Begin typing your search above and press return to search.

టీడీపీ ఎమ్మెల్యేని దోమ కుట్టింది

By:  Tupaki Desk   |   14 Sep 2016 11:22 AM GMT
టీడీపీ ఎమ్మెల్యేని దోమ కుట్టింది
X
దేశ రాజధాని ఢిల్లీలో డెంగీ జ్వరాలు - మలేరియా వంటివి విజృంభించడం.. అక్కడి ఆప్ ప్రభుత్వం - కేంద్రం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రజలను పట్టించుకోకపోవడం తెలిసిందే. తాజాగా ఏపీలోనూ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఢిల్లీ మాదిరిగా ఇక్కడ ప్రభుత్వం కుంటి సాకులు చెప్పకపోయినా సొంత పార్టీ ఎమ్మెల్యేలే విష జ్వారాల బారిన పడుతుండడంతో సమాధానం చెప్పుకోలేకపోతోంది. తాజాగా కృష్ణా జిల్లాలో నందిగామ ఎమ్మెల్యే డెంగీ జ్వరం బారిన పడడంతో ప్రభుత్వం ఏం చేస్తోందన్న ప్రశ్న వినిపిస్తోంది.

రాష్ట్రంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. వందలాది మంది విషజ్వరాల బారినపడుతున్నాయి. అయితే సీజన్‌ లో కామన్ అన్నట్టుగా యంత్రాంగం ప్రవర్తిస్తోంది. డెంగీ కేసులు నమోదవుతున్నా అధికారుల్లో కదలిక లేదు. అయితే ఇప్పుడు టీడీపీ నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను కూడా విష జ్వరం తాకింది. ఆమెను డెంగీ దోమ కాటేసింది. దీంతో సౌమ్య అస్వస్థతకు గురయ్యారు. డెంగీ పరీక్షలు చేసిన వైద్యులు మూడు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాలని సూచించారు. ఎమ్మెల్యే పరిస్థితే ఇలా ఉంటే తమ పరిస్థితి ఏమిటని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. దోమల నివారణకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదంటున్నారు.

కాగా రాష్ట్రంలో మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా విష జ్వరాలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అన్ని జిల్లాల్లో జ్వరాల తీవ్రత అధికంగా ఉందని... వర్షాలు కురుస్తుండడం... ఇటీవల ఇంకుడు గుంతలు - ఇతర గుంతలు అని తవ్వడంతో వాటిలో నీరు చేరి దోమలు ఎక్కువై వ్యాధులు వస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటే తప్ప ప్రజారోగ్యం కుదుటపడేలా లేదు.