Begin typing your search above and press return to search.

సస్పెన్స్ క్లియర్...అమ్మ చెప్పింది!!

By:  Tupaki Desk   |   11 Oct 2016 5:02 PM GMT
సస్పెన్స్ క్లియర్...అమ్మ చెప్పింది!!
X
గత 18 రోజులుగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు తమిళనాడు సీఎం జయలలిత. ఈ క్రమంలో తమిళనాడులోని పరిపాలనకు సంబందించిన ముఖ్యమైన శాఖలకు సంబందించిన కీలకమైన నిర్ణయాలు పెండింగులో పడిపోతున్నాయి. ఈ క్రమంలో రాజ్ భవన్ మంగళవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలోని నిర్ణయం అమ్మ కోరిక మేరకే అని తెలుస్తోన్న క్రమంలో ఇది కచ్చితంగా తమిళనాడులో కీలక పరిణామం అనే చెప్పాలి.

సీఎం జయలలిత ఇంకా చాలాకాలం పాటు ఆసుపత్రిలోనే ఉండాల్సిన అవసరం ఉందనే వైద్యుల సూచనల నేపథ్యంలో పరిపాలనను సంబంధించి తమిళనాడులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ముఖ్యమంత్రిగా జయలలిత నిర్వహించిన శాఖలన్నింటినీ ఆమె నమ్మిన బంటు, ప్రస్తుత ఆర్థిక మంత్రి అయిన పన్నీర్ సెల్వంకు అప్పగించారు. సోమవారం నాటికి జయ కొద్దిగా కోలుకున్నారని వైద్యులు ప్రకటించగా, తన శాఖలను పన్నీర్ సెల్వంకు అప్పగించాలనే నిర్ణయం కూడా అమ్మదేనని చెబుతున్నారు! రాజ్ భవన్ విడుదల చేసిన ఈ ప్రకటనలో రాజ్యాంగంలోని 166వ ఆర్టికల్ క్లాజ్ నెంబర్ -3 ను అనుసరిస్తూ సీఎం శాఖలను ఆర్థిక మంత్రికి అప్పగించడంతో పాటు కేబినేట్ సమావేశాలను నిర్వహించే బాధ్యతలను కూడా ఆయనకే అప్పగిస్తున్నట్లు పొందుపరచబడి ఉంది.

కాగా, తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత కీలకశాఖలైన హోం శాఖతోపాటు రెవెన్యూ, ప్రజా సంబంధాలు, సాధారణ పరిపాలన శాఖలను తన వద్దే ఉంచుకుని నిర్వహిస్తున్నారు. అయితే ఆమె గత 18రోజులుగా ఆసుపత్రికే పరిమితమైపోవడంతో పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం తలెత్తుతున్నది. దీంతో ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని ఆలోచించిన కేబినెట్ ఒక దశలో డిప్యూటీ సీఎం లేదా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిని నియమించనుంది అనే వార్తలు కూడా రాగా, తాజాగా పన్నీర్ సెల్వంకు అదనపు బాధ్యతలు కట్టబెడుతున్నట్లు రాజ్ భవన్ ప్రకటించింది.