Begin typing your search above and press return to search.

ఈయన తమిళనాడు గాలి జనార్దనరెడ్డి

By:  Tupaki Desk   |   10 Dec 2016 9:08 AM GMT
ఈయన తమిళనాడు గాలి జనార్దనరెడ్డి
X
రెండు ఎడ్ల బళ్లు మాత్రమే ఆస్తిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు రెండు వేల కోట్లకు అధిపతి. ఇంకా చెప్పాలంటే ఈయన మరో గాలి జనార్దనరెడ్డి. ఇదంతా ఎవరి గురించో ఈ సరికే అర్థమై ఉంటుంది. వందల కోట్ల నోట్లు... వందల కేజీల బంగారంతో దొరికిపోయిన టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర రెడ్డే ఆ ఘనుడు. చంద్రబాబు ప్రభుత్వం టీటీడీ బోర్డు మెంబరుగా నియమించిన శేఖరరెడ్డి గురించి ఇంతవరకు తెలుగువారికి పెద్దగా తెలియదు. కానీ ఇపుడు ఆయ‌న దేశ‌వ్యాప్తంగా సుప‌రిచితుడు. రెండు ఎడ్ల బళ్లతో మొదలైన ఆయన ప్రస్థానం ఏకంగా చెన్నైలో అతిపెద్ద కాంట్రాక్టరుగా మారడం... 2 వేల కోట్లకు అధిపతిగా మారడం వెనుక కథ మామూలుది కాదు.

శేఖరరెడ్డి ప్రధానంగా ఇసుక దందాలతో ఇంత సామ్రాజ్యం సృష్టించుకున్నారు. అదే డబ్బుతో తమిళనాడులో తన వ్యాపారాలను విస్తరించుకున్నాడు. అన్నాడిఎంకె పార్టీలోనూ కీలకంగా మారాడు. 2009 నుంచి మొదలైన ఆయన సంపాదన ఇప్పటివరకూ రెండు వేల కోట్లకు పైనే ఉన్నట్లు సమాచారం. ఐటి అధికారులు మాత్రం కేవలం రూ.70 కోట్ల కొత్త నోట్లు, 20 కోట్ల పాత నోట్లతో పాటు, 100 కిలోల బంగారం ఉన్నట్లు నిగ్గు తేల్చారు. ఇవి కాకుండా స్థిరాస్తులు లెక్కకు దొరకనంత ఉన్నాయి.

శేఖర్‌రెడ్డి సొంతూరు తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా కాట్పాడి. చిత్తూరు సమీపంలో అత్తగారి ఊరు. ఒకప్పుడు కాట్పాడిలో రెండు టైర్ల ఎడ్లబండ్లతో ఇసుకను తోలుకుంటూ జీవనం గడిపేవాడు. ఆ తరువాత రెండు ట్రాక్టర్లు తీసుకున్నాడు. అనంతరం ఇసుక టెండర్ల వ్యాపారంలోకి చేరుకున్నాడు. ఓ ప్రజాప్రతినిధి భాగస్వామ్యంతో తన వ్యాపారం సులభతరం చేసుకున్నాడు. 2009లో అన్నాడిఎంకెలో చేరి చెన్నై సమీపంలోని రెండు నదులను లీజుకు తీసుకున్నాడు. అంతే ఒక్కసారిగా కోట్లకు పడగలెత్తాడు. తమిళనాడు రాష్ట్రంలోని మొత్తం ఇసుకను తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. రోజుకు లక్షల రూపాయల ఇసుక లావాదేవీలు జరిపేవాడు. దీంతో పాటు కంకర వ్యాపారాన్ని మొదలెట్టాడు. ప్రభుత్వ అండదండలు పుష్కలంగా ఉండడంతో సర్కారు పనులన్నీ ఆయనకే దక్కేవి. తాజాగా తమిళనాడు ప్రభుత్వం నిర్మించే ప్రభుత్వ భవనాల కాంట్రాక్టును ఆయనే దక్కించుకున్నాడు. పన్నీరుసెల్వంకు, శశికళకు సన్నిహితుడై అడ్డగోలుగా సంపాదించాడు. ఆయన బంధువులైన ప్రేమ్‌రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి పేరుతోనూ ఆస్తులను పోగేసుకున్నాడు. డబ్బుండి పెట్టుబడి పెట్టడానికి ఏమాత్రం తగ్గకపోవడంతో అన్నా డీఎంకేలోనూ కీలకంగా ఎదిగాడు. ఏపీలోనూ చక్రం తిప్పి చంద్రబాబు సహకారంతో టీటీడీబోర్డులోనూ ఎంటరయ్యాడు.