Begin typing your search above and press return to search.

టార్గెట్ డిసెంబర్!

By:  Tupaki Desk   |   19 Nov 2021 11:30 PM GMT
టార్గెట్ డిసెంబర్!
X
యావత్ దేశంతో పాటు రాష్ట్రంలో కూడా పెద్ద సమస్యగా తయారైన గంజాయి సాగును డిసెంబర్ నెలాఖరుకు నూరుశాతం కంట్రోల్ చేయాలని ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ టార్గెట్ గా పెట్టుకున్నది.

గంజాయిని పూర్తిగా కంట్రోల్ చేయాలనే టార్గెట్ తో ప్రభుత్వం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ) ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ ఎస్ఈబీకి కమీషనర్ గా వినీత్ బ్రిజ్ లాల్ వ్యవహరిస్తున్నారు.

రాజకీయనేతల లెక్కల ప్రకారమైతే విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ఏరియాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో గంజాయి సాగు 25 వేల ఎకరాల్లో సాగుతోంది.

అయితే ఎస్ఈబీ తాజా లెక్కల ప్రకారం పై ప్రాంతాల్లో సుమారు 7 వేల ఎకరాల్లో మాత్రమే గంజాయి సాగు జరుగుతోంది. దీంట్లో కూడా విశాఖ జిల్లా సరిహద్దులకు ఆనుకుని ఉండే ఆంధ్రా ఒడిస్సా బార్డర్ (ఏవోబీ)లోనే చాలా ఎక్కువగా సాగు జరుగుతోంది.

కమీషనర్ గా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి వినీత్ అక్టోబర్ 21వ తేదీనుండి ప్రత్యేకమైన డ్రైవ్ చేస్తున్నారు. గంజాయి సాగును అరికట్టే బాధ్యతలను పూర్తిగా సిబ్బంది మీదే వదిలేయకుండా తాను కూడా దగ్గరుండి మరీ క్షేత్రస్ధాయిలో పర్యటిస్తున్నారు.

జిల్లాల్లోని పోలీసుల సహకారంలో ప్రతిరోజు తక్కవలో తక్కువ 150 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేస్తున్నారు. వ్యాపార మార్గాలను మూసేయటంతో పాటు డ్రగ్స్ పెడలర్లను కూడా గుర్తించి అరెస్టులు చేస్తున్నారు.

ఇప్పటికి సుమారు 2500 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేసినట్లు ఈమధ్యనే వినీత్ చెప్పారు. రాష్ట్రంలో గంజాయి సాగు అన్నదే లేకుండా చేయటానికి డిసెంబర్ ను టార్గెట్ గా పెట్టుకున్నట్లు వీనీత్ చెప్పారు. గంజాయి సాగు, తోటలను గుర్తించేందుకు విరివిగా ద్రోన్లను వాడుతున్నారు.

గంజాయి సాగు, వ్యాపారం, వినియోగం వల్ల జరిగే నష్టాలను ఏజెన్సీ ఏరియాల్లోని గిరిజనులకు చెబుతున్నారు. పరివర్తన అనే స్వచ్చంధ కార్యక్రమాన్ని బ్యూరో తరపున వినీత్ నిర్వహిస్తున్నారు.

బ్యూరో చేస్తున్న దాడులు, గంజాయి పంటలను ధ్వంసం చేయటాన్ని స్ధానికంగా కొందరు రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే సంవత్సరాలుగా రైతులు ప్రత్యేకించి కొందరు గిరిజనులు గంజాయి సాగుపైనే ఆధారపడ్డారు. ఇపుడు హఠాత్తుగా పంటలను ధ్వంసం చేస్తుండటంతో ఉపాధి కోల్పోతున్నామనే అసంతృప్తి కనబడుతోంది.

మరి దీనికి ప్రభుత్వం ప్రత్యామ్నాయాలను చూపితేనే ఉపయోగం ఉంటుంది. ముందు గంజాయి సాగును ధ్వంసం చేసిన తర్వాత స్మగ్లర్ల అంతు చూడాలని బ్యూరో డిసైడ్ చేసినట్లు వినీత్ చెప్పారు. మరి వీళ్ళ ప్రయత్నంలో ఎంతవరకు విజయం సాధిస్తారో చూడాల్సిందే.