాల్ని అందిస్తున్నట్లు చెప్పారు. మోడీనా మజాకానా? మరి.. ధరల పెరుగుదతలో వెన్ను విరిగిన సామాన్యుడికి మోడీ సర్కార్ ఏమిస్తుంది?