Begin typing your search above and press return to search.

ఈ దెబ్బతో తమిళులు మోడీని దగ్గరకు రానివ్వరట!

By:  Tupaki Desk   |   21 Aug 2020 10:15 AM IST
ఈ దెబ్బతో తమిళులు మోడీని దగ్గరకు రానివ్వరట!
X
తాను టార్గెట్ చేస్తే.. కొండ మీద కోతి సైతం కిందకు రావాల్సిందే. తాను అనుకున్న లక్ష్యాల్ని సాధించే విషయంలో ఇప్పటికే ఎన్నో విజయాల్ని సొంతం చేసుకున్న ప్రధాని.. ఇటువైపు బెంగాలీలు.. అటువైపు తమిళుల మనసుల్ని దోచుకోలేకపోయారు. త్వరలో జరిగే బెంగాల్ ఎన్నికల్లో ఈసారి పాగా వేయాలన్న తలంపుతో.. మరింత జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. రానున్న రోజుల్లో తమిళనాడులోనూ కమలవికాసానికి సరిపోయే ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్న మోడీ.. తాజాగా తనకొచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకుంటున్నారనే చెప్పాలి.

దేశంలో ఇన్నిరాష్ట్రాలు ఉన్నా.. తమిళులకు ఉన్న ప్రాంతీయ అభిమానం.. భాషాభిమానం.. ఇతరత్రా లాంటివి మరెవరికి ఉండవనే చెప్పాలి. పలు రాష్ట్రాల వారిని తన మాటలతోనూ.. చేతలతోనూ మనసుల్నిదోచేసే మోడీ.. తమిళుల విషయంలో మాత్రం ఇప్పటివరకు సక్సెస్ కాకపోవటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా అమెరికా ఉపాధ్యక్ష పదవికి తమిళ మూలాలున్న కమలా హ్యారీస్ బరిలో నిలవటం తెలిసిందే.

తమిళ వాసనల్ని కాసేపు పక్కన పెడతాం.. భారత మూలాలున్న ఆమెకు మద్దతుగా మోడీ ఇప్పటివరకు మాట్లాడింది లేదు. ట్రంప్ తో స్నేహం లాంటివన్ని పక్కన పెట్టి.. మా అమ్మాయి బరిలో ఉన్నప్పుడు ఆ మాత్రం మేం మాట్లాడకుండా ఉంటామా? అన్నట్లుగా వ్యవహరించింది లేదు. ట్రంప్ కు బాహాటంగా మద్దతు ప్రకటించి.. వచ్చే ఎన్నికల్లోనూ ఆయన్ను ప్రధానిగా చేయాలన్న మాట చెప్పిన మోడీ.. అంత కాకున్నా.. మనమ్మాయికి ఆల్ ద బెస్టు అన్న మాట చెప్పింది లేదు. మంచి ఫలితాల్ని సాధించాలన్న అభిలాషను వ్యక్తం చేసింది లేదు.

అక్కడెక్కడో అమెరికాలో ఉపాధ్యక్ష ఎన్నికల బరిలో ఉందన్న విషయం వార్తల్లోకి రాగానే.. తమిళనాడులో పలు చోట్ల కమలా హ్యారీస్ కటౌట్లు.. ఫ్లెక్సీలు వీధుల్లో దర్శనమివ్వటం.. ఆమె గెలుపు కోసం ప్రార్థనలు చేయటం మొదలు కావటం తెలిసిందే. తమిళ మూలాలున్న మహిళ అమెరికా ఉపాధ్యక్ష స్థానానికి పోటీ పడుతుంటే.. దన్నుగా నిలవని మోడీని.. తమిళులు ఒప్పుకుంటారా? అన్నది ప్రశ్న. అసలే మోడీ అంటే గిట్టని తమిళులకు.. తమ అమ్మాయి విషయంలో వ్యవహరించిన తీరును గుర్తుకు తెచ్చుకొని మరీ.. వ్యతిరేకించటం ఖాయమంటున్నారు. కమలా హ్యారీస్ విషయంలో మోడీ వ్యవహరిస్తున్న తీరు.. రానున్నరోజుల్లో తమిళులను మరింత దూరం చేస్తుందన్న మాట వినిపిస్తోంది. మరీ.. లెక్క మోడీ మదిలోకి వచ్చిందో లేదో?