Begin typing your search above and press return to search.

ఎంపీలు వస్తున్నారు.. ఎమ్మెల్యేలు రావట్లేదెందుకు?

By:  Tupaki Desk   |   13 Feb 2017 6:50 AM GMT
ఎంపీలు వస్తున్నారు.. ఎమ్మెల్యేలు రావట్లేదెందుకు?
X
తమిళనాడు అధికారపక్షం అన్నాడీఎంకేలో నెలకొన్న రాజకీయ సంక్షోభం అంతా అర్థమైనట్లే కనిపిస్తున్నా.. అర్థం కాని అంశాలు చాలానేకనిపిస్తున్నాయి. బయట నుంచి చూస్తున్న వారికే కాదు..ఈ వ్యవహారంలో కీలకభూమిక పోసిస్తున్న వారికి సైతం కొన్ని ప్రశ్నలకు సమాధానాలు అస్సలు దొరకని పరిస్థితి. ప్రజలు.. ప్రముఖులు.. సినీతారల మద్దతు పన్నీర్ కు బాహాటంగానే ఇస్తున్నా.. కీలకమైన ఎమ్మెల్యేల మద్దతు పన్నీర్ కు ఆశించినంత ఎక్కువగాలభించటం లేదన్న వాదన వినిపిస్తోంది. నలుగురితో మొదలెట్టిన పన్నీర్ ప్రయాణం.. రోజులు గడుస్తున్నా.. అనుకున్న స్థాయిలో ఎమ్మెల్యేలు ఆయన వైపునకు రావట్లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అయినప్పటికీ.. పన్నీర్ లో మాత్రం ధైర్యంతో ఉండటం గమనార్హం. ఇదిలా ఉంటే.. పన్నీర్ ధైర్యం చూసిన శశికళ వర్గానికి అసలేం అర్థం కావటం లేదు. చేతిలో మెజార్టీ ఎమ్మెల్యేలు తమ వద్దే ఉన్నా.. పన్నీర్ అంత ధీమాను ఎలా ప్రదర్శిస్తున్నారన్నది వారికి అర్థం కావట్లేదు. ఇదిలా ఉంటే.. రెండు వర్గాలకు అర్థం కాని ఒక విషయం మాత్రం ఉంది. అదేమంటే.. 32 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల ఆచూకీ.

అటు పన్నీర్ వర్గానికి కానీ ఇటు చిన్నమ్మ వర్గానికి కానీ టచ్ లో లేని ఎమ్మెల్యేలు 32 మందిగా చెబుతున్నారు. వీరుఎక్కడున్నారు? వీరేం చేస్తున్నారు? అన్న విషయంపై అస్సలు స్పష్టత రావట్లేదు. తమ వద్ద 127 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా శశికళ చెబుతున్నప్పటికీ.. వాస్తవంగా వారి వద్ద ఉంది 95 మంది ఎమ్మెల్యేలే అని తెలుస్తోంది.

అంటే.. శశికళ వర్గం చెబుతున్న ఎమ్మెల్యేలకు వారి వద్ద వాస్తవంగా ఉన్న ఎమ్మెల్యేలకు మధ్య వ్యత్యాసం 32 మంది. మరి.. ఈ ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారన్న ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. వాళ్లంతా ఒకే చోట ఉన్నారా? వేర్వేరుచోట్ల ఉన్నారా? ఉంటే.. వారుఎవరి పక్షం? లాంటి ప్రశ్నలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ 32 మంది ఎమ్మెల్యేల్ని రహస్య ప్రదేశంలో చిన్నమ్మ దాచి ఉంచినట్లుగా చెబుతున్నారు.

కనిపించకుండా ఉన్న ఎమ్మెల్యేలంతా పన్నీర్ మద్దతుదారులుగా భావిస్తున్నారు. ఒకవేళ అంత బలమైన మద్దతుదారులైతే బయటకు రాకుండా ఎందుకు ఉంటున్నట్లు? అన్నది ఒక పెద్ద ప్రశ్న. పన్నీర్ కు మద్దతు పలుకుతున్న 32 మంది ఎమ్మెల్యేల్ని చిన్నమ్మ వర్గం బంధించి ఉంటుందన్న ఊహాగానాలు నిజమైన పక్షంలో.. పన్నీర్ వర్గం వారి విషయంలో ఏం చేస్తోంది? అన్న ప్రశ్న ఎదురవుతోంది. ప్రశ్నలు ఎక్కువగా.. సమాధానాలు తక్కువన్న అంశం ఏమైనా ఉందంటే.. ఆచూకీ లేకుండా పోయిన ఈ 32 మంది ఎమ్మెల్యేల ఇష్యూలోనే అన్న మాట వినిపిస్తోంది.