Begin typing your search above and press return to search.

ఢిల్లీ చేతుల్లో తమిళ పాలిటిక్స్

By:  Tupaki Desk   |   7 Dec 2016 11:30 AM GMT
ఢిల్లీ చేతుల్లో తమిళ పాలిటిక్స్
X
జయలలిత ఒక తిరుగులేని రాజకీయ శక్తి.. కానీ, దేశంలో మిగతా రాజకీయ శక్తుల్లా ఆమెకు కుటుంబం లేదు. ఆమె లేకుంటే నడిపించే సొంత మనుషుల్లేరు. పరాయి మనుషులే సొంత మనుషుల్లా ఆమెతో ఉంటున్నారంతే. కానీ... 75 రోజులు ఆసుపత్రిలో ఉండి చివరకు మృత్యువుపాలైన జయ అంతిమయాత్ర దేశాన్ని కదిలించింది. ఢిల్లీ నుంచి నేతలు దిగివచ్చారు. అధికార లాంఛనాలతో అత్యంత ఘనంగా సాగాయి.. సొంత కుటుంబం లేకున్నా నమ్మినవారే నడిపించడం ఒక కారణమైతే కేంద్ర ప్రభుత్వ చొరవా మరో ఎత్తు.

ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర్నుంచి పలువురు కేంద్ర మంత్రులు హాజరు కావడంతో బాటు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సోమవారం సాయంత్రం నుంచి దగ్గరుండి అంతా తానై సర్వం నడిపించారు. రాజాజీ హాల్‌ లో ప్రధాని మోడీ జయ పార్దివ దేహానికి నివాళులు అర్పించే సన్నివేశం రాష్ట్రం లో భావి రాజకీయ సమీకరణాలకు అద్దం పట్టిందని విశ్లేషకులు చెబుతున్నారు.

తమిళ రాజకీయాన్ని జయ మరణించిన వెంటనే విశ్లేషించడం తొందరపాటే అయినా... జయ ఆసుపత్రి పాలైన కొద్దినాళ్లకే ఆమె మరణం తప్పదని తెలియడంతో రాజకీయ సమీకరణలు పురుడుపోసుకున్నాయని అర్థమవుతోంది. నిన్న.. జయ శవపేటిక వద్ద విషణ్ణ వదనంతో నిలబడి ఉన్న శశికళ దగ్గరకు మోడీ వెళ్లి పరామర్శిస్తుండగా.. తన పక్కనే ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వంను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మోడీ దగ్గరకు వెళ్లాలని మౌనంగానే సూచించారు. పన్నీర్‌ సెల్వం వీపుమీద చెయ్యేసి మోడీ వైపుకి ఆయన నడిపించారు. పన్నీర్‌ సెల్వం వెంకయ్య నాయుడు చెప్పినట్టు ముందుకు నడిచి మోడీ పక్కనే నిలబడి తలవంచుకుని విలపించసాగారు. అప్పుడు మోడీ దృష్టి పన్నీర్‌ సెల్వం వైపు మళ్లింది. పన్నీర్‌ సెల్వం చేతులు పట్టుకుని మోడీ ఆయన్ని ఓదార్చే ప్రయత్నం చేశారు. దీంతో నరేంద్ర మోడీ ఎక్కువ సమయాన్ని శశికళ వైపు గడిపే అవకాశం లేకపోయింది. ఆ సమయంలో పన్నీర్‌ సెల్వం మోడీ పక్కకు రావడం..మోడీ ఆయనవైపు తిరగడం..చూసి శశికళ కాస్తంత అసహనంతోను అసంతృప్తితోను చూశారు. రెండు మూడు నిమిషాల అతి కొద్ది సమయంలో జరిగిన ఈ అతి చిన్ని సన్నివేశంలోనే తమిళ భావి రాజకీయ చిత్రం కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా బీజేపీ తమిళనాడులో ఈ రాజకీయ శూన్యతను తన ప్రయోజనాలకు అనుగుణంగా మలుచుకోవాలని అనుకుంటున్నట్టు వారు భావిస్తున్నారు. ఒకవంక జయలలిత మరణం..మరోవంక డీఎంకే అధినేత కరుణానిధి అస్వస్థత..ప్రజాబాహుళ్యంలో డీఎంకే ఇంకా కోలుకోకపోవడం..ఈపరిణామాల నేపథ్యంలో బీజేపీ రాష్ట్రంలో రాజకీయ పాగాకు ప్రయత్నాలు ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుత అన్నాడీఎంకే విషయానికొస్తే..శశికళ ఒక ప్రధాన అధికార కేంద్రం.. ఇక ముఖ్యమంత్రిగా తాజాగా అధికార పీఠమెక్కిన పన్నీర్‌ సెల్వం జయలలితకు నమ్మినబంటు. జయ విశ్వాసాన్ని చూరగొన్న నాయకుడిగా పన్నీర్‌ సెల్వంను అన్నాడీఎంకే నేతలు - కార్యకకర్తలు - సాధారణ ప్రజానీకం ప్రస్తుతానికి ఆమోదిస్తున్నారు. శశి కళకు జనబాహుళ్యంలో సానుకూలత లేదు. జయలలితను ఇబ్బందుల పాల్జేసి కోర్టుల చుట్టు తిరగడానికి, జైళ్లపాలు కావడానికి ఆమే కారణమని చాలామంది అభిప్రాయం. పన్నీర్‌ సెల్వం మీద అలాంటి వ్యతిరేకత లేదు. దీంతో పన్నీర్‌ సెల్వం ను బీజేపీ ఎంచుకున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ కు ఎప్పుడూ అనుకూలంగా ఉండే డీఎంకేను దెబ్బకొట్టడానికి అన్నాడీఎంకే తో కలిసి పనిచేయడానికి పన్నీర్ తమకు పనికొస్తాడని భావిస్తోంది. అంతేకాదు.. జయకు మాదిరిగానే ఆయన్ను తమకు విశ్వాసపాత్రుడిగా మార్చుకోవాలన్నది బీజేపీ ప్లాన్ అని తెలుస్తోంది. ఆయనకు మద్దతు ఇవ్వడం ద్వారా తమిళనాట తాము పాదం మోపి బలపడాలని బీజేపీ ఆశిస్తున్నట్టు కనిపిస్తోంది. అందు లో భాగంగానే పన్నీర్‌ సెల్వంని ప్రధాని మోడీ పక్కన ఎక్కువ సమయం ఉంచే ప్రయత్నం జరిగిందన్నది రాజకీయ విశ్లేష కుల అభిప్రాయం.

మరోవైపు శశికళ.. పన్నీర్‌సెల్వంను ప్రస్తుతానికి ఆమోదించినా ఆమె లక్షం సీఎం సీటేనని... ఆర్నెళ్లలో ఆమె ఆట మొదలుపెడతారని భావిస్తున్నారు. రాజాజీ హాలులో జయ పార్దివ దేహం చుట్టూ శశికళ బంధు వర్గమే ఉంది.. జయ తాలూకు బంధువులెవ్వరూ ఆ దరిదాపులకు రాకుండా శశికళ వర్గం అడ్డుకుంది. ఈ అంశంపై అన్నాడీఎంకేలోని కిందిస్ధాయి నాయ కులు, సాధారణ ప్రజలు ఇప్పటికే విమర్శలు చేస్తున్నారు. దీంతో అన్నా డీఎంకేలో చిచ్చు తప్పదని భావిస్తున్నారు. అలాంటి సమయాల్లో పన్నీరుకు అండగా నిలిచి తమిళనాడులో పరపతి పెంచుకోవాలన్నది బీజేపీ ప్లానుగా తెలుస్తోంది.

- గరుడ


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/