Begin typing your search above and press return to search.

తమిళనాట బీఆర్ఎస్ కు ఊపు.. వాళ్లంతా కేసీఆర్ వైపు

By:  Tupaki Desk   |   12 Jan 2023 2:30 AM GMT
తమిళనాట బీఆర్ఎస్ కు ఊపు.. వాళ్లంతా కేసీఆర్ వైపు
X
భారత రాష్ట్ర సమితి పార్టీ దేశవ్యాప్తంగా విస్తరించే ప్రయత్నాలను ముమ్మరం చేస్తుండగా.. మరోవైపు వివిధ రాష్ట్రాల ప్రజాసంఘాల నుంచి అపూర్వ మద్దతు లభిస్తోంది. ఇప్పటికే ఏపీలో అడుగుపెట్టిన బీఆర్ఎస్ కు ఇప్పుడు తమిళనాడు నుంచి కూడా మద్దతు లభించింది. ఇటీవల తమిళనాడులోని నాడార్ సంఘాలు బీఆర్‌ఎస్ పార్టీకి మద్దతు పలికాయి. తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను తమిళనాడులో కూడా అమలు చేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కలిశారు.

తమిళనాడులో నాడార్లను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని నాడార్ నేతలు భావిస్తున్నారు. తెలంగాణలో గౌడ, ఈడిగ కులస్థులకు అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించాలని నాడార్ నాయకులు ఆకాంక్షించారు. తెలంగాణలో మాదిరిగా తమిళనాడులోనూ కులవృత్తులను, చేతివృత్తులను ప్రోత్సహించాలన్నారు. నాడార్ సంఘం నాయకులు మాట్లాడుతూ తెలంగాణలో కుల వృత్తులకు పూర్వవైభవం వచ్చిందని, తెలంగాణ రాష్ట్ర తరహాలో దేశవ్యాప్తంగా పథకాలు అమలు చేయాలని కోరారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీకి క్రమంగా మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి వివిధ సంఘాల ప్రతినిధులు స్వచ్ఛందంగా వచ్చి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ క్రమంలో త్వరలో చెన్నైలో నిర్వహించనున్న నాడార్ కుల సంఘాల సమావేశానికి సీఎం కేసీఆర్ ను ఆ సంఘం ప్రతినిధులు ఆహ్వానించారు. అంతేకాదు రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కలిసి సీఎం కేసీఆర్‌కు మద్దతు తెలిపేందుకు అవకాశం కల్పించాలని నాడార్ సంఘం ముఖ్య నేతలు కోరారు.

తమిళనాడు నాడార్ ఫౌండేషన్ అధ్యక్షుడు ఆర్నాల్డ్ అరసు, ఆల్ ఇండియా తమిళనాడు నాడార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ముత్తు రమేష్, ఆల్ ఇండియా తమిళనాడు నాడార్ అసోసియేషన్ ఆర్గనైజర్, తమిళనాడు నాడార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బాల కృష్ణన్, తమిళనాడు నాడార్ అసోసియేషన్ ట్రెజరర్ జ్ఞాన గౌతమ పాండియన్, తమిళనాడు నాడార్ అసోసియేషన్ కోఆర్డినేటర్ శశికాంత్, నాడార్ అసోసియేషన్ కోఆర్డినేటర్ కడకరై కార్తీకన్, నాడార్ అసోసియేషన్ అధ్యక్షుడు వీరకుమార్, ఎన్డీఆర్ ఫౌండేషన్ మహారాష్ట్ర అధ్యక్షుడు పువనేష్ నాడార్, తమిళనాడు అసోసియేషన్ మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శి తైవ కుమార్ నాడార్, డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

దీన్ని బట్టి తమిళనాడులోనూ పలువురు కులసంఘాలు.. అణగారిన వర్గాలు కేసీఆర్ పథకాలకు ఆకర్షితులై చేరడానికి రెడీ అవుతున్నారు. ఈ ప్రజాసంఘాల్లో కేసీఆర్ పథకాలు ప్రభావం చూపుతున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.