Begin typing your search above and press return to search.

మొండితనంలో తాను తక్కువ తినలేదన్నట్లుగా తమిళ సై!

By:  Tupaki Desk   |   25 Oct 2022 4:25 AM GMT
మొండితనంలో తాను తక్కువ తినలేదన్నట్లుగా తమిళ సై!
X
మీ ఇంటి నుంచి మా ఇల్లు ఎంత దూరమో.. మా ఇంటి నుంచి మీ ఇల్లు కూడా అంతే దూరమన్న సామెతను సరికొత్తగా గుర్తు చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై. గులాబీ బాస్ కమ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరుతో పలుమార్లు మనస్తాపానికి గురైనట్లుగా వెల్లడించిన తమిళ సై.. తాను కూడా తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యల్ని చూసినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి.. రాష్ట్ర గవర్నర్ కు మధ్య సత్ససంబంధాలు ఏమాత్రం లేవన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

ఈ ఇద్దరి మధ్య గ్యాప్ మరింత పెరిగిందన్న విషయం తాజాగా బయటకు వచ్చింది. తెలంగాణ అసెంబ్లీలో పాస్ అయిన బిల్లులు.. గవర్నర్ ఆమోదం కోసం వెళ్లగా.. వాటికి ఆమె రాజముద్ర పడకపోవటంతో.. అలానే పెండింగ్ లో ఉండిపోయాయి. తన విషయంలో కేసీఆర్ సర్కారు వ్యవహరిస్తున్న ధోరణికి తీసిపోని రీతిలో ఆమె తీరు ఉండటం గమనార్హం. ఆరు చట్ట సవరణ బిల్లులతో పాటు మరో రెండు కొత్త బిల్లులు సైతం పెండింగ్ లోనే ఉన్నాయి.

రాజ్ భవన్ లో పెండింగ్ లో ఉన్న బిల్లుల్ని చూస్తే.. వర్సిటీల్లో రిక్రూట్‌మెంట్‌కు కామన్ బోర్డు, మున్సిపాలిటీ యాక్ట్ సవరణ, ఫారెస్ట్ వర్సిటీ, అజామాబాద్‌ పారిశ్రామికవాడ చట్టం బిల్లులు పెండింగ్‌‌లో ఉన్నాయి. అసెంబ్లీ చట్టం చేసినా.. దానికి రాజముద్ర వేయాల్సింది మాత్రం గవర్నరే. తనను పూచిక పుల్ల మాదిరి అన్నట్లుగా వ్యవహరిస్తున్న కేసీఆర్ సర్కారుకు టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా తన చేతిలో ఉన్న అధికారాన్ని తమిళ సై చూపించేందుకు వెనుకాడటంతో లేదు. ఈ పరిణామాలతో తెలంగాణ సర్కార్ - గవర్నర్ మధ్య గ్యాప్ మరింత పెరిగిందంటున్నారు.

బిల్లుల్ని రాజ్ భవన్ లో ఆమోద ముద్ర్ వేయకుండా ఆపటంపైనా గవర్నర్ తమిళ సై స్పందిస్తున్నారు. బిల్లుల్ని ఆపే విచక్షణ అధికారం తనకు ఉన్న విషయాన్ని ఆమె గుర్తు చేయగా.. టీఆర్ఎస్ సర్కారు మాత్రం మౌనంగా ఉంటోంది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి సుదీర్ఘ కాలం పాటు రాష్ట్ర గవర్నర్ గా వ్యవహరిస్తున్న ఈఎస్ఎల్ నరసింహన్ తో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతటి రిలేషన్ ఉంటుందన్నది తెలిసిందే. దేశంలో మరే ముఖ్యమంత్రికి గవర్నర్ కు లేనంత దగ్గరి తనం వారిద్దరికి ఉండటమే కాదు.. మరే ముఖ్యమంత్రి వెళ్లనన్నిసార్లు రాజ్ భవన్ కు సీఎం హోదాలో వెళ్లిన కేసీఆర్.. గంటల కొద్దీ సమయాన్ని అక్కడే గడపటం అప్పట్లో చర్చనీయాంశంగా ఉండేది. ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయని చెప్పక తప్పదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.