Begin typing your search above and press return to search.

‘అమ్మ’ కోసం తమిళుల ఆరాటం ఎంతంటే..

By:  Tupaki Desk   |   14 Oct 2016 4:51 AM GMT
‘అమ్మ’ కోసం తమిళుల ఆరాటం ఎంతంటే..
X
తమిళులు అభిమానించటం మొదలు పెడితే అదెలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అభిమానించే వారిని నెత్తిన పెట్టుకోవటం.. వారి కోసం ఎంతకైనా అన్నట్లుగా వ్యవహరించటం తమిళులకు అలవాటే. అలాంటి వారు తమ ఆరాధ్యదైవంగా ఫీలయ్యే అమ్మ జయలలిత గడిచిన 24 రోజులుగా ఆసుపత్రిలోనే ఉండిపోవటం తెలిసిందే. తీవ్రమైన జ్వరం.. డీహైడ్రేషన్ రెండు కారణాలతో చెన్నై అపోలోకు అర్దరాత్రి వేళ హడావుడిగా తరలించటం తమిళులకు షాక్ తినేలా చేసింది. రోజులు గడుస్తున్నా.. అమ్మ ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం బయటకు పొక్కకపోవటం.. అసలేం జరుగుతుందన్న అంశంపై స్పష్టత లేకపోవటంతో తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి.

ఇదే అదునుగా కొందరు సోషల్ మీడియా వదంతులతో భావోద్వేగాలు తీవ్రస్థాయికి వెళ్లటం.. అమ్మ ఆరోగ్యంపై తీవ్ర మనస్తాపానికి గురి కావటం జరిగింది. స్పందించిన తమిళనాడు పోలీసుల పుణ్యమా అని పరిస్థితి అదుపు తప్పకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సోషల్ మీడియాతో అబద్ధాల్ని ప్రచారం చేసే వారిని అదుపులోకి తీసుకోవటంతో.. ఈ తరహా ప్రచారానికి బ్రేకులు పడ్డాయి.

ఇదిలా ఉంటే.. అమ్మ ఆరోగ్యం బాగుందని.. ఆమె పేపర్లు చదువుతున్నారంటూ అన్నాడీఎంకే పార్టీ అధికార ప్రతినిధి సరస్వతి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహాన్ని నింపటమే కాదు.. గడిచిన 24 రోజులుగా దిగులుగా ఉన్న వారిలో కొంత ఉత్సాహం చోటు చేసుకుంది. ఇదిలా ఉంటే.. అమ్మ ఆరోగ్యంపై ఆందోళనలు పెరిగి కొన్ని దురదృష్ట సంఘటనలు చోటు చేసుకున్నాయి. అమ్మ ఆరోగ్యం క్షీణిస్తుందంటూ వస్తున్న పుకార్లతో మనస్తాపానికి గురైన ఇద్దరు కార్యకర్తలు ప్రాణాలు విడిచారు. ఈ నెల నాలుగున మధురై జిల్లా ఉత్తపురానికి చెందిన 21 ఏళ్ల రాజ్ వేల్ కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకొని తీవ్ర గాయాలతో ఆసుపత్రికి చేరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడు గురువారం ప్రాణాలు విడిచాడు.

మరోవైపు తాంబరానికి చెందిన 31 ఏళ్ల అన్నాడీఎంకే కార్యకర్త సర్గుణం బుధవారం రోడ్డు మీద కిరోసిన్ పోసుకొని.. అంటించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలు అన్నాడీఎంకే పార్టీలో కలకలాన్ని రేపాయి. ఇదిలా ఉండగా..అమ్మ ఆరోగ్యం కోసం తమిళనాడు వ్యాప్తంగా వివిధ వర్గాల వారు తమకు తోచిన రీతిలో అమ్మ ఆరోగ్యం మెరుగు అవ్వాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తమిళనాడు మంత్రి వేలుమణి 336 రకాల ఔషధాలతో మూడు రోజుల పాటు మహాయాగం నిర్వహిస్తే.. మరోవైపు ముస్లింలు అమ్మ ప్రస్తుత వయసు 68 ఏళ్లు కావటంతో.. తమిళనాడు వ్యాప్తంగా ఉన్న 68 దర్గాల్లో ఆమె ఆరోగ్యం కుదుట పడాలంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అమ్మను విపరీతంగా అభిమానించే వారంతా ఎవరికి వారు తమ తమ ప్రయత్నాలు అన్నట్లుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆమె కోలుకోవాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. పోలీసులు అమ్మ ఆరోగ్యంపై పుకార్లు వ్యాపించేలా చేస్తున్న 48 మంది కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. గడిచిన 24 రోజులుగా ప్రభుత్వ కార్యకలాపాలు ఏమీ జరగకుండా ఉండిపోటంతో.. ఈ మధ్యనే అమ్మకు చెందిన శాఖల్ని తనకు బదిలీ చేసుకున్న పన్నీరు సెల్వం పాలనా అంశాల్ని పరిశీలించటంపై బిజీబిజీగా ఉన్నారు. మొత్తంగా అమ్మ కోసం తమిళనాడు రాష్ట్రం మొత్తం పడుతున్న ఆరాటం అంతా ఇంతా కాదని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/