Begin typing your search above and press return to search.

మరోసారి తమిళ సైకు అవమానం.. ఇదెక్కడి సంప్రదాయం?

By:  Tupaki Desk   |   13 July 2022 8:30 AM GMT
మరోసారి తమిళ సైకు అవమానం.. ఇదెక్కడి సంప్రదాయం?
X
దేశంలోని మరే రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పనన్ని నీతుల్ని చెప్పే స్తుంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. మీడియా ముందుకు వచ్చిన సందర్భంలో నోరు తెరిస్తే చాలు.. విలువల గురించి నాన్ స్టాప్ గా చెప్పేస్తుంటారు. అలాంటి పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో.. రాష్ట్ర గవర్నర్ గా వ్యవహరిస్తున్న తమిళ సైకు వరుస పెట్టి ప్రోటోకాల్ అవమానాలు ఎదురుకావటం దేనికి నిదర్శనం? అన్నదిప్పుడు ప్రశ్న. మొదట్లో బాగానే ఉన్నా.. తర్వాతి కాలంలో చోటు చేసుకున్న పరిణామాలతో ఇరువురి మధ్య దూరం పెరగటం తెలిసిందే.

అప్పటి నుంచి ప్రోటోకాల్ ప్రకారం జరగాల్సినవేవీ జరగకపోవటం తెలిసిందే. పలు మార్లు చూసినా పరిస్థితుల్లో మార్పు రాని నేపథ్యంలో.. కేంద్రానికి కంప్లైంట్ చేశారు తమిళ సై. గవర్నర్ విషయంలో వ్యవహరించాల్సిన ప్రోటోకాల్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్న ఆమెకు మరోసారి అవమానం తప్పలేదు.

తాజాగా నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలోని కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన రాణి రుద్రమదేవి మరణ శిలా శాసనం.. కాంస్య విగ్రహం సందర్శనకు గవర్నర్ తమిళ వెళ్లారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ.. ఎస్పీ రెమా రాజేశ్వరీలు స్వాగతం పలకాల్సి ఉంది. అయితే.. వారు మాత్రం హాజరు కాలేదు. అదే సమయంలో సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ మాత్రం గవర్నర్ కు స్వాగతం పలికి ఆశ్చర్యపరిచారు. ఇది జరిగిన కాసేపటికి ఆయన వెళ్లిపోయారు. సాధారణంగా రాష్ట్ర గవర్నర్ పర్యటన అంటే.. అధికారులు అటెన్షన్ తో ఉండటంతో పాటు.. పక్కా ప్రోసీజర్ ను పాటిస్తారు. అందుకు భిన్నంగా ఎవరికి వారు అన్నట్లుగా వ్యవహరించటం హాట్ టాపిక్ గా మారింది.

తన విషయంలో కేసీఆర్ సర్కారు కఠినంగా వ్యవహరిస్తుందంటూ గవర్నర్ తమిళ సై ఇప్పటికే ఆరోపించటం తెలిసిందే. ఇప్పటికే గవర్నర్ ఇచ్చిన ప్రోటోకాల్ పాటించని కంప్లైంట్ పై కేంద్ర హోం శాఖ సీరియస్ గా ఉన్నట్లు చెబుతున్నారు.

ఇటీవల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్ ను గవర్నర్ తమిళ సై అప్యాయంగా పలుకరించటంతో వివాదం ముగిసిపోయిందన్న మాట వినిపించింది. అయితే.. అదేమీ లేదన్న వైనం తాజా పరిణామంతో మరోసారి స్పష్టమైంది. నీతులు వల్లిస్తూ.. సంస్కారం గురించి మాట్లాడే సీఎం కేసీఆర్ పాలనలో అత్యుత్తమ స్థానాల్లో ఉన్న వారికి ఇవ్వాల్సిన మర్యాద.. గౌరవం మిస్ కావటం దేనికి నిదర్శనం? అన్నదిప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పాలి.