Begin typing your search above and press return to search.

అమ్మకు వ్యతిరేకంగా పాట రాస్తే అరెస్టే

By:  Tupaki Desk   |   30 Oct 2015 6:50 PM IST
అమ్మకు వ్యతిరేకంగా పాట రాస్తే అరెస్టే
X
దేశంలోని ముఖ్యమంత్రులు ఒక ఎత్తు.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వ్యవహారం మరొక ఎత్తు. జయలలిత లాంటి ముఖ్యమంత్రులు చాలా చాలా అరుదుగా ఉంటారు. సంక్షేమ పథకాలతో తమిళ తంబీల మనసుల్లో స్థానం సంపాదించుకునే అమ్మకు అగ్రహం చాలా తొందరగా వస్తుంటుంది. ఆమె అగ్రహం తీవ్రత ఎంతన్నది తమిళ రాజకీయాలు పరిచయం ఉన్న వారందరికి సుపరిచితమే. అమ్మకు కానీ అగ్రహం వస్తే పరిస్థితి ఎంతలా మారిపోతుందో తెలుసు కాబట్టే.. కొమ్ములు తిరిగిన మొనగాళ్లు లాంటి రాష్ట్ర మంత్రులు సైతం ఒళ్లు దగ్గర పెట్టుకొని ఉంటారు. పొరపాటున కూడా తప్పు చేయటానికి సాహసించరు. ఒకవేళ తప్పు కానీ చేస్తే.. ఉదయానికే తమ ఇంటి ముందు ఉండాల్సిన ప్రభుత్వ అదికారిక వాహనం కనిపించకుండా పోయే పరిస్థితి.

మరింత స్ట్రిక్ట్ గా ఉండే అమ్మ మీద.. అగ్రహంతో ఒక జానపద కళాకారుడు పాట రాసేశాడు. అమ్మ వరకు ఈ పాట వెళ్లిందో లేదో తెలీదుకానీ.. ఈ పాట గురించి తెలిసిన వెంటనే చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసేశారు. తమిళనాడులో సుపరిచితుడైన శివదాస్ అలియాస్ కోవన్.. అమ్మ మీద కోపంతో ఒక పాట రాసేశారు.

తమిళనాడు రాష్ట్రంలో ఉన్న మద్యం దుకాణాల్ని మూసివేయాలంటూ రాసిన పాటలో.. అమ్మను అవమానించేలా కొన్ని పదాలున్నాయని ఆరోపిస్తూ కేసునమోదు చేసి అరెస్ట్ చేసేశారు. అమ్మను అవమానిస్తూ రాసిన పాటను ఇప్పటికే ఆన్ లైన్ లో పెట్టేయటంతో.. అతగాడి మీద రాజద్రోహం కేసు కూడా పెట్టేశారు. ఒక జానపద కళాకారుడు అమ్మను అవమానిస్తూ రాస్తే.. తమిళ చట్టం చూస్తూ ఊరుకుంటుందా ఏమిటి..?