Begin typing your search above and press return to search.

చెన్నైలో వెయ్యి మంది చనిపోయారా?

By:  Tupaki Desk   |   19 Dec 2015 4:24 AM GMT
చెన్నైలో వెయ్యి మంది చనిపోయారా?
X
చెన్నై మహానగరాన్ని అతలాకుతలం చేసిన భారీ వర్షాలు.. వరదల కారణంగా మరణించిన మృతుల సంఖ్యపై ఇప్పటికి ఉన్న లెక్కల్ని పెద్ద ఎత్తున మారిపోతున్న పరిస్థితి చోటు చేసుకుంది. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం భారీ వర్షాలు.. వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 230 మాత్రమేనని తమిళనాడు సర్కారు చెబుతున్నప్పటికీ.. వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా ఉందని చెబుతున్నారు.

భారీగా కురిసిన వర్షాలకు కొట్టుకుపోవటం.. విద్యుద్ఘాతానికి గురై పెద్ద ఎత్తున ప్రజలు మరణించి ఉంటారన్న సందేహాలు కలుగుతున్నాయి. ఇప్పటికే వరదనీటిలో గల్లంతైన వారి మృతదేహాలు పెద్ద ఎత్తున లభిస్తున్నాయి. వరద కారణంగా భారీగా పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు పారిశుధ్య సిబ్బంది ప్రయత్నిస్తున్న సమయంలో.. భారీగా మృతదేహాలు లభ్యం కావటం కలకలం రేపుతోంది.

ఇలా దొరుకుతున్న మృతదేహాల కారణంగా.. మృతుల సంఖ్య వెయ్యికి పైనే ఉండొచ్చన్న అంచనా వ్యక్తమవుతోంది. పారిశుధ్య పనుల్లో భాగంగా లభ్యమవుతున్న మృతదేహాల్ని ప్రభుత్వ ఆసుపత్రులకు చేరుస్తున్నారు. దీంతో.. సామర్థ్యానికి మించి మార్చురీలు మృతదేహాలతో నిండిపోతున్నాయి. రోజురోజుకీ వచ్చి పడుతున్న శవాల్ని భద్రపర్చలేక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. రోజురోజుకీ పెరుగుతున్న శవాలతోపాటు.. వాటిని గుర్తించే విషయలో చోటు చేసుకుంటున్న జాప్యం పరిస్థితిని మరింత ఇబ్బందులకు గురి చేస్తోంది.

మృతదేహాల్ని గుర్తించే విషయంలో చాలానే ఇబ్బందులు ఎదురువుతున్నాయి. మృతదేహాలు చెడిపోవటం.. నీళ్లతో బాగా ఉబ్బిపోయి.. గుర్తించలేని విధంగా తయారుకావటంతో.. గుర్తింపు పెద్ద సమస్యగా మారింది. మృతుల సంఖ్య పెరిగితే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్న ఆలోచనతో ప్రభుత్వం వ్యవహరిస్తుందన్న విమర్శ బలంగా వినిపిస్తోంది. మార్చురీల్లో పెరిగిపోతున్న మృతదేహాల గురించి ఎలాంటి సమాచారం బయటకు రానీయొద్దంటూ అనధికార ఆదేశాలు ప్రభుత్వం నుంచి వస్తున్నట్లుగా బలమైన వాదన వినిపిస్తోంది. తాజా అంచనాల ప్రకారం.. వరదల కారణంగా మృతుల సంఖ్య వెయ్యి అంతకంటే ఎక్కువ ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.