Begin typing your search above and press return to search.

తస్లీమా ట్వీట్ కు ఏం సమాధానం చెబుతారు?

By:  Tupaki Desk   |   14 Dec 2015 9:07 AM GMT
తస్లీమా ట్వీట్ కు ఏం సమాధానం చెబుతారు?
X
కొన్ని పదాలతో భావోద్వేగాన్ని విపరీతంగా రగిలించొచ్చు. అలాంటి పదాల్లో ఒకటి లౌకికవాదం. దేశంలో ఈ మాట చెప్పి రాజకీయం చేసే చాలానే రాజకీయపార్టీలు లౌకికవాద స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించటం మామూలే. అయితే.. దీనికి సంబంధించిన వార్తాంశాలు ప్రసార మాధ్యమాల్లో కనిపించకపోవటంతో పెద్ద చర్చ జరగదు. వ్యక్తిగత సంభాషణల్లో ఈ కుహనా లౌకికవాదం మీద చర్చలు వాడీవేడిగా సాగుతుంటాయి. అయితే.. దేశంలోని లౌకికవాదం పేరిట కొన్ని రాజకీయ పార్టీలు చేసే వాదనను ఖండించినా.. విమర్శించినా.. వారిపై సంఘ్ ముద్ర వేసేయటం కొంతకాలంగా జరుగుతున్న తంతే.

అలాంటి లౌకికవాదుల ద్వంద వైఖరిని సూటిగా ప్రశ్నించి.. తన ట్వీట్ తో షాకిచ్చారు బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్. ఆమె రాసిన లజ్జ పుస్తకం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందారు. అయితే.. ఆ పుస్తకాన్ని బంగ్లాదేశ్ లో నిషేధించారు. భారత్ లో ఈ పుస్తకాన్ని అమ్మేందుకు ప్రయత్నిస్తే కొందరు ముస్లిం మతాన్ని ఇష్టపడేవారు వచ్చి రార్దాంతం చేశారంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు.

బంగ్లాదేశ్ లో మాత్రమే తన లజ్జ పుస్తకాన్ని నిషేధించారే కానీ ఇండియాలో మాత్రం కాదని.. అలాంటప్పుడు హైదరాబాద్ లోని సుందరయ్య కేంద్రంలో అమ్మకానికి ఉంచితే ఎందుకు అసహనం ప్రదర్శించారని సూటిగా ప్రశ్నించారు. తన విషయంలో ప్రదర్శించింది కూడా అసహనమేనని.. అయితే ఇండియాలోని ఏ లౌకికవాద రచయితా దీనిపై వ్యతిరేకంగా వ్యాఖ్యానించినట్లు తాను వినలేదని ఆమె పేర్కొన్నారు.

లౌకికవాదులంతా అప్పట్లో ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించిన తస్లీమా.. లౌకికవాదులమని చెప్పుకునే వారు మోసానికి పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. భారతదేశంలో లౌకికవాదులమని చెప్పుకునే వారి ద్వంద వైఖరిని తాజాగా ప్రశ్నించిన తస్లీమా వ్యాఖ్యలపై ఎలాంటి రియాక్షన్ ఉంటుందో చూడాలి.