Begin typing your search above and press return to search.

జగన్ సర్కారుకు తమ్మినేని వ్యాఖ్యల పోటు

By:  Tupaki Desk   |   26 April 2020 10:28 AM IST
జగన్ సర్కారుకు తమ్మినేని వ్యాఖ్యల పోటు
X
తమ్మినేని సీతారాం.. ఏపీ శాసన సభ స్పీకర్. అయితే ఈ లాక్ డౌన్ వేళ ఆయన చేసిన వ్యాఖ్యలు జగన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టాయి. కావాలని అన్నాడో లేక యథాలాపంగా వచ్చాయో.. బాధ చూడలేక ఆవేదనతో వాపోయాడో కానీ తమ్మినేని వ్యాఖ్యలు వైసీపీ ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేశాయి.

లాక్ డౌన్ సమయంలో ఏపీలో అక్రమ మద్యం అమ్మకాలు అధికంగా ఉన్నాయని స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. జగన్ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించాయి. ఏపీ రాష్ట్రానికి ప్రధాన ఆదాయమైన మద్యంపై దశల వారీగా ఆంక్షలు విధించి కఠినంగా అమలు చేస్తున్న జగన్ సర్కారుకు ఈ వ్యాఖ్యలు కొంపముంచాయి.

మద్యం అమ్మకాలపై ఏపీలో నిషేధం ఉన్నప్పటికీ మద్యం ప్రవహిస్తోందని తమ్మినేని వాపోయారు. ఎక్సైజ్, పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ శాఖ అధికారులు నిద్రపోతున్నారా అని ఆగ్రహించారు. కొంతమంది రాజకీయ నాయకులు రాత్రిపూట అక్రమ మద్యం తరలిస్తున్నారని.. వారిలో ఈ లాక్ డౌన్ లో లక్షాధికారులు అయిపోతున్నారని తమ్మినేని వ్యాఖ్యానించారు. మద్యం మాత్రమే కాదు.. గంజాయి.. నిషేధిత గుట్కా, ఖైనీల వ్యాపారం బాగా జరుగుతోందన్నారు. ఏపీలో ప్రతీచోట అందుబాటులో ఉన్నాయన్నారు. జగన్ ప్రభుత్వం ఈ అక్రమ మద్యం ప్రవాహం తగ్గించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని.. మద్యం మాఫియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కాగా ఇటీవలే సీఎం జగన్ తోపాటు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి రాష్ట్రంలో అక్రమ మద్యం వ్యాపారాన్ని అరికట్టామని.. గట్టిగా వ్యవహరిస్తున్నామని ప్రకటించిన వెంటనే తమ్మినేని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

అయితే ఏపీలో అక్రమ మద్యం లోకల్ గా తయారవుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. మద్యం మాఫియా దీన్ని తయారు చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటోంది. వీరిని అరికట్టడంలో విఫలమైన అధికారుల తీరుపై తమ్మినేని వ్యాఖ్యలు చేశారు. అయితే అవి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశాయి.