Begin typing your search above and press return to search.

ఆప్ఘాన్ ప్రజలకు తాలిబన్ల భరోసా..విధుల్లోకి రావాలంటూ ఆదేశాలు !

By:  Tupaki Desk   |   17 Aug 2021 7:00 PM IST
ఆప్ఘాన్ ప్రజలకు తాలిబన్ల భరోసా..విధుల్లోకి రావాలంటూ ఆదేశాలు !
X
ఆఫ్ఘనిస్థాన్‌ లో పరిస్థితులు చేజారిపోవడంతో అక్కడి ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. గతంలో ప్రభుత్వానికి మద్దతు తెలిపినవారు, ప్రభుత్వ అధికారులు, సైన్యం, మహిళలు, ఇతర వర్గాల ప్రజలు ఆ దేశం వీడి వెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఇక దాడులకు పాల్పడబోమని ప్రకటించిన తాలిబన్ల మరో సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు. దేశ ప్రజలందరినీ, ప్రభుత్వ ఉద్యోగులకూ క్షమాభిక్ష ప్రసాదిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరాలని ఆదేశించారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ క్షమాభిక్ష ప్రసాదిస్తున్నాం, అందువల్ల మీరంతా పూర్తి విశ్వాసం, భరోసాతో జీవనం సాగించండి అని పిలుపునిచ్చారు.

ప్రస్తుతం ప్రజలంతా సాధారణ, రోజువారీ కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వ అధికారులంతా తిరిగి విధులకు హాజరుకావాలని తాలిబన్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆప్ఘాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. మళ్లీ ఆంక్షల జీవితం తప్పదని వాపోతున్నారు. ఇంతకుముందు తాలిబన్ల అరాచక పాలన అనుభవం ఉన్న ప్రజలు దేశం విడిచిపారిపోయేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. విమానాశ్రయాలకు పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే గత ఏడాది కాలం నుంచి లక్ష మంది ప్రజలు ఆప్ఘాన్ విడిచి వెళ్లారట.

తాజాగా, తాలిబన్ల పూర్తి ఆధిపత్యం చేపట్టడంతో ప్రజలు విదేశాలకు వెళ్లిపోతున్నారు. ఇతర దేశాలకు చెందినవారిని ఆయా దేశాలు తరలిస్తున్నాయి. అత్యంత ప్రమాకర పరిస్థితుల్లో ప్రయాణిస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కాబూల్ విమానాశ్రయంలో భారీగా జనం చేరడంతో యూఎస్ దళాలు కాల్పులు జరిపాయి. దీనితో ఐదుగురు మృతి చెందారు. మరోవైపు ఓ విమానం టైర్లకు తమను కట్టుకుని ప్రయాణించిన ఇద్దరు వ్యక్తులు గాలిలోకి ఎగిరిన తర్వాత కిందపడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలందరికీ క్షమాభిక్ష ఇస్తున్నామని తాలిబన్లు ప్రకటించడం చర్చకు దారితీసింది.

దాడులతో విరుచుకుపడే తాలిబన్లు ఈసారి మాత్రం ప్రజలు, అధికారులకు ఎలాంటి ఇబ్బంది కలిగించబోమని ప్రకటిస్తున్నారు. తమ పాలనలో ప్రజలకు హానీ కలిగించబోమని చెబుతున్నారు. ఇతర దేశాల పౌరులకు కూడా తాము హాని తలబెట్టబోమని చెబుతున్నారు. అయితే, ఎవరైనా తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే మాత్రం శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు. అనుమతి లేకుండా ఎవరి ఇళ్లల్లోకి ప్రవేశించొద్దని తాము ఫైటర్ల ను ఆదేశించామని, ప్రజల ప్రాణాలు, ఆస్తులు, గౌరవాన్ని పరిరక్షించాల్సిందిగా వారికి సూచనలు చేశామని తాలిబన్ల అధికార ప్రతినిధి సుహైల్ షహీన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. మరోవైపు, అమెరికా నేతృత్వంలోని కూటమి తరపున పని చేసిన వారి పైనా తాము ప్రతీకారం తీర్చుకోబోమని తాలిబన్ సహ వ్యవస్థాపకుడు అబ్దుల్ ఘనీ బరాదర్ భరోసా ఇస్తున్నారు.

అంతేగాక, ఆప్ఘాన్ ప్రజల్లో అనసవర భయాన్ని రేకెత్తించొద్దంటూ అంతర్జాతీయ సమాజాన్ని కోరుతున్నారు. అయితే, పలు ప్రాంతాల్లో ప్రజలు, అధికారులు, జర్నలిస్టుల ఇళ్లల్లోకి వెళ్లి తాలిబన్లు లూటీలకు పాల్పడుతున్నట్లు వార్తలు వినిపిస్తుండటం గమనార్హం. ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు, భద్రతా సిబ్బంది వివరాలు సేకరిస్తున్నారు తాలిబన్లు. ఇంకా ఇళ్లలోకి ప్రవేశించి నగదు లూటీ చేస్తున్నారు. అడ్డు వచ్చిన వారిపై తీవ్రంగా దాడులు చేస్తున్నారని సమాచారం. మరోవైపు, జైళ్లలో బందీగా ఉన్న తమ మద్దతుదారులను విడుదల చేస్తున్నారు. ఈ అరాచక దృశ్యాలు సోషల్ మీడియాలో తాలిబన్లు పోస్టు చేస్తుండటంతో మరింత భయాందోళనలకు కారణమవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో తమ రాయబార కార్యాలయాన్ని అమెరికా పూర్తిగా మూసివేసింది. భారత్ కూడా తమ ఎంబసీని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే రాయబార కార్యాలయ సిబ్బందిని భారత్ స్వదేశానికి తీసుకొచ్చింది. భారత్, అమెరికా, ఇతర దేశాలు ఆప్ఘాన్ నుంచి వచ్చే ప్రజలను స్వాగతిస్తున్నాయి.

అక్కడి పరిస్థితుల దృష్ట్యా భారతదేశానికి రావాలనుకునే ఆఫ్ఘన్ వాసులకు తీపికబురు చెప్పింది భారత కేంద్ర ప్రభుత్వం. భారత్ రావాలి అనుకునే వారి దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడానికి కేంద్ర హోం శాఖ మంగళవారం కొత్త కేటగిరీ వీసాలను ప్రకటించింది. వారి కోసం ప్రత్యేకంగా ‘ఇ-ఎమర్జెన్సీ ఎక్స్-మిస్క్ వీసా’ అనే కొత్త రకం ఎలక్ట్రానిక్ వీసాలను ప్రవేశపెట్టినట్లు తెలిపింది. ఇప్పటికే ఎంతోమంది ఆఫ్ఘనీయులు భారత వీసాల కోసం వేచిచూస్తున్నారు. వారికి సాధ్యమైనంత త్వరగా వీసాలు ఇచ్చేందుకు ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. "ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కేంద్ర హోంశాఖ వీసా నిబంధనలను సమీక్షిస్తోంది. భారతదేశానికి రావడానికి ఫాస్ట్-ట్రాక్ వీసా దరఖాస్తుల కోసం ప్రత్యేకంగా ‘ఇ-ఎమర్జెన్సీ ఎక్స్-మిస్క్ వీసా’ అనే కొత్త రకం ఎలక్ట్రానిక్ వీసాలను ప్రవేశపెట్టాం" అని హోం శాఖ ప్రకటించింది.