Begin typing your search above and press return to search.

మహిళా విలేకరికి ఇంటర్వ్యూ ఇచ్చిన తాలిబన్ నేత

By:  Tupaki Desk   |   18 Aug 2021 3:36 AM GMT
మహిళా విలేకరికి ఇంటర్వ్యూ ఇచ్చిన తాలిబన్ నేత
X
తాలిబన్ అన్నంతనే ఉగ్రవాదులన్న భావన కలగటం మామూలే. గతానికి వర్తమానానికి మధ్య తాలిబన్లలో వ్యత్యాసం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోందంటున్నారు. కొత్త మార్పును ఆహ్వానించటం.. తాలిబన్లు చెబుతున్న మాటలకు ప్రయారిటీ ఇచ్చే కన్నా.. ప్రజల భయాల్ని.. పెద్ద ఎత్తున వినిపిస్తున్న పుకార్లకు అంతర్జాతీయ మీడియా ఇస్తున్న ప్రాధాన్యతతో.. అఫ్గాన్ లో చోటు చేసుకుంటున్న కొత్త పరిణామాలు అంతలా ప్రచారానికి రావటం లేదు. తరచి చూస్తూ.. ఇప్పటివరకైతే తాలిబన్లలో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. వారి వైఖరి సరికొత్తగా ఉంది. ఇదంతా ఇప్పటివరకైనా.. రానున్న రోజుల్లోనూ ఇదే తీరు కొనసాగుతుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

తాలిబన్లు మారారు.. వారి వైఖరిలో మార్పు వచ్చింది. మహిళల విషయంలో తమ వైఖరి మారకపోతే.. అంతర్జాతీయ సమాజం తమను అంగీకరించదన్న విషయాన్ని వారు గుర్తించినట్లుగా కనిపిస్తోంది. తమ ఉనికి అంతర్జాతీయ నిర్ణయాలకు అనుగుణంగా ఉంటుందే తప్పించి.. తమకుతాము ఎంత అనుకున్నా.. తమను కంట్రోల్ చేసే శక్తి అగ్రరాజ్యాలకు ఉందన్న వాస్తవికతను వారు అర్థం చేసుకోవటంతో పాటు.. మారిన కాలానికి తగ్గట్లు తాము మారాలన్నట్లుగా వారి తీరు కనిపిస్తోందంటున్నారు.

ఇలాంటివేమీ లేకపోతే.. తాలిబన్ నేత ఒకరు మహిళా రిపోర్టర్ కు ఇంటర్వ్యూ ఇవ్వటాన్ని ఊహించగలమా? అంతే కాదు.. గతానికి భిన్నంగా ఈసారి తాలిబన్లు మహిళల పట్ల సానుభూతిని ప్రదర్శిస్తున్నారు. తాజాగా చేసిన ప్రకటనలో అఫ్గాన్ లో గడిచిన 40 ఏళ్లలో కొనసాగుతున్న సంక్షోభంలో మహిళలే ప్రధాన బాధితులని తాలిబన్ ప్రతినిధి ఎనాముల్లా వ్యాఖ్యానించారు. తమ పాలనలో మహిళా బాధితులు అంటూ ఎవరూ ఉండరన్నారు.

విద్య.. ఉద్యోగాల్లో మహిళలకు తగిన సానుకూల వాతావరణాన్ని కల్పిస్తామని.. ఇస్లామిక్ చట్టం ప్రకారం వివిధ ప్రభుత్వ విభాగాల్లో మహిళల్ని నియమిస్తామని చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే.. ఇస్లాం చట్టం అన్నది ఏమిటన్న దానిని మాత్రం ఆయన నిర్వచించలేదు. వివరాలు వెల్లడించలేదు. ఇస్లాం చట్టం గురించి ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదన్న రీతిలో ఆయన మాటలు ఉండటం గమనార్హం. మహిళల పట్ల తమ వైఖరి మారిందన్న దానికి నిదర్శనంగా తాలిబన్ నేత ఒకరు మహిళా విలేకరికి ఇంటర్వ్యూ ఇవ్వటం ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉంటే కాబూల్ లో వినూత్న ప్రదర్శన ఒకటి చోటు చేసుకుంది. హిజాబ్ ధరించిన మహిళలు పలువురు.. ప్రజా జీవనం నుంచి మహిళల్ని దూరం చేయకూడదంటూ వారు ప్రదర్శన చేశారు. ఇదంతా చూస్తే.. అఫ్గాన్ లో తాలిబన్ల తీరులో మార్పు వచ్చినట్లుగా చెప్పక తప్పదు. అంతేకాదు.. ఏళ్లకు ఏళ్లుగా రహస్య జీవనాన్ని గడుపుతూ.. తాలిబన్ల తరఫున ప్రకటనల్ని చేసే తాలిబన్ల ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తాజాగా బయటకు వచ్చారు. అందరిని క్షమించామని.. స్థానికులపై ఎలాంటి ప్రతీకారాలు తీర్చుకోమని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు.

మహిళా హక్కుల్ని ఇస్లాం చట్టాలకు లోబడి పరిరక్షిస్తామని చెప్పిన ఆయన.. ఇతర దేశాలతో తాము శాంతియుత సంబంధాల్ని కోరుకుంటున్నామని.. అంతర్గతంగా.. బహిర్గతంగా ఎలాంటి శత్రువుల్ని తాము కోరుకోవటం లేదని స్పష్టం చేశారు. అఫ్గాన్ నుంచి ఏ దేశానికి ముప్పు ఉండదని జబిహుల్లా తేల్చి చెప్పారు. అఫ్గాన్ నుంచి ప్రపంచ దేశాలకు ఎలాంటి ముప్పు ఉండదని తాము మాట ఇస్తున్నామని పేర్కొనటం గమనార్హం.