Begin typing your search above and press return to search.

ఎయిర్ ఇండియాపై క‌న్నేసిన టాటా స‌న్స్‌

By:  Tupaki Desk   |   17 Aug 2020 8:00 AM IST
ఎయిర్ ఇండియాపై క‌న్నేసిన టాటా స‌న్స్‌
X
ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా చేతుల మార‌డం ఖాయ‌మైపోయింది. ఎయిరిండియాను విక్రయించేందుకు గతంలో రెండు సార్లు ప్రయత్నాలు జరిగాయి. 2001లో ఒకసారి, మళ్లీ 2018లో మరోసారి కేంద్రం ప్రయత్నించింది. కానీ ఈ రెండూ విఫలం కావడంతో.. ప్రస్తుతం ముచ్చటగా మూడోసారి ప్రయత్నిస్తోంది. ఈ ద‌ఫా దేశీయ వ్యాపార దిగ్గ‌జ సంస్థ అయిన టాటా స‌న్స్ ప్ర‌య‌త్నిస్తోంద‌ని స‌మాచారం. ఈ మేర‌కు బిడ్ దాఖ‌లు చేసే ప‌నులు మొద‌లుపెట్టిన‌ట్లు తెలుస్తోంది.

ఎయిర్ ఇండియా అమ్మ‌కంలో భాగంగా గ‌తంలో కేంద్ర ప్ర‌భుత్వం ఎక్స్‌ప్రెష‌న్ ఆఫ్ ఇంట్రెస్ పేరుతో జూన్ నెలాఖ‌రు వ‌ర‌కు గ‌డువు విధించింది. అయితే, కోవిడ్ మ‌హ‌మ్మారి కార‌ణంగా వివిధ సంస్థ‌లు ముందుకు రాలేదు. ఈ నేప‌థ్యంలో దాన్ని ఈ నెలాఖ‌రు వ‌ర‌కు పొడ‌గించింది. ఈ గ‌డువు మ‌రోమారు ముందుకు తీసుకుపోయే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో త‌మ బిడ్‌ను నెలాఖ‌రులోగా దాఖ‌లు చేయాల‌ని టాటా స‌న్స్ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు స‌మాచారం.


టాటా స‌న్స్ ఈ విష‌యంలో అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌న‌ప్ప‌టికీ తెర వెనుక ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది. ఎయిర్ ఏషియా సంస్థ‌లో ఉన్న త‌మ వాటాల‌ను ఉప‌సంహరించుకొని ఎయిర్ ఇండియాను కైవ‌సం చేసుకోవాల‌ని టాటా స‌న్స్ ముఖ్యులు భావిస్తున్న‌ట్లు స‌మాచారం.

కాగా, రూ. 50,000 కోట్ల ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని ఎయిర్ ఇండియా ఉద్యోగుల జాయింట్‌ ఫోరమ్‌ ప్రధాని నరేంద్ర మోదీని కోరింది. దేశానికి ఎయిరిండియా చాలా అవసరమని, ముఖ్యంగా సంక్షోభ సమయాల్లో సేవలు అందిస్తూ కీలకంగా ఉంటోందని వివరించింది. ఆర్థిక ప్యాకేజీ వల్ల ఎయిరిండియాతో పాటు మొత్తం ఏవియేషన్‌ రంగం, ఎకానమీకి కూడా తోడ్పాటు లభించగలదని తెలిపింది. కరోనా వైరస్‌ సంక్షోభంతో వివిధ దేశాల్లో చిక్కుబడిపోయిన వారిని స్వదేశానికి చేర్చడంలో ఎయిరిండియా మరోసారి కీలకపాత్ర పోషించిందని, సిబ్బంది వ్యక్తిగత రిస్కులు తీసుకుని మరీ ఇందులో పాలుపంచుకున్నారని వివరించింది. అయితే, ఎయిరిండియా సంస్థ ఆగ‌స్టు 14వ తేదీ రాత్రి 48 మంది పైలట్లపై వేటు వేసి వారికి షాకిచ్చింది.