Begin typing your search above and press return to search.

తాలిబన్ల ఆరాచకం మళ్లీ మొదలు.. పెళ్లి కాని అమ్మాయిల జాబితా ఇవ్వాలట

By:  Tupaki Desk   |   17 July 2021 4:40 AM GMT
తాలిబన్ల ఆరాచకం మళ్లీ మొదలు.. పెళ్లి కాని అమ్మాయిల జాబితా ఇవ్వాలట
X
గడిచిన కొద్ది నెలలుగా చూస్తే.. తాలిబన్ల ఆరాచకానికి సంబంధించిన వార్తలు బాగా తగ్గిపోయాయి. గతంలో ప్రతి రోజు తాలిబన్ల ఆరాచకానికి సంబంధించిన వార్తలు పెద్ద ఎత్తున ఉండేవి. ఆ మీడియా.. ఈ మీడియా అన్న తేడా లేకుండా వీరి పైశాచికత్వానికి నిదర్శనంలా నిలిచే ఎన్నో ఉదంతాల్ని ప్రాంతీయ పత్రికల నుంచి స్థానిక పత్రికల వరకు కవర్ చేసేవారు. ఇటీవల కాలంలో ఆ జోరు తగ్గింది. అఫ్ఘానిస్తాన్ లో అమెరికన్ సైనికుల పుణ్యమా అని.. తాలిబన్లను ఎడాపెడా ఏరేశారు. దీంతో వారు బలహీనం కావటంతోపాటు.. వారి రాక్షస కార్యకలాపాలు బాగా తగ్గుముఖం పట్టాయి.

అయితే.. అప్ఘానిస్తాన్ లో అమెరికా నాయకత్వంలోని నాటో దళాలు.. క్రమపద్దతిలో వైదొలుగుతున్న నేపథ్యంలో.. ఇరాన్.. పాకిస్తాన్.. ఉజ్బెకిస్తాన్.. తజకిస్తాన్ సరిహద్దుల్లోని పలు ప్రాంతాల్లో తాలిబన్లు పట్టుసాధిస్తున్నారు. దీంతో.. వారి దురాగతాలు.. హింసా కాండ మళ్లీ మొదలైంది. ఇటీవల కాలంలో తాలిబన్ల తాకిడి తగ్గటంతో అప్ఘాన్ పౌరులకు కొత్త చిక్కులు మళ్లీ మొదలయ్యాయి. ఇంతకాలంగా వారు అనుభవిస్తున్న స్వేచ్ఛ మళ్లీ మరోసారి ప్రమాదంలో పడింది. నాటో దళాలు ఎప్పుడైతే దేశం విడిచి పెట్టి వెళుతున్నాయో.. తాలిబన్లు తమ సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు.

ఇందులో భాగంగా ఇప్పటికే పలు ప్రాంతాల్ని ఆక్రమించేసిన తాలిబన్లు.. ఆఫ్టాన్ సైనికులపై పెద్ద ఎత్తున దాడులకు దిగుతున్నారు. పలు ప్రాంతాల్లో అధిక్యతను ప్రదర్శిస్తున్నారు. ఎప్పటిలానే తాము అధిక్యత ప్రదర్శిస్తున్న ప్రాంతాల్లో తమదైన చట్టాల్ని ప్రజలపై రుద్దుతూ వారికి ప్రత్యక్ష నరకాన్ని మరోసారి పరిచయం చేస్తున్నారు. దీంతో.. వారి రాక్షస కాండకు ప్రజలు భీతిల్లిపోతున్నారు. వారిని చెదరగొట్టేందుకు అఫ్గాన్ సైన్యానికి తలకు మించిన భారంగా మారింది.

ఇదిలా ఉంటే.. తాజాగా తాలిబన్లు తాము అక్రమంచిన ప్రాంతాల్లోని ప్రజలకు కొత్త ఆదేశాల్ని జారీ చేశారు. అక్కడి మత పెద్దలైన ముల్లాలు.. ఇమామ్ లకు తమ వారికి సరిపోయే అమ్మాయిల వివరాల్ని చెప్పాలని కోరారు. తాలిబన్లకు పెళ్లిళ్లు చేయటానికి అనువైన పెళ్లి కాని అమ్మాయిల వివరాల జాబితాను ఇవ్వాలని కోరుతున్నారు. మరికొందరు అడుగు ముందుకేసి.. పెళ్లి కాని అమ్మాయిలు కనిపిస్తే చాలు.. వారిని ఎత్తుకెళ్లిపోతున్నారు. దీంతో.. ఆడ పిల్లల తల్లిదండ్రులు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. తాలిబన్ల అధిక్యత పెరిగిన నాటి నుంచి ఇంట్లో గట్టిగా మాట్లాడలేని పరిస్థితి నెలకొందని అక్కడి వారు వాపోతున్నారు. గతంలో ఏ విధంగా అయితే తాలిబన్లు తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించారో.. తాజాగా మరోసారి అలాంటి తీరునే ప్రదర్శిస్తున్నట్లుగా చెబుతున్నారు.