Begin typing your search above and press return to search.

నెటిజ‌న్ల తీర్పు సెల్వం, చిన్న‌మ్మ‌కు షాకిచ్చింది

By:  Tupaki Desk   |   9 Feb 2017 5:10 PM GMT
నెటిజ‌న్ల తీర్పు సెల్వం, చిన్న‌మ్మ‌కు షాకిచ్చింది
X
త‌మిళనాడులో అధికార అన్నాడీఎంకేలో రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్న సంగ‌తి తెలిసిందే. మూడు రోజులుగా కొన‌సాగుతున్న సస్పెన్స్‌ కు తెర దించుతూ గవర్నర్ విద్యాసాగర్‌రావు అప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వంతో పాటు - చిన్న‌మ్మ శ‌శిక‌ళ‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ ఇద్ద‌రి అనుచ‌రుల్లో ఎవ‌రికి వారు త‌మ నేత‌కే ప‌ద‌వీ యోగం ద‌క్కుతుంద‌ని ధీమాగా ఉన్నారు. అయితే సామాన్యుల‌తో పాటు నెటిజ‌న్లు సైతం త‌మిళ పాలిటిక్స్‌పై స్పందించారు. ఏకంగా ఒక పోల్ లో భాగ‌స్వామ్యం పంచుకొని త‌మ అభిప్రాయాన్ని వినిపించారు. ఆశ్చ‌ర్య‌క‌రంగా ఇందులో మెజార్టీ నెటిజ‌న్లు రాష్ట్రప‌తి పాల‌న‌కు మ‌ద్దతు ఇవ్వ‌డం విశేషం.

సోషల్ ఎంగేజ్‌ మెంట్ ప్లాట్‌ ఫామ్ అనే వేదిక తమిళనాడులో నెలకొన్న తాజా పరిస్థితులపై సర్వే నిర్వహించింది. ఇందులో 54 శాతం మంది రాష్ట్రప‌తి పాల‌న‌కే త‌మ ఓటు అని చెప్పారు. కొద్దికాలం రాష్ట్రప‌తి పాల‌న నిర్వ‌హించి అనంత‌రం కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు. అయితే మ‌రికొంద‌రు రాజ్యాంగ‌బ‌ద్ద‌మైన అభిప్రాయం తెలిపారు. త‌మిళ‌నాడు కాబోయే ముఖ్య‌మంత్రి ఎవ‌రో అసెంబ్లీ నిర్ణ‌యిస్తుంద‌ని తెలిపారు. ఇందుకోసం ఎమ్మెల్యేల ఓట్లు కీల‌క‌మైన‌వని వారు వ్యాఖ్యానించారు. ఇలా చెప్పిన వారి శాతం 34 ఉంది. మిగ‌తా వారు శ‌శిక‌ళ - ప‌న్నీర్ సెల్వంకు మ‌ద్ద‌తు ప‌లికారు.

ఇదిలాఉండ‌గా...తమిళనాడు ఇన్‌ చార్జీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావుతో ఆ రాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం భేటీ అయ్యారు. ఇవాళ ముంబై నుంచి చెన్నైలోని రాజ్‌ భవన్‌ కు చేరుకున్న విద్యాసాగర్ రావును పన్నీరు సెల్వం కలుసుకున్నారు. ప్రస్తుతం తమళనాడులో జరుగుతోన్న రాజకీయ పరిణామాలపై ఆయన గవర్నర్‌ తో చర్చించారు. తనకు ఎంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందో తెలిపారు. బల నిరూపణకు తనను ఆహ్వానించాల్సిందిగా కోరారు. కాగా, ఇవాళ సాయంత్రం 7.30 గంటలకు ఏఐఏడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన శశికళ నటరాజన్ కూడా గవర్నర్‌ ను కలువనున్నారు. ఇరువురు నేతలతో భేటీ తర్వాత ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై గవర్నర్ ఒక నిర్ణయానికి రానున్నారు. గవర్నర్ నిర్ణయం కోసం తమిళనాట అంతా ఉత్కంఠ నెలకొంది. మ‌రోవైపు ప‌న్నీర్‌ సెల్వం తిరుగుబాటు దరిమిలా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను చెన్నై ఎయిర్‌ పోర్టుకు సమీపంలోని ఒక హోటల్‌ కు బస్సుల్లో తరలించిన సంగ‌తి తెలిసిందే. శశికళతో ప్రమాణం చేయించడంలో జాప్యం జరిగే పక్షంలో ఎమ్మెల్యేలను రాష్ట్రపతి ముందుకు తీసుకువెళ్లే ఏర్పాట్లలో శశికళ వర్గం ఉందని వార్తలు వచ్చాయి. చిన్న‌మ్మ సమావేశానికి 131 మంది ఎమ్మెల్యేలు వచ్చారని శశికళవర్గం చెప్తున్నా నిజానికి వచ్చింది 87 మందేనని తెలుస్తోంది. సమావేశానికి రానివారంతా పన్నీర్‌కు మద్దతు పలుకుతారన్న అభిప్రాయం ఉంది. ఎమ్మెల్యేలు ఇప్పుడు శశికళ పక్షాన ఉన్నా.. వారు పరిస్థితులు అర్థం చేసుకుని తనకే మద్దతిస్తారని పన్నీర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావుతో స‌మావేశం సంద‌ర్బంగా సెల్వం ఇదే దీమాను వ్య‌క్తం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/