Begin typing your search above and press return to search.

ఆ ఇద్దరూ లేని వేళ... తంబీల తీర్పు ఏమిటో?

By:  Tupaki Desk   |   17 April 2019 1:30 AM GMT
ఆ ఇద్దరూ లేని వేళ... తంబీల తీర్పు ఏమిటో?
X
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అన్ని రాష్ట్రాల కంటే కూడా దక్షిణాది రాష్ట్రం తమిళనాడుపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఎన్నికల వేళ తెలివైన తీర్పును ఇస్తారని పేరున్న తమిళ ఓటర్లు ఈ సారి తమ ఓటును ఎవరికి వేస్తారన్న అంశం నిజంగానే ఆసక్తి కలిగిస్తోంది. ఇందుకు చాలా కారణాలే ఉన్నాయి. అందులో మొదటిది ఆ రాష్ట్ర రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాలను కూడా ప్రభావితం చేయగలిగిన ఇద్దరు ఉద్ధండులు ప్రస్తుతం లేకపోవడమే. అంతేనా వారిద్దరు కూడా అక్కడి రెండు ప్రధాన పార్టీల అధ్యక్షులే. వారిలో ఒకరు డీఎంకే దివంగత అధినేత, తమిళనాడు మాజీ సీఎం, రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి కాగా... మరొకరు అన్నాడీఎంకే అధినేత్రి - దివంగత సీఎం - తమిళ తంబీలంతా అమ్మగా కొలిచే జయలలిత. తమిళనాట వీరిద్దరి మధ్య సాగిన పోరు ఎప్పటికీ మరిచిపోలేనిదే. ఒకరు అధికారంలో ఉంటే మరొకరు ప్రతిపక్షంలో కూర్చున్న నేతలు. ఒకరిపై మరొకరు కత్తులు దూసుకున్న నేతలు. కేసులు పెట్టుకున్న నేతలు కూడానూ.

అంతేకాదండోయ్... వారిద్దరూ బతికున్నంత కాలం వారి పార్టీల్లో వారే కీలక నేతలు. స్టార్ క్యాంపెయినర్లు. సీఎం అభ్యర్థులు కూడా. బతికున్నంత కాలం తమ పార్టీలను ఏకఛత్రాదిఫత్యంగా ఏలిన నేతలు కూడానూ. విచిత్రం ఏమిటంటే... వారిద్దరూ కేవలం స్వల్ప తేడాలోనే పరమపదించడం. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరూ హోరాహోరీగా పోరాడారు. జయ గెలిచారు. కరుణ ఓడారు. మరో మారు ఎన్నికలు వచ్చేలోగానే వారిద్దరూ కాలం చేశారు. ఈ ఇద్దరు దిగ్గజాలు లేకుండా తమిళనాట జరుగుతున్న తొలి ఎన్నికలు ఈ సార్వత్రిక ఎన్నికలే కావడం గమనార్హం. వారిద్దరు బతికున్నంత కాలం ఆ రెండు పార్టీల తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులను కాకుండా ఈ ఇద్దరి ముఖాలను చూసే తమిళ ఓటరు పోలింగ్ కేంద్రాలకు వచ్చేవారు. మరి ఇప్పుడు ఈ ఇద్దరూ లేని సమయంలో తమిళ ఓటరు నాడి ఏ ఒక్కరికీ అంతు బట్టడం లేదు.

అదే సమయంలో కరుణ మరణంతో ఆయన కుమారుడు ఎంకే స్టాలిన్ ఢీఎంకే పగ్గాలు చేపడితే... జయ మరణంతో తొలుత పన్నీర్ సెల్వం, తర్వాత ఎడప్పాడి పళనిసామి ఆమె వారసత్వంగా సీఎం కుర్చీలో కూర్చున్నారు. ఈ లెక్కన కరుణ మేనియాను కాపాడుకోవాల్సిన బాధ్యత స్టాలిన్ పై ఉండగా.. జయ వారసత్వాన్ని నిలబెట్టుకునే బాధ్యత పన్నీర్ తో పాటు పళనిపైనా ఉంది. మరి ఈ రసవత్తర పోరులో తమిళ ఓటరు ఎవరి పక్షాన నిలబడతారన్న విషయం ఇప్పుడు అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇదిలా ఉంటే... తమిళనాట జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకేతో పాటు చాలా పార్టీలే బరిలో నిలిచాయి. ఎన్ని పార్టీలు ఉన్నా... ప్రత్యక్ష పోరు మాత్రం డీఎంకే, అన్నాడీఎంకేల మధ్యేనని చెప్పక తప్పదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తో డీఎంకే జట్టు కడితే... బీజేపీతో అన్నాడీఎంకే కలిసి పోటీ చేస్తోంది. జయలలిత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా తాము బీజేపీతో పొత్తు పుట్టెకోబోమని తెగేసి చెప్పేశారు. అయితే ఆమె మరణం తర్వాత బీజేపీ కదిపిన పావులతో పన్నీర్ తో పాటు పళని కూడా కమలనాథుల దరికే చేరారు. ఏకంగా ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నారు.

ఇక ఈ సారి తమిళ పోరులో మరో కీలక అంశం కూడా ఉంది. అదే కమల్ హాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యం పార్టీ, అన్నాడీఎంకే బహిష్కృత నేత టీవీవీ దినకరన్ పార్టీ. ఈ రెండు పార్టీలు కూడా ఈ దఫా పోటీ చేస్తున్నాయి. ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న 39 స్థానాల్లోనూ ఈ రెండు పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దించుతున్నాయి. ఈ నేపథ్యంలో డీఎంకే, అన్నాడీఎంకే ఓట్లకు చిల్లు పడే అవకాశాలు లేకపోలేదు. దీంతో ఫలితం ఎటు మొగ్గుతుందో అంతు చిక్కడం లేదన్న వాదన వినిపిస్తోంది. ఇక్కడ ఇంకో అంశాన్ని కూడా ప్రస్తావించుకోవాల్సి ఉంది. డీఎంకే, అన్నాడీఎంకే... రెండు పార్టీలు తమిళనాడుకు చెందిన ప్రాంతీయ పార్టీలే అయినా.. దేశ రాజకీయాల్లో పెను ప్రభావం చూపిన పార్టీలుగా రికార్డులు సృష్టించాయి. 40 ఎంపీ సీట్లున్న తమిళనాట... మెజారిటీ సీట్లను సంపాదించిన డీఎంకే అయినా, అన్నాడీఎంకే అయినా... కేంద్రంలో కొలువుదీరే ప్రభుత్వాల్లో కీలక భూమిక పోషించిన పార్టీలుగానే కొనసాగాయి. మరి ఇప్పుడు చతుర్ముఖ పోరులో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పలేని పరిస్థితి. అంతేకాకుండా అన్ని సీట్లను తలా కొంచెం పంచుకుంటే... దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే తమిళ పార్టీలు కనుమరుగైనట్టేనన్న వాదన కూడా వినిపిస్తోంది. మొత్తంగా ఈ ఎన్నికలు తమిళనాట అత్యంత కీలకమనే చెప్పాలి.