Begin typing your search above and press return to search.

జీఎస్టీ వల్ల జీడీపీ ఏమీ పెరగదట

By:  Tupaki Desk   |   1 July 2017 7:31 AM GMT
జీఎస్టీ వల్ల జీడీపీ ఏమీ పెరగదట
X
జీఎస్టీ... కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ ఏకరూప పన్ను విధానం మోడీని హీరో చేస్తుందో జీరో చేస్తుందో అప్పుడే చెప్పలేం కానీ దీనివల్ల అనుకుంటున్న రేంజిలో ఏమీ ప్రయోజనాలు సిద్ధించవని అంటున్నారు. నీతి ఆయోగ్ సభ్యుడు - ప్రముఖ ఆర్థిక నిపుణుడు వివేక్ దేవ్ రాయ్ కూడా దీనిపై తన ఉద్దేశాలను నిర్మొహమాటంగా వెల్లడించారు. దీనివల్ల దేశ జీడీపీలో ఎటువంటి మార్పు రాదని ఆయన తేల్చేశారు.

జీఎస్టీ తర్వాత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 1నుంచి 1.5శాతానికి పెరుగుతుందన్న ప్రచారాన్ని వివేక్ దేవ్ రాయ్ కొట్టిపారేశారు. అదంతా పనికిమాలిన ప్రచారం అని తేల్చేశారు. అయితే జీఎస్టీతో జీడీపీ పుంజుకుంటుందన్న కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటనపై తానేమీ మాట్లాడబోనని అన్నారు. అసంపూర్ణ జీఎస్టీ విధానంతో జీడీపీ ఎంతమేర పెరుగుతుందన్న దానిపై సరైన అవగాహన లేదన్నారు.

అంతేకాదు పన్నుల స్లాబులు 5 - 12 - 18 - 28 శాతంగా వేర్వేరుగా ఉండడం కూడా ఇబ్బందేనన్నారు. హాంకాంగ్ లాంటి దేశాల్లో అన్ని రకాలైన వస్తువుల మీద ఒకే తరహా పన్ను అమలవుతోంది. కానీ మన దేశంలో ఒకటికి మించిన పన్నురేట్లు ఉండటం.. భారత ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందికరమేనని దేవ్ రాయ్ అభిప్రాయపడ్డారు. బహుళ పన్ను విధానాలు ఆర్థిక అడ్డంకులకు దారితీస్తాయని, తాను మాత్రం ఏకపన్ను విధానాన్నే సిఫారసు చేస్తానని చెప్పారు. ప్రపంచంలోని 140 నుంచి 160దేశాల్లో జీఎస్టీ అమలవుతుందన్న ప్రచారాన్ని కూడా దేవ్ రాయ్ ఖండించారు. ఆరేడు దేశాలకు మించి జీఎస్టీ ఎక్కడా అమలులో లేదన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/