Begin typing your search above and press return to search.

జయలలిత ఆస్ప‌త్రి బిల్లు ఎంతో తెలుసా?

By:  Tupaki Desk   |   19 Dec 2018 6:46 AM GMT
జయలలిత ఆస్ప‌త్రి బిల్లు ఎంతో తెలుసా?
X
తమిళనాడు దివంగ‌త‌ ముఖ్యమంత్రి జయలలిత కు చెన్నైలోని అపోలో ఆస్ప‌త్రిలో అందించిన చికిత్స అంతా ఓ ర‌హస్యం. రాష్ట్ర ప్ర‌భుత్వం గానీ ఆస్ప‌త్రివ‌ర్గాలు గానీ ఆమె చికిత్స‌కు సంబంధించిన వివ‌రాల‌ను అప్ప‌ట్లో ఏమాత్రం బ‌య‌ట‌కి రానివ్వ‌లేదు. పుర‌చ్చి త‌లైవి(జ‌య‌ల‌లిత‌) మ‌రణించిన‌ప్ప‌టికీ ఆమె కు చికిత్స చేస్తున్న‌ట్లు వైద్యులు న‌టిస్తున్నార‌ని కూడా ప్ర‌చారం జ‌రిగింది. జ‌య‌ల‌లిత త‌న చివ‌రి రోజుల్లో దాదాపు రెండున్న‌ర నెల‌ల‌పాటు ఆస్ప‌త్రిలోనే ఉన్నారు. ఆమె చికిత్స‌కు అయిన ఖ‌ర్చు వివ‌రాలు తాజాగా వెలుగులోకి వ‌చ్చాయి. అమ్మ మృతి పై ద‌ర్యాప్తు చేస్తున్న విచార‌ణ క‌మిటీకి అపోలో ఆస్ప‌త్రి యాజ‌మాన్యం ఈ మేర‌కు ఖ‌ర్చుల వివ‌రాల‌తో నివేదిక సమ‌ర్పించింది. 75 రోజుల చికిత్స‌కు గాను మొత్తం రూ.6.68 కోట్ల ఖ‌ర్చ‌యిన‌ట్లు అందులో వెల్ల‌డించింది.

2016 సెప్టెంబరు 22న జయలలిత అనారోగ్యం తో చెన్నైలోని అపోలో ఆసుపత్రి లో చేరారు. అదే ఏడాది డిసెంబ‌రు 5న‌ తుదిశ్వాస విడిచే వ‌ర‌కు అక్క‌డే చికిత్స తీసుకున్నారు. ఈ 75 రోజుల చికిత్స‌ కు మొత్తం రూ.6.68 కోట్లు ఖ‌ర్చ‌య్యాయ‌ట‌. అందులో కేవ‌లం ఆహారం- పానీయాల కోస‌మే రూ.1.17 కోట్లు వెచ్చించార‌ట‌. అమ్మ‌ కు చికిత్స అందించేందుకు గాను బ్రిట‌న్ నుంచి ప్ర‌త్యేకంగా ర‌ప్పించిన వైద్యుడు రిచ‌ర్డ్ బేలే కు రూ.92 ల‌క్ష‌లు చెల్లించార‌ట‌.

జయలలిత మరణించిన కొన్ని నెలల తర్వాత 2017 జూన్‌ 15న అన్నాడీఎంకే పార్టీ రూ. 6 కోట్లను త‌మ‌కు చెల్లించిన‌ట్లు అపోలో యాజ‌మాన్యం నివేదిక‌లో వెల్ల‌డించింది. అంతకుముందు అమ్మ ఆసుపత్రి లో ఉన్న సమయంలోనే రూ. 41.13 లక్షలు చెల్లించిన‌ట్లు తెలిపింది. మ‌రో రూ. 44.56 లక్షలు చెల్లించాల్సి ఉందని పేర్కొంది. గ‌త నెల 27న అపోలో స‌మ‌ర్పించిన ఈ ఖ‌ర్చుల నివేదిక ప్ర‌స్తుతం బ‌య‌ట‌కు లీకై సోష‌ల్ మీడియా లో విస్తృతంగా ప్ర‌చారంలోకి వ‌చ్చింది.