Begin typing your search above and press return to search.

ఇకపై టాటా వారి ఐపీఎల్‌

By:  Tupaki Desk   |   12 Jan 2022 3:29 AM GMT
ఇకపై టాటా వారి ఐపీఎల్‌
X
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) టైటిల్ స్పాన్సర్‌ ‘వివో’ హక్కులు వదులుకుంది. ఇప్పటి వరకు లీగ్‌కు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించిన చైనా మొబైల్ కంపెనీ ‘వివో’ తప్పుకుంది. భారత్‌కు చెందిన దిగ్గజ కార్పొరేట్‌ సంస్థ ‘టాటా గ్రూప్‌’ లీగ్‌తో జత కట్టనుంది. ఈ విషయాన్ని లీగ్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ నిర్ధారించారు. ఐపీఎల్‌ రెండు సీజన్లకు (2022, 2023) ఇది వర్తిస్తుంది. 2018-2022 వరకు ఐదేళ్ల కాలానికిగాను రూ.2,200 కోట్లు చెల్లించేలా బీసీసీఐతో ‘వినో’ ఒప్పందం చేసుకుంది.

అయితే 2020లో గాల్వాన్ లోయలో ఘర్షణలు జరిగి భారత్‌, చైనా మధ్య సంబంధాలు దెబ్బ తినడంతో ఆ ఏడాది లీగ్‌ నుంచి వివో తప్పుకోగా, తాత్కాలిక ప్రాతిపదికన ‘డ్రీమ్‌ 11’ స్పాన్సర్‌గా వ్యవహరించింది. అయితే 2021లో మళ్లీ ‘వివో’నే కొనసాగింది. ‘వివో’ ఒప్పందాన్ని 2023 వరకు బీసీసీఐ పొడిగించింది. తాజాగా ‘వివో’ వైదొలగడంతో టాటా సంస్థ వచ్చే రెండేళ్ల పాటు స్పాన్సర్‌గా వ్యవహరించనుంది.

బోర్డు పంట పండింది

వివో తప్పుకోవడంతో పాటు టాటా స్పాన్సర్‌గా రావడంతో బీసీసీఐ పంట పండింది. ఒకేసారి రెండు సంస్థల నుంచి ఆదాయం వస్తుండటంతో బోర్డు జాక్‌పాట్ కొట్టింది. టాటా గ్రూప్‌ రెండేళ్ల కోసం రూ. 670 కోట్లు (ఏడాదికి రూ. 335 కోట్లు) చెల్లిస్తుంది. అయితే 2022లో రూ. 547 కోట్లు, 2023లో రూ. 577 కోట్లు చెల్లిస్తామని ‘వివో’ గతంలో ఒప్పందం (రెండేళ్లకు మొత్తం రూ. 1,124 కోట్లు) కుదుర్చుకుంది. ఇప్పుడు బీసీసీఐకు ఎలాంటి అభ్యంతరం లేకున్నా వివో తమంతట తామే తప్పుకునేందుకు సిద్ధమైంది కాబట్టి ‘టాటా’ ఇస్తున్న మొత్తం పోగా, మిగిలిన నష్టాన్ని వారే భర్తీ చేయాల్సి ఉంటుంది. దాంతో వివో బోర్డుకు మరో రూ. 454 కోట్లు చెల్లిస్తుంది.

మరోవైపు రెండు కొత్త జట్లకు బీసీసీఐ అధికారికంగా అనుమంతి మంజూరు చేసింది. అహ్మదాబాద్‌, లక్నో జట్లకు ఆమోద ముద్ర వేసిన బోర్డు... మొదటి ప్రాధాన్యంగా ముగ్గురు ఆటగాళ్లను ఎంచుకునేందుకు రెండు వారాల సమయం ఇస్తామని ప్రకటించింది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో ఐపీఎల్ వేలం జరుగుతుంది.