Begin typing your search above and press return to search.

సీఎం కేసీఆర్ పై గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   18 Aug 2020 2:00 PM GMT
సీఎం కేసీఆర్ పై గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
X
ఎక్కడో స్విచ్ వేస్తే మరెక్కడో లైటు వెలగటం కొన్నిసార్లు రాజకీయాల్లో చూస్తుంటాం. ఇప్పుడు అలాంటి పరిస్థితే తెలంగాణలో నెలకొంది. తెలంగాణలో తిరుగులేని రాజకీయ అధికారాన్ని సొంతం చేసుకోవటమే కాదు.. ప్రత్యర్థులు దరిదాపుల్లోకి రాని రీతిలో ఉన్న గులాబీ నేత మీద విమర్శలు చేయటం అంత తేలికైన విషయం కాదు. ఒకవేళ విమర్శలు చేసినా.. తెలంగాణ ప్రజలు వాటిని సీరియస్ గా తీసుకోవటం.. తమకున్న అసంతృప్తికి అలాంటి వ్యాఖ్యల్ని జతపర్చుకోవటం లాంటివి ఇప్పటివరకు చోటు చేసుకోలేదు.

అందుకు తగ్గ నేత తెలంగాణలో ఇప్పుడు కనిపించటం లేదన్న మాట వినిపిస్తోంది. ఇలాంటివేళ.. కీలకమైన రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ తమిళ సై అనూహ్యంగా తెర మీదకు వచ్చారు. కరోనా ఎపిసోడ్ లో తెలంగాణ అధికారపక్షం సరిగా వ్యవహరించటం లేదన్న మాట పలువురి నోట వినిపిస్తున్న వేళ.. ఆమె నోటి నుంచి కూడా అలాంటి మాటనే రావటం ఆసక్తికరంగా మారింది. కరోనా కట్టడిలో కేసీఆర్ సర్కారు క్రియాశీలకంగా వ్యవహరించటం లేదన్న మాట ఆమె నోటి నుంచి రావటం సంచలనంగా మారింది.

కరోనా నియంత్రణకు పెద్ద సంఖ్యలో టెస్టులు చేయటమే పరిష్కారమని.. మొబైల్ టెస్టింగులు చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లుగా ఆమె పేర్కొన్నారు. కరోనా తీవ్రత.. వ్యాప్తిపై ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ.. సూచనలు చేస్తూ తాను ఐదారు లేఖలు రాసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేనట్లుగా గవర్నర్ పేర్కొన్నట్లుగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

కరోనా ఎపిసోడ్ లో కేసీఆర్ సర్కారు చేసిన తప్పుల్ని ఎత్తి చూపేలా ఆమె వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. కట్టడి ప్రాంతాల విషయంలోనూ ప్రభుత్వం ఉదాసీనంగా ఉందని.. కరోనా బాధితులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు లేక ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లటాన్ని ఆమె ప్రస్తావించారు.

తెలంగాణ ప్రభుత్వానికి కరోనా చికిత్స భారంగా మారినట్లుగా పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల రోగులు ఆసక్తి చూపకపోవటాన్ని ఆమె ప్రస్తావిస్తూ.. ప్రభుత్వం అన్ని వసతులు సమకూర్చినట్లుగా చెప్పినా.. అలాంటిదేమీ లేదన్న ఆమె.. మరో కీలక వ్యాఖ్య కూడా చేశారు. తనతో ముఖ్యమంత్రి సమావేశమైన సందర్భంగానే తాను చెప్పినన్ని విషయాల్ని గట్టిగానే చెప్పినట్లుగా పేర్కొనటం ద్వారా.. ఆమె సరికొత్త సంచలనానికి తెర తీశారని చెప్పక తప్పదు. మరి.. దీనిపై కేసీఆర్ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.