Begin typing your search above and press return to search.

చైనాతో మ‌ళ్లీ చ‌ర్చ‌లు.. ఏం జ‌ర‌గ‌బోతోంది?

By:  Tupaki Desk   |   24 Jan 2021 1:40 PM IST
చైనాతో మ‌ళ్లీ చ‌ర్చ‌లు.. ఏం జ‌ర‌గ‌బోతోంది?
X
భారత్ - చైనా స‌రిహ‌ద్దులో నెల‌కొన్న వివాదం ఎంత‌కూ చ‌ల్లార‌ట్లేదు. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వ‌ద్ద గ‌త‌ 10 నెలలుగా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సరిహద్దు వివాదం తొలగిపోయి, శాంతి స్థాపించేందుకు సైనిక, దౌత్య మార్గాల్లో చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. ఇటీవ‌ల స‌రిహ‌ద్దులోకి చైనా చొచ్చుకొచ్చింద‌న్న ప్ర‌చారం నేప‌థ్యంలో మరోసారి భారత్ - చైనా చ‌ర్చ‌లు ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి.

తూర్పు లద్దాఖ్‌ లోని చుషూల్ సెక్టార్ లో భారత్‌, చైనా సైనిక కమాండర్ల మధ్య ఆదివారం 9వ రౌండ్ చర్చలు ప్రారంభం అయ్యాయి. చుషూల్ సెక్టార్‌లోని మోల్డో ప్రాంతంలో చర్చలకు వేదికైంది. దౌత్యమార్గంలో నెరపిన చర్చలకు ఫలితంగా సైనిక చర్చలకు రెండు దేశాలు అంగీకరించాయని భారత విదేశాంగ శాఖ శుక్రవారం ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలో సైనిక అధికారులు ఆదివారం భేటీ అయ్యారు.

సరిహద్దులో 2020 ఏప్రిల్ నాటి పరిస్థితులు ఉండాలని భారత్ పదేపదే కోరుతున్నా.. చైనా మాత్రం దూకుడు ప్రదర్శిస్తూ కొత్త ప్రాంతాల్లో ఆక్రమణలకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే గడిచిన 10 నెలల్లో ఇరువైపుల సైన్యాలు పలు మార్లు బాహాబాహికి దిగాయి. గతేడాది జూన్ లో గాల్వాన్ లోయలో హింసాత్మక ఘర్షణలు కూడా నెల‌కొన్నాయి. ఆ తర్వాత కాల్పులు కూడా చోటుచేసుకొని ప‌లువురు సైనికులు చ‌నిపోయిన విష‌యం తెలిసిందే.

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో చైనాకు దీటుగా భారత్ అంతే సంఖ్యలో సైన్యాలను, ఆయుధసంపత్తిని సరిహద్దులో మోహరించింది. కాగా.. ఇటీవ‌ల‌ చైనా 10వేల మంది సైనికుల‌ను వెనక్కి పంపేసింది. అయితే.. మిగిలి ఉన్న వారిలో మరింత మందిని వెనక్కి తీసుకునేలా చైనాపై ఒత్తిడి తేవాల‌ని భారత్ చూస్తోంది. ప్రస్తుతానికి తూర్పు లద్దాఖ్‌ లోని పాంగాంగ్ సరస్సు, ఆ సరస్సుకు దక్షిణ ఒడ్డున ఉన్న పర్వ‌తాల‌పై భారత్ పట్టు కొన‌సాగుతోంది. మ‌రి, ఈ ద‌శ చ‌ర్చ‌ల్లోనైనా స‌మ‌స్య‌లు ఓ కొలిక్కి వ‌స్తాయా? స‌రిహ‌ద్దులో శాంతి నెల‌కొంటుందా? అన్న‌ది చూడాలి.