Begin typing your search above and press return to search.

చట్టసభల వ్యవహారాల్లో కోర్టుల జోక్యం ఏంటి..స్పీకర్ తమ్మినేని!

By:  Tupaki Desk   |   7 Aug 2020 1:10 PM GMT
చట్టసభల వ్యవహారాల్లో కోర్టుల జోక్యం ఏంటి..స్పీకర్ తమ్మినేని!
X
ఏపీ సభాపతిగా ఎన్నికై ఏడాది పూర్తి అయిన సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం .. అసెంబ్లీ ఆవరణంలో మీడియా తో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేసారు. ముఖ్యంగా చట్ట సభల నిర్ణయాల్లో కోర్టుల జోక్యంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. చట్ట సభల వ్యవహారాల్లో కోర్టుల జోక్యం చేసుకునేందుకు వీల్లేదని 1997లో అప్పటి స్పీకర్ యనమల రామకృష్ణుడు ఇచ్చిన రూలింగ్ ఇంకా అమల్లోనే ఉందని స్పీకర్ గుర్తుచేశారు. ఆ రూలింగ్ తీసుకువచ్చిన ..యనమల ఇప్పుడు శాసనసభ నిర్ణయాలపై కోర్టుకు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. కోర్టుకు వెళ్లడం దేశంలో ప్రజలందరికీ ఉన్న హక్కు అని, అయితే అప్పుడు యనమల ఇచ్చిన రూలింగ్ ను ఇప్పుడు ఏం చేయమంటారని టీడీపీని స్పీకర్ ప్రశ్నించారు. అలాగే దీనిపై సుప్రీం కూడా క్లారిటీ ఇచ్చింది అని తెలిపారు. చట్టసభల వ్యవహారాల్లో కోర్టుల జోక్యం ఉండరాదని సుప్రీంకోర్టు సహా అనేక కోర్టులు తీర్పులిచ్చాయని, ఎవరి స్వయం ప్రతిపత్తి వారికి ఉంటుందని తెలిపారు.

ముఖ్యంగా అయన మాట్లాడుతూ ... ఈ సంవత్సరం కాలంలో ప్రభుత్వం 52 చారిత్ర బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించిందని, చాలా సందర్భాల్లో సంక్లిష్ట పరిస్ధితులు ఎదురైనా దాన్ని అధిగమించామని తమ్మినేని వెల్లడించారు. ముఖ్యంగా మూడు రాజధానులకు సంబంధించిన వికేంద్రీకరణ బిల్లుపై అసెంబ్లీలో సుదీర్ఘంగా 11 గంటల చర్చ జరిగిందని, ఇందులో వైసీపీ నాలుగు గంటలు మాట్లాడితే విపక్షానికి 2 గంటల 17 నిమిషాలు ఇచ్చామని అయన తెలిపారు. అంత సమయం మాట్లాడినప్పటికీ ..ఇంకా చర్చ సక్రమంగా జరగలేదు అని అంటున్నారని తెలిపారు. అలాగే శాసనమండలికి మంత్రులు కీలకమైన బిల్లుల ఆమోదం కోసం వెళ్తారని, కానీ ప్రభుత్వ ప్రతినిధులుగా వెళ్లిన మంత్రులను మండలికి రాకూడదని కొందరు మాట్లాడటం సమంజసం కాదని , ఆనాడు మండలిలో మంత్రులకి ఎదురైన చేదు అనుభవాలని వివరించారు.

అలాగే , మూడు రాజధాని బిల్లులు ప్రవేశపెట్టేందుకు గతంలో ఓసారి మంత్రులు వెళ్లినప్పుడు ఛైర్మన్ అడ్డుకుని వాటిని సెలక్ట్‌ కమిటీకి పంపారు. రెండోసారి బిల్లులు ప్రవేశపెట్టేందుకు అవకాశమే ఇవ్వలేదు. అలాగే కోర్టుకి కూడా నిజానిజాలు సరిగ్గా చెప్పడం లేదని అన్నారు. అసెంబ్లీ, గవర్నర్ ఆమోదించిన బిల్లులు ఇంకా సెలక్ట్‌ కమిటీ వద్దే ఉన్నాయంటూ కోర్టులకు చెప్తున్నారని, అసలు సెలక్ట్‌ కమిటీయే ఏర్పాటు కానప్పుడు బిల్లులు పెండింగ్ లో ఎలా ఉంటాయని ప్రశ్నించారు. మూడు రాజధానుల బిల్లుని టీడీపీ సెలెక్ట్ కమిటీకి పంపించాలని అసెంబ్లీ లో అడగకుండా ...మండలిలో అడగడానికి వెనుక ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు. చట్టసభల్లో తీసుకున్న నిర్ణయాలు ప్రశ్నించడానికి వీల్లేదని రాజారామ్ వర్సెస్ లోక్ సభ కేసులో సుప్రీంకోర్టు చెప్పిందని, ఒక వేళ ప్రొసీజర్ లోపాలున్నా ప్రశ్నించకూడదాని ఆ తీర్పులో ఉందన్నారు. ఏ వ్యవస్ధ అయినా రాజ్యాంగానికి లోబడే పనిచేస్తుందని, గవర్నర్ ఎంతో మంది న్యాయనిపుణులతో చర్చించాకే రాజ్యాంగబద్ధమైన నిర్ణయానికి ఆమోదముద్ర వేశారని గుర్తుచేశారు. త్వరలో ఆల్ ఇండియా స్పీకర్ల సదస్సు పెట్టాలని నిర్ణయించినట్లు తమ్మినేని తెలిపారు.